ఒకే రోజు ఆరుగురికి

ABN , First Publish Date - 2020-03-29T09:12:43+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఒకేసారి ఆరు పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి బావమరిదికి...

ఒకే రోజు ఆరుగురికి

  • గుంటూరుకు చెందిన తొలి బాధితుడి కాంటాక్ట్‌తో మరో ఇద్దరికి పాజిటివ్‌
  • చీరాలలో ఇద్దరు దంపతులకు కరోనా
  • కృష్ణా, కర్నూలు జిల్లాల్లో చెరొకటి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఒకేసారి ఆరు పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి బావమరిదికి పాజిటివ్‌ రాగా... ఆయన భార్యకూ వైరస్‌ సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. తాజాగా... ప్రజాప్రతినిధి బావమరిదితో కలిసి ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించిన ఇద్దరు సన్నిహితులకూ వైరస్‌ సోకింది. వెరసి... గుంటూరులో పాజిటివ్‌ల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన 60ఏళ్ల వ్యక్తి ఇటీవల ఈనెల 13న ఒంగోలు నుంచి రైలులో ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ 4రోజులు బసచేసి, 18న విజయవాడ చేరుకున్నారు. తిరిగి చీరాల వెళ్తూ ఒంగోలులోని కుమారుడి ఇంట్లో బస చేశారు. ఇప్పుడు ఆయనకూ, ఆయన భార్యకూ కరోనా పాజిటివ్‌ వచ్చింది.


కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సంకు చెందిన రైల్వేఉద్యోగి(23) కీ పాజిటివ్‌ వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన ఈ యువకుడు ఇటీవల ఐదుగురు స్నేహితులతో స్వగ్రామంతో పాటు పలు ప్రాంతాల్లో తిరి గారు. ఢిల్లీ నుంచి రైలులో హైదరాబాద్‌కు, తర్వాత మరో రైలులో నొస్సం వచ్చారు. ఇక... విజయవాడకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ఈనెల 9న మక్కాకు వెళ్లి హైదరాబాద్‌కు విమానంలో వచ్చారు. అక్కడి నుంచి బస్సులో విజయవాడకు వచ్చారు. దీంతో విజయవాడలో పాజిటివ్‌ల సంఖ్య నాలుగుకు చేరింది.

Updated Date - 2020-03-29T09:12:43+05:30 IST