వైసీపీ ఎమ్మెల్యే భారీ స్కెచ్?

ABN , First Publish Date - 2021-09-07T06:31:39+05:30 IST

ఎమ్మెల్యే కన్నబాబురాజు..

వైసీపీ ఎమ్మెల్యే భారీ స్కెచ్?

రూ.100 కోట్ల భూమికి స్కెచ్‌?

కొమ్మాదిలో ఎకరా రూ.ఏడెనిమిది కోట్ల రూపాయలు విలువైన భూమిని కేవలం రూ.కోటిన్నరకు దక్కించుకునేందుకు కన్నబాబురాజు ప్లాన్‌

అక్కడ రిజిస్ట్రేషన్‌ విలువే రూ.2.2 కోట్లు 

రూ.1.53 కోట్లకే రిజిస్టర్‌ చేయాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖపైనా తీవ్ర ఒత్తిళ్లు

కొమ్మాదిలో భూమి రేట్లు పెంచొద్దని డిమాండ్‌

మార్కెట్‌ రేటు కంటే తక్కువకు స్టాంపు డ్యూటీ చెల్లింపు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కొమ్మాదిలో రూ.100 కోట్ల భూమిని చౌకగా కొట్టేయడానికి ఎమ్మెల్యే కన్నబాబురాజు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ భూమికి ఒరిజినల్‌ డాక్యుమెంట్లు లేవని, పోయాయని, పత్రిక ప్రకటన ఇచ్చి రిజిస్టర్‌ చేసుకోవచ్చునని దళారులు చెప్పగానే, లాభసాటి బేరం వచ్చిందనుకున్నారు. డాక్యుమెంట్లు లేవు కాబట్టి, ఆ పరంగా వచ్చే ఇబ్బందులు తాను చూసుకుంటానని, తక్కువ మొత్తం ఆఫర్‌ చేశారు. మొత్తం 12.26 ఎకరాల భూమిని కేవలం రూ.18.7 కోట్లకే దక్కించుకుందామనుకున్నారు. కరోనా రాక ముందు 2020లో ఈ డీల్‌ కుదరగా, కోటి రూపాయల అడ్వాన్స్‌తో ఆ పార్టీ మరో దగ్గరకు వెళ్లకుండా కట్టడి చేశారు.


2020 ఆగస్టులో భూముల విలువలు పెంచడానికి రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేసినప్పుడు, ఆ శాఖ అధికారులను కలిసి కొమ్మాదిలో భూముల విలువలు పెంచవద్దని కోరారు. ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్నదని, పెంచకపోతే ఇబ్బందులు వస్తాయని అధికారులు చెప్పినా వినిపించుకోలేదు. తాను అక్కడ పెద్ద మొత్తంలో భూమి కొంటున్నానని, రేట్లు పెరిగితే ఎక్కువ మొత్తం ఫీజులు చెల్లించాల్సి వస్తుందని, పెంచవద్దని తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెట్టారు. దాంతో అధికారులు మధ్యేమార్గంగా ఓ సూచన చేశారు. తమ పద్ధతి ప్రకారం అక్కడి రేట్ల ప్రకారం పెంచుతామని, నిర్ణయం ప్రభుత్వానిదేనని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో 47-ఏ సెక్షన్‌ ప్రకారం మార్కెట్‌ రేటు తగ్గించాల్సిందిగా దరఖాస్తు చేసుకుంటే...పరిశీలించి, ఉన్నతాధికారుల సూచన మేరకు ఏమైనా చేయగలుగుతామని పేర్కొన్నారు. దాంతో ఆయన అప్పటికి వెనక్కి తగ్గారు.


గడువుకు ముందే రిజిస్ట్రేషన్‌కు యత్నం

కొమ్మాదిలో భూమిని తాము కొంటున్నామని ఎవరికైనా అభ్యంతరాలు వుంటే వారం రోజుల్లో చెప్పాలని కన్నబాబురాజు కుటుంబం గత నెల ఆగస్టులో పత్రిక ప్రకటన ఇచ్చింది. అందులో పేర్కొన్న గడువు ముగియకముందే మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో గత నెల 26న భూమి రిజిస్ర్టేషన్‌ కార్యక్రమం పెట్టుకున్నారు. దీనిపై అదే నెల 25న ప్రసన్న (కృష్ణ చౌదరి భార్య) తరపు లాయర్‌ ఫోన్‌ చేసి తమ అభ్యంతరాలు వ్యక్తంచేసినా కన్నబాబు అండ్‌ కో పట్టించుకోలేదు. ఆ మరుసటిరోజునే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలనుకున్నారు. ఈ విషయాన్ని కూడా బాధిత కుటుంబం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది.


రేటు తగ్గించాల్సిందిగా దరఖాస్తు

కొమ్మాదిలో భూముల ధరలు చాలా ఎక్కువ. ఎకరా ఎలా లేదన్నా రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే 12.26 ఎకరాల భూమి ధర రూ.100 కోట్లపైనే పలుకుతుంది. కానీ అక్కడ ప్రభుత్వ రిజిస్ర్టేషన్‌ ధర రూ.2.2 కోట్లు మాత్రమే ఉంది. అది కూడా ఎక్కువ ధర అని, తమకు రూ.1.53 కోట్లకే రిజిస్టర్‌ చేయాలంటూ...ఆ లెక్క ప్రకారమే ఆయన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించారు. సెక్షన్‌ 47-ఏ ప్రకారం తనకు ఆ రేటునే ఫిక్స్‌ చేయాలంటూ జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారం రెగ్యులర్‌ వాటికి భిన్నంగా వుండడంతో అధికారులు ఓ నంబరు వేసి పెండింగ్‌లో పెట్టారు. దీన్ని క్లియర్‌ చేసే విషయంలో ఒత్తిళ్లు తెచ్చినట్టు సమాచారం.


భూ వివాదంపై సీఎం పేషీ ఆరా

కొమ్మాదిలో రూ.100 కోట్ల విలువైన రూ.12.26 ఎకరాల భూమి కొనుగోలులో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు పాత్రపై ముఖ్యమంత్రి పేషీ ఆరా తీస్తోంది. అమెరికాలో వున్న వ్యక్తికి చెందిన భూమిని విక్రయించడానికి యత్నించిన వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. అమెరికాలో వుంటున్న మరొక నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ వివాదం సీఎం పేషీ వరకు వెళ్లింది. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం వివరాలతో ఫైలు సీఎం పేషీకి వెళ్లడంతో సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. 


చేతులు మారింది రూ.5 కోట్లు

కొమ్మాది భూ మాయలో ఇద్దరు నిందితులు అరెస్టు

అమెరికాలో మరొకరు...త్వరలో రప్పించే ప్రయత్నం

పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): కొమ్మాదిలో రూ.100 కోట్ల భూ మాయ కేసులో మొత్తం రూ.5 కోట్లు చేతులు మారాయని, ముగ్గురు నిందితులు కాగా ఇద్దరిని అరెస్టు చేశామని, మరొకరిని అరెస్టు చేయాల్సి వుందని పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు. పోలీస్‌ కమిషనరేట్‌లో నార్త్‌ ఏసీపీ చుక్కా శ్రీనివాసరావుతో కలిసి ఆయన సోమవారం సాయంత్రం విలేఖరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. 


కాకినాడలోని ఇంద్రపాలెం పోస్టాఫీసు వీధికి చెందిన వాసంశెట్టి జయసూర్య (51) ఈ కేసులో కీలక నిందితుడు (ఏ-1). తుమ్మల కృష్ణ చౌదరికి కొమ్మాదిలో వున్న 12.26 ఎకరాల భూమికి సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీలను మీ-సేవ ద్వారా తీసుకున్నాడు. వాటి ద్వారా ఆ భూమిని అమ్మకానికి పెట్టాడు. నగరంలోని నారాయణ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ ఆ తరువాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి వచ్చిన జరజాపు శ్రీనివాసరావు (51) స్వస్థలం విజయనగరం జిల్లా సాలూరు. విశాఖలోని వైర్‌లెస్‌ కాలనీలో కుటుంబంతో ఉంటున్నాడు. ఇతను ఈ కేసులో ఏ-2 నిందితుడు. జయసూర్య చెప్పిన కొమ్మాది భూమిని విక్రయించడానికి జరజాపు శ్రీనివాసరావు పీఎం పాలెంలో వుంటున్న నాగోతి అప్పలరాజును సంప్రతించాడు. అతడి ద్వారా మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సనపల చంద్రమౌళిని కలిశారు. ఆయన వీరిని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుకు పరిచయం చేశారు.


భూమిని కశ్యప్‌ డెవలపర్స్‌ ఎండీ సుకుమారవర్మ ఉరఫ్‌ తేజ (ఎమ్మెల్యే కన్నబాబు కుమారుడు) పేరు మీద కొనడానికి చర్చలు జరిగాయి. 12.26 ఎకరాలను రూ.18.7 కోట్లకు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. భూమి అమెరికాలో వుంటున్న తుమ్మల చౌదరిది కావడంతో ఆయనతో మాట్లాడిస్తామని చెప్పి ఏ-1, ఏ-2 నాటకం ఆడారు. అమెరికాలో వుంటున్న బి.ఆనందరాజు (నల్గొండ నివాసి)కు ఫోన్‌ చేసి, తాము ఫోన్‌ చేసినప్పుడల్లా కృష్ణ చౌదరిలా మాట్లాడాలని ఒప్పించారు. అందుకు కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ డీల్‌లో లావాదేవీల కోసం కూర్మన్నపాలెంలోని ఐసీఐసీఐ బ్యాంకులో కృష్ణ చౌదరి పేరుతో ఖాతా తెరిపించారు. అప్పటికే ఏ-1 జయసూర్యకు ఆ బ్రాంచీలో ఖాతా వుండడంతో వారు అంగీకరించారు. కన్నబాబు నుంచి ఈ డీల్‌ కోసం దఫదఫాలుగా రూ.49 లక్షలు, రూ.50 లక్షలు, రూ.2.5 కోట్లు, రూ.1.5 కోట్లు మొత్తం రూ.4.99 కోట్లు తీసుకున్నారు. ఇదిలావుండగా జయసూర్యకు విజయనగరం జిల్లా భోగాపురంలో ఒక భూమిని తనఖా పెట్టి కృష్ణచౌదరి భార్య లక్ష్మీ సూర్య ప్రసన్న రూ.45 లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ లావాదేవీలు బ్యాంకు ద్వారా జరిగాయి. భూమి రిజిస్ట్రేషన్‌కు కన్నబాబురాజు పత్రిక ప్రకటన ఇచ్చి అభ్యంతరాలు ఆహ్వానించారు. ఆ విధంగా తమ భూమిని ఎవరో అమ్ముతున్నారని తెలుసుకున్న ప్రసన్న విశాఖపట్నం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేసి మొదట ఏ-2 జరజాపు శ్రీనివాసరావును, సోమవారం ఏ-1 జయసూర్యను అరెస్టు చేశారు. మూడో నిందితుడు బి.ఆనందరాజును అమెరికా నుంచి రప్పించాల్సి వుందని వెల్లడించారు.



Updated Date - 2021-09-07T06:31:39+05:30 IST