ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-04-11T04:39:51+05:30 IST

పుల్లంపేట మండలం బోటుమీదపల్లి బ్రిడ్జి సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు.

ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

20 దుంగలు, కారు, ఆటో, రెండు కొడవళ్లు స్వాధీనం

అరెస్టయిన వారిలో ఇరువురు ఔట్‌సోర్సింగ్‌ గార్డు వాచర్లు

కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్‌


కడప (క్రైం), ఏప్రిల్‌ 10 : పుల్లంపేట మండలం బోటుమీదపల్లి బ్రిడ్జి సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. అరెస్టయిన వారిలో ఇరువురు మాజీ ప్రొటెక్షన్‌ వాచర్లు ఉన్నట్లు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో ఓఎస్డీ దేవప్రసాద్‌, ఎస్బీ స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ పుల్లయ్య, రాజంపేట రూరల్‌ సీఐ నరేంద్రరెడ్డితో కలిసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రాజంపేట సబ్‌ డివిజన్‌ ప్రాంతానికి చెందిన కుర్నూతల ప్రభాకర్‌ (40) అతడి తండ్రి ఎఫ్‌బీఓగా రిటైర్‌ అయ్యారు. అలాగే మన్నూరు విశ్వనాధరెడ్డి (35), ఇరుగూరి గిరిబాబు అలియాస్‌ బంగరి (30), కుర్రా సుబ్రమణ్యం అలియాస్‌ మణి (41), గతంలో అవుట్‌సోర్సింగ్‌ కింద ప్రొటెక్షన్‌ వార్డు వాచర్‌గా పనిచేసిన పోలి హరిక్రిష్ణ (26), అనుంపల్లి రవి (50)లను అరెస్టు చేశారు. వీరు 599 కిలోలు బరువున్న 20 ఎర్రచందనం దుంగలు, రెండు కొడవళ్లు, ఐదు కర్రలతో స్కోడా కారులో తీసుకెళుతుండగా ఆటోలో పైలెట్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం రావడంతో రాజంపేట సీఐ నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో పుల్లంపేట ఎస్‌ఐ వినోద్‌కుమార్‌, సిబ్బందితో దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు వెళ్లిన తమ సిబ్బందిపై దాడి యత్నం చేశారన్నారు. వారిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు. గతంలో రాజంపేటలో పట్టుబడ్డ కంటైనర్‌కు సంబంధించిన కేసుల్లో కూడా వీరు నిందితులుగా ఉన్నారన్నారు.


సిబ్బందిని అభినందించిన ఎస్పీ 

ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజంపేట రూరల్‌ సీఐ నరేంద్రరెడ్డి, పుల్లంపేట ఎస్‌ఐ వినోద్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు, అమర్‌నాధ్‌, పీసీలు మనోజ్‌, నాగేశ్వరయ్య, మహేష్‌, హోంగార్డు ఈశ్వర్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులను అందజేశారు.


ఎర్రచందనం జోలికి వెళితే కఠిన చర్యలు 

ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్‌ హెచ్చరించారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 12 మందిపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. 2019లో 48 కేసులు నమోదై 223 మందిని అరెస్టు చేసి 827 దుంగలను సీజ్‌ చేశామన్నారు. 2020లో 53 కేసులు నమోదు చేసి 269 మందిని అరెస్టు చేసి 647 దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 2021లో ఇప్పటి వరకు 20 కేసులు నమోదు చేసి 191 మందిని అరెస్టు చేశామని, 188 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎర్రచందనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సమాచారాన్ని పోలీసులకు తెలియచేయాలన్నారు. 



Updated Date - 2021-04-11T04:39:51+05:30 IST