Abn logo
Sep 21 2021 @ 01:26AM

అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్కిల్‌ కోర్సులు

ప్రారంభించిన జాతీయ మహిళా కమిషన్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: అమ్మాయిల్లో ఉద్యోగ సామర్థ్యాలు పెంపొందించడానికి జాతీయ మహిళా కమిషన్‌ నడుం బిగించింది. డిగ్రీ, పీజీ కోర్సులు చదివే అమ్మాయిలకు వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ దిశగా దేశంలోని యూనివర్సిటీలతో కలిసి కొన్ని కోర్సులను అందించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా హరియాణ సెంట్రల్‌ యూనివర్సిటీతో జతకట్టి సోమవారం మొదటి కోర్సును ప్రారంభించింది. కోర్సులో భాగంగా కెరీర్‌ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవల్‌పమెంట్‌ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు.


సోషల్‌ మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా ఉద్యోగాలు సాధించడం ఎలాగో నేర్పుతారు. నాయకత్వ స్థాయిలో మహిళల సంఖ్య ఇంకా చాలా పెరగాల్సి ఉందని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ ఈ సందర్భంగా అన్నారు. రెజ్యూమె తయారుచేసుకోవడం, ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం లాంటి అంశాల్లో కూడా శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా అమ్మాయిలను తీర్చిదిద్దనున్నట్టు రేఖా శర్మ తెలిపారు.