Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్కిన్‌ అలర్జీ ఉపాయాలు

ఆంధ్రజ్యోతి(06-07-2021)

శ్వాస సమస్యలు, జీర్ణ వ్యవస్థ ఇబ్బందులు, విరోచనం సాఫీగా అవకపోవడం లాంటి సమస్యలు ఉన్నవారికి చర్మ అలర్జీలు ఎక్కువగా వస్తాయి. వీళ్లలో వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండడం వల్ల తేలికగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. 


జీర్ణ సమస్యలను సరిచేసుకోవడం కోసం గృహ వైద్యంగా ఉదయం పరగడుపున తమలపాకుల రసం తాగడం, ఆహారంలో క్రమం తప్పకుండా కరివేపాకు పొడి వాడుకోవడం వంటివి ఉపయోగకరం. ఔషధంగా ఆరోగ్యవర్ధిని అగ్ని తుండివటి తీసుకుంటే అజీర్తి తొలగిపోతుంది. విరోచనం సాఫీగా జరగడం కోసం చింతపండుతో చేసిన పదార్థాలు, ముఖ్యంగా చింతపండు చారు, పసుపు కూర రోజూ ఆహారంలో తీసుకోవచ్చు. జిగట విరేచనాలు, ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోం ఉన్నవాళ్లు మారేడు పండుతో తయారుచేసిన బిల్వాజిల్‌ క్రమం తప్పకుండా తీసుకోవడం సహాయంగా ఉంటుంది. అరుగుదల సమస్యలు ఉన్నవాళ్లు అపక్వ, పక్వ పదార్థాలు కలిపి తీసుకోకూడదు. ఆహారం బాగా నమిలి నెమ్మదిగా తినాలి. ఉదయం పరగడుపున రెండు గ్లాసుల నీళ్లు తాగడం, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. వ్యర్థాలు బయటకువెళ్లి ఇమ్యూనిటీ పెరగడానికి ఈ అలవాటు తోడ్పడుతుంది.


శ్వాస సమస్యలు ఉన్నవాళ్లు శ్వాస వ్యాయామాలలో భాగంగా ప్రాణాయామం చేయాలి. మహా సుదర్శన వంటి ఇమ్యూనిటీ పెంచే ఔషధాలు తీసుకోవాలి. ఆహారంలో ఉసిరి తీసుకోవడం మంచిది. ఉసిరికాయ పచ్చడి రూపంలో తీసుకోవచ్చు. చర్మ సమస్యలు ఉన్నవాళ్లు చర్మానికి నువ్వుల నూనె రాసుకుని, సున్ని పిండి, కుంకుడు కాయ బావంచాలు, తుంగముస్తలు వంటి వేళ్లు మొదలైన చూర్ణాలతో స్నానం చేయడం వల్ల చర్మరంధ్రాలు శుభ్రమై చమట ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పోవాల్సిన వ్యర్థాలు వెలువడి చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. 


యాలకులు, లవంగాలు, అల్లం, దాల్చిన చెక్క మొదలైన సుగంధ ద్రవ్యాలు ఆహారంలో ఉండేలా చూసుకోవడం ద్వారా జీర్ణ ప్రక్రియ మెరుగై రోగనిరోధకశక్తి పెరిగి, అలర్జీలు తగ్గుతాయి. కుంకుమపువ్వు కూడా రక్తశుద్ధికి చాలా ఉత్తమం. దీన్ని ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్తం శుభ్రపడి అలర్జీలు తగ్గుతాయి. 


జి. శశిధర్‌,

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, కొత్తపేట, చీరాల.

Advertisement
Advertisement