శవాల దిబ్బ.. స్పెయిన్‌!

ABN , First Publish Date - 2020-04-02T06:49:24+05:30 IST

రోజుకు ఆరేడు వేల పాజిటివ్‌ కేసులు.. ఎనిమిది వందలకు తగ్గని మరణాలు..! స్పెయిన్‌లో కరోనా ఉధృతి ఇది. మరో 864 మంది మృతితో బుధవారం నాటికి దేశంలో వైర్‌సకు బలైనవారి సంఖ్య 9

శవాల దిబ్బ.. స్పెయిన్‌!

  • 9 వేలు దాటిన మరణాలు, లక్షపైనే కేసులు
  • ప్రపంచవ్యాప్తంగా 46వేలకు చేరిన మృతులు
  • 9 లక్షలను మించిన పాజిటివ్‌ కేసులు
  • దక్షిణాఫ్రికాలో భారత సంతతి శాస్త్రవేత్త మృతి

మాడ్రిడ్‌, రోమ్‌, లండన్‌, ఏప్రిల్‌ 1: రోజుకు ఆరేడు వేల పాజిటివ్‌ కేసులు.. ఎనిమిది వందలకు తగ్గని మరణాలు..! స్పెయిన్‌లో కరోనా ఉధృతి ఇది. మరో 864 మంది మృతితో బుధవారం నాటికి దేశంలో వైర్‌సకు బలైనవారి సంఖ్య 9 వేలు దాటింది. కేసులు లక్షను మించాయి. తాగాగా 727 మంది చనిపోవడంతో ఇటలీలో మృతుల సంఖ్య 13,155 వేలకు చేరింది. ఫ్రాన్స్‌, యూకే (563), బెల్జియం (123), నెదర్లాండ్స్‌ (134) సహా యూర్‌పలోనే కరోనా మృతుల సంఖ్య 30 వేలపైగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 46వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌ తో బ్రిటన్‌లో బాలుడు (13), బెల్జియంలో బాలిక (12) చనిపోయారు. కరోనా లక్షణాలతో దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వైరాలజీ శాస్త్రవేత్త గీతా రామ్‌జీ (64) కన్నుమూశారు. టీకా శాస్త్రవేత్త, హెచ్‌ఐవీ నిరోధక పరిశోధక బృంద నాయకురాలైన గీతా.. గతవారం లండన్‌ నుంచి వచ్చారు. డర్బన్‌లోని సౌతాఫ్రికన్‌ మెడికల్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌లో ఆమె పనిచేస్తున్నారు. ఇరాన్‌లో  మరో 138 మంది మృతిచెందారు. పాకిస్థాన్‌లో కేసుల సంఖ్య 2 వేలు దాటింది. 


సంక్షోభంలోనూ పాక్‌లో మత వివక్ష

కరోనాపై పోరాటంలో ప్రపంచమంతా ఒక్కటవుతుంటే.. పాకిస్థాన్‌ మాత్రం తన వక్ర బుద్ధిని చాటుకుంటోంది. కరాచీలోని రెహ్రీ ఘోత్‌ వద్ద ఆహార పదార్థాలు, నిత్యావసరాల పంపిణీని ముస్లింలకే పరిమితం చేశారు. ‘మా అబ్బాయి రిక్షా కార్మికుడు. ఇప్పుడు పనిలేక ఇంట్లో ఉంటున్నాడు. రేషన్‌ సెంటర్లకు వెళ్తే మీకు ప్రత్యేక వాహనంలో పంపుతామని చెబుతున్నారు. అదంతా అబద్ధమే. మా ఇరుగుపొరుగు ఉన్న ముస్లింలకు మాత్రం సరుకులు వస్తున్నాయి’ అని ఓ హిందువు చెప్పుకొచ్చాడు.  


యూరప్‌లో ఐసీయూ మంచాల కొరత

యూర్‌పలోని ఆసుపత్రుల్లో ఐసీయూల కొరత నెలకొంది. వైద్య సిబ్బందికి రక్షణ సామగ్రి కరువయ్యాయి.. తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నా.. లక్షల సంఖ్యలో కేసులు వస్తుండటంతో అవి చాలడం లేదు. దీంతో రోగులను హై స్పీడ్‌ రైళ్లు, సైనిక విమానాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Updated Date - 2020-04-02T06:49:24+05:30 IST