విజయవాడ: ఉద్యోగులు తమ హక్కులను కాపాడుకోవడానికి ఎదురు చూసి నాయకుల చేతిలో భంగపాటుకు గురయినందుకు ఈ నెల ఆరో తేదీన నయవంచన దినంగా పరిగణిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వినుకొండ రాజారావు, కొండపల్లి శ్రీనివాసరావులు గురువారం ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన ఉద్యోగులు తమ ఆకాంక్షలను, హక్కులు సాధించుకోవడానికి పెద్ద ఎత్తున ఛలో విజయవాడకు తరలి వచ్చారన్నారు. అటువంటి చారిత్రాత్మక సంఘటనను కొంతమంది నాయకులు తమకు అనుకూలంగా మలచుకుని ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. తామే ఉద్యోగులకు భరోసాగా ఉంటామని, బాధ్యత అని చెప్పిన నాయకులు ఏ ఒక్కరూ దానిని అమలు చేయలేదన్నారు. విజయవాడలో ఉద్యోగుల నిరసనకు నెల పూర్తి అయిందని, ఉద్యోగులు భంగపాటుకు గురయ్యారని వీటిన్నింటిని గుర్తు చేస్తూ ఆరో తేదీన నయవంచన దినాన్ని పాటించాలని సూచించారు.