న్యూఢిల్లీ : ఆరుగురు టీఎంసీ ఎంపీలు బుధవారం రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. పెగాసస్ స్పైవేర్‌పై బుధవారం ఉదయం వీరు సభలో రభస సృష్టించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు రాజ్యసభ ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం జరిగే మిగతా కార్యకలాపాలకు సభలో పాల్గొనరాదని వీరిని ఆదేశించినట్లు పేర్కొంది.
డోలా సేన్, మహమ్మద్ నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంత ఛేత్రి, అర్పిత ఘోష్, మౌసమ్ నూర్‌లను బుధవారం జరిగే మిగతా సభా కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఈ ప్రకటన తెలిపింది. సభలో కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో వీరు వెల్‌లో ప్రవేశించారని, ప్లకార్డులు చూపుతూ, అధ్యక్ష స్థానం పట్ల అవిధేయత ప్రదర్శించారని తెలిపింది. సభలో ఈ ఆరుగురి ప్రవర్తన సక్రమంగా లేదని వివరించింది. వీరిని రూల్ 255 ప్రకారం తక్షణమే సభ నుంచి వెళ్లిపోవాలని చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఆదేశించినట్లు పేర్కొంది.
పెగాసస్ స్పైవేర్ వివాదంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్పైవేర్‌ను ఉపయోగించి ప్రతిపక్ష నేతలపైనా, ప్రభుత్వాన్ని విమర్శించేవారిపైనా నిఘా పెట్టినట్లు ఆరోపిస్తున్నాయి.