విశాఖలోనే తొలి సిపాయిల తిరుగుబాటు

ABN , First Publish Date - 2022-08-14T06:49:02+05:30 IST

బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీపై 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది.

విశాఖలోనే తొలి సిపాయిల తిరుగుబాటు

1780 అక్టోబరు 3న సంఘటన 

నేతృత్వం వహించిన షేక్‌ మహ్మద్‌ఖాన్‌ 

ముగ్గురు బ్రిటీష్‌ సైనికుల ఊచకోత

మరో ఇద్దరు అధికారులకు తీవ్ర గాయాలు

గజిట్‌లో ప్రచురించిన ఆంగ్లేయులు  

లండన్‌ మ్యూజియంలో ఆధారాలు భద్రం

తిరుగుబాటుదారులను అత్రి క్రూరంగా హింసించి ఉరితీసిన బ్రిటీషర్లు

స్మారక స్థూపం ఏర్పాటుపై స్పందించని మన ప్రభుత్వాలు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీపై 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆంగ్లేయుల అకృత్యాలపై జరిగిన ఈ తిరుగుబాటే స్వాతంత్య్ర పోరాటానికి నాంది అని...అని చరిత్రకారులు నిర్ధారించడంతో దానికి ఎనలేని ప్రాధాన్యం లభించింది. కానీ అంతకంటే ముందే మూడు పర్యాయాలు సిపాయిల తిరుగుబాటు జరిగిందని బ్రిటిష్‌ పాలకులే అంగీకరించి, వాటిని గజిట్‌లో ప్రస్తావించారు. వీటికి సంబంధించిన ఆధారాలు లండన్‌ మ్యూజియంలో లభిస్తాయి. ఇందులో మొదటిది 1780 అక్టోబరు మూడో తేదీన విశాఖపట్నం (ప్రస్తుతం క్వీన్‌ మేరీస్‌ పాఠశాలకు ఎదురుగా పాత రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ పరిసరాలు)లో జరిగింది. అనంతరం 1806లో తమిళనాడులోని వెల్లూరు, 1824లో బారక్‌పూర్‌ (పశ్చిమ బెంగాల్‌)లో సిపాయిల తిరుగుబాట్లు జరిగాయి. 

మైసూరు నవాబు హైదరాలీ, బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ మధ్య 1780 సెప్టెంబరులో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హైదరాలీ దాదాపు పైచేయి సాఽధించే పరిస్థితులు కనిపించడంతో ఆంగ్లేయులు అప్రమత్తమయ్యారు. మద్రాస్‌ రాష్ట్రంలో ఉత్తరాన విశాఖపట్నం, మచిలీపట్నంలో సైనిక దళాలు ఉండేవి. ఈ దళాలను కర్ణాటక యుద్ధంలో పాల్గొనాలని ఆదేశాలు వచ్చాయి. మచిలీపట్నం రేవు నుంచి కొంతసైన్యం బయలుదేరింది. అయితే విశాఖ సర్కార్స్‌ పరిధిలో గ్రేండియర్స్‌ రెజ్‌మెంట్‌ నుంచి సైన్యాన్ని ఓడలో మద్రాసుకు, అక్కడి నుంచి మైసూరుకు తరలించాలని నిర్ణయించారు. 1780 అక్టోబరు మూడో తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇక్కడి సైనికులు ఓడ ఎక్కడానికి తిరస్కరించారు. ఈ దశలో బ్రిటీష్‌ సైనికాధికారులు ఒత్తిడి తేవడంతో మహ్మద్‌ షేర్‌ఖాన్‌ నేతృత్వంలో కొందరు భారతీయ సిపాయిలు తిరగబడి వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బ్రిటీష్‌ సైన్యానికి చెందిన లెఫ్ట్‌నెంట్‌ క్రిప్స్‌, సైనికులు కింగ్స్‌ ఫోర్డ్‌ వెన్నర్‌, రూథర్‌ఫర్డ్‌ చనిపోయారు. కెప్టెన్‌ మేక్స్‌టన్‌, కెప్టెన్‌ లాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం భారతీయ సైనికులు ఏకమై బ్రిటీష్‌ సైన్యానికి చెందిన ముఖ్య అధికారిని బంఽధించారు. ఖజానా లూటీ చేసి రూ.21,999తోపాటు ఆయుధాలు తీసుకుని హైదరాలీకి మద్దతుగా నిలిచేందుకు బయలుదేరారు. కాగా స్థానిక జమీందారులు అందించిన సమాచారంతో మహ్మద్‌ఖాన్‌, కొంతమంది సైనికులను పాయకరావుపేట సమీపంలోనే పట్టుకున్న బ్రిటీష్‌ అధికారులు వారిని విశాఖ తీసుకువచ్చి తొలుత కోర్టు మార్షల్‌ నిర్వహించారు. అనంతరం అతి క్రూరంగా హింసించి ఉరితీశారు. సిపాయిల తిరుగుబాటు ఘటనలో చనిపోయిన ముగ్గురు బ్రిటీషర్లను వన్‌టౌన్‌ డచ్‌ సెమెట్రీలో సమాధి చేశారు. వారిలో వెన్నర్‌ సమాధిపై ఆధారాలుండగా, మిగిలిన ఇద్దరి సమాధులపై పలకలు కనిపించడం లేదు. 


స్థూపం ఏర్పాటుపై కనిపించని శ్రద్ధ 

తొలి సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన షేక్‌ మహ్మద్‌ఖాన్‌తో పాటు మిగిలిన సైనికుల త్యాగాలను గుర్తించాల్సిన పాలకులు ఇప్పటికీ స్పందించడం లేదు. వారి త్యాగ నిరతిని భావితరాలకు చాటిచెప్పేలా స్మారక స్థూపం నిర్మించడంపైనా అడుగు ముందుకు పడలేదు. తమిళనాడు వెల్లూరులో 1806లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు 200 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా అప్పటి సీఎం కరుణానిధి స్మారక స్థూపం నిర్మించి పోస్టల్‌ కవర్‌, స్టాంపు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన గుర్తులను పదిలపరచాలని ఇంటాక్‌ విశాఖ చాప్టర్‌ సభ్యుడు ఎడ్వర్డ్‌ పాల్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా కలెక్టర్లతోపాటు ప్రజా ప్రతినిధులను కలిసి దాని ప్రాధాన్యం వివరిస్తున్నారు. 

ప్రస్తుతం కోటవీధికి వెళ్లే దారిలో పాత రిజిస్ట్రార్‌ కార్యాలయం వెనుకఉండే బ్యారెక్స్‌లో సిపాయిలు తిరుగుబాటు చేశారని, అదే ప్రాంతంలో ఐదు నుంచి పది సెంట్ల స్థలంలో స్థూపం నిర్మించడంతో పాటు ఈ ఘటన ప్రాధాన్యం తెలియజేస్తూ పోస్టల్‌ కవర్‌, స్టాంపు విడుదల చేయాలని కోరుతున్నారు. తొలి సిపాయిల తిరుగుబాటు విషయాలను బ్రిటీషర్లు లండన్‌ మ్యూజియంలో  భద్రంగా దాచుకున్నారని పేర్కొంటూ, వారికున్న శ్రద్ధ మన పాలకుల్లో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-14T06:49:02+05:30 IST