Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పండుగ వేళ విషాదం!

twitter-iconwatsapp-iconfb-icon
పండుగ వేళ విషాదం!రాంబాబు మృతదేహాన్ని పరిశీలిస్తున్న స్థానికులు

- వేర్వేరు ఘటనల్లో ఆరుగురి దుర్మరణం

- నాగావళి నదిలో గల్లంతైన ముగ్గురి మృతి

- చెరువులో పడి మరొకరు..

- రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన వైనం

- మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు

పండుగ వేళ.. ఆ కుటుంబాల్లో అంతులేని విషాదం అలుముకుంది. సోమవారం వేర్వేరు ఘటనల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. రెండు రోజుల కిందట నాగావళి నదిలో గల్లంతైన ముగ్గురు.. విగతజీవులుగా ఒడ్డుకు చేరారు. సరదాగా ఈత కోసం చెరువులో దిగి మరొకరు మృత్యువాత పడ్డారు. అత్తవారింటికి వెళ్లి వస్తుండగా ఇంకొకరు రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చిన మరో వ్యక్తిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. వీరంతా పండుగ పూట విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 

--------------------

గల్లంతైన వ్యాపారి మృతి

సంతకవిటి, జనవరి 17: నాగావళి నదిలో ఇటీవల ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయిన చిరు వ్యాపారి బొచ్చ భాస్కరరావు (45) మృతదేహం సోమవారం సాయంత్రం పోడలి గ్రామం వద్ద బయటపడింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ జనార్దనరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భాస్కరరావుది నిరుపేద కుటుంబం. ఊరూరా కూరగాయలు విక్రయించే భాస్కరరావు ఈ నెల 14న బూర్జ, ఖండ్యాం గ్రామాల మధ్య నాగావళి నదిలో దిగగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు వెతికినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం పోడలి వద్ద భాస్కరరావు మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రాజాం సీహెచ్‌సీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జనార్దనరావు తెలిపారు.

 

తాతగారింటికి వచ్చి.. మృత్యు ఒడిలోకి

ఆమదాలవలస, జనవరి 17: తాతగారి ఇంటికి పండుగకు వచ్చిన ఆ యువకుడి మృతి కుటుంబ సభ్యులను కలచివేసింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ మాధవధారకు చెందిన అన్నెపు అనీల్‌కుమార్‌ (21) బెలమాంలోని తాతగారింటికి సంక్రాంతికి వచ్చాడు. ఆదివారం నాగావళి నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు, పోలీసులు వెతికినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలోని దత్తాత్రేయ కాలనీ సమీపంలోని నాగావళి నదిలో మృతదేహం తేలింది.  పోలీసులు పరిశీలించి అనీల్‌కుమార్‌ మృతదేహంగా నిర్ధారించారు. కుటుంబసభ్యులకు సమాచారమందించారు. తల్లిదండ్రులు కొండలరావు, రమణమ్మ, సోదరుడు విజయ్‌కుమార్‌ మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. అనీల్‌కుమార్‌ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫైననీలియర్‌ చదువుతున్నాడు. ఈ ఘటనతో బెలమాంలో విషాదం అలుముకుంది. మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 


అదృశ్యమై.. శవమై తేలిన కానిస్టేబుల్‌

ఎచ్చెర్ల, జనవరి 17: ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ తెప్పరేవు సమీపంలో అదృశ్యమైన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ షేక్‌ అన్వర్‌(35) ఇదే మండలం బొంతలకోడూరు పంచాయతీ కాళింగపేట వద్ద నాగావళి నదీ తీరంలో శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించి ఎచ్చెర్ల ఎస్‌ఐ కె.రాము తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం వాంబే కాలనీలో నివాసం ఉంటున్న అన్వర్‌ శనివారం స్నేహితులతో నాగావళి నది వద్దకు సరాదాగా వెళ్లాడు. ఆ క్రమంలో అక్కడే బహిర్భూమికి వెళ్లి, ప్రమాదవశాత్తూ నదిలో జారి పడ్డాడు. అన్వర్‌ తిరిగి ఇంటికి చేరకపోవడంతో, ఆందోళన చెందిన ఆయన భార్య రహీనాద్‌ ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు. కాగా, సోమవారం అన్వర్‌ మృతదేహం కాళింగపేట వద్ద నదీతీరంలో లభ్యమైంది. మృతుని తలపై గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాము తెలిపారు.


అత్తారింటికి వెళ్లి వస్తుండగా..

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

భామిని/హిరమండలం, జనవరి 17: పండుగకు అత్తవారింటికి వచ్చిన తొట్టు కుమారస్వామి (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. కాట్రగడ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హిరమండలం బస్టాండ్‌ ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన తొట్టు కుమారస్వామి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సంక్రాంతికి భార్య, పిల్లలతో కలిసి అత్తవారి గ్రామమైన బత్తిలి వచ్చాడు. సోమవారం ఇంటికి తిరుగుముఖం పట్టాడు. భార్య, ముగ్గురు పిల్లలను బస్సులో ఎక్కించి తాను ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కాట్రగడ సమీపంలో బైక్‌ అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీ రాడ్డును ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం వద్ద భార్య పార్వతి, ముగ్గురు పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ ఘటనపై బత్తిలి ఎస్‌ఐ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

ఉసురుతీసిన ఈత సరదా

చెరువులో పడి వ్యక్తి మృతి 

సారవకోట (జలుమూరు) జనవరి 17: ఈత సరదా వ్యక్తి ఉసురుతీసింది. చెరువులో స్నానానికి దిగి భోగి భరణికుమార్‌ (38) దుర్మరణం పాలయ్యాడు. సారవకోట మండలం భద్రాచలంలో సోమవారం వెలుగుచూసిన ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం న్యూకాలనీకి చెందిన భరణీకుమార్‌ పండుగకు కుటుంబంతో కలిసి అత్తవారి గ్రామమైన భద్రాచలం వచ్చాడు. ఆదివారం సాయంత్రం స్నానానికి చెరువుకు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. కానీ ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. అయినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం ఉదయం చెరువు వద్ద మృతదేహం తేలియాడింది. మృతుడికి భార్య రోజా, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లావణ్య తెలిపారు. 


 లారీ రూపంలో కబళించిన మృత్యువు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 17 : సంక్రాంతి పండుగ చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చిన ఆ వ్యక్తిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  పెద్దపాడు పంచాయతీ జాడపేట గ్రామానికి చెందిన జాడ రాంబాబు(38) విశాఖలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగ కోసం రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం సాయంత్రం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో హైవే దాటుతుండగా, ఎదురుగా వస్తున్న లారీ(కేఏ01 ఏడీ7326) ఢీకొట్టింది. రాంబాబు ఘటనాస్థలంలోనే కన్నుమూశాడు. మృతుడికి భార్య అప్నన్న, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.