ఆరుగురిలో Chidambaram టాప్‌

ABN , First Publish Date - 2022-06-01T13:37:54+05:30 IST

రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థుల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం అందరికంటే అత్యధికంగా ఆస్తులు కలిగి ఉన్నారు. తన

ఆరుగురిలో Chidambaram టాప్‌

                     - ఆస్తుల విలువ రూ.140.83 కోట్లు


చెన్నై: రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థుల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం అందరికంటే అత్యధికంగా ఆస్తులు కలిగి ఉన్నారు. తన ఆస్తుల విలువ రూ.140.83 కోట్లుగా నామినేషన్‌తో జతపరచిన అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే తరఫున కల్యాణసుందరం, రాజేశ్‌కుమార్‌, గిరిరాజన్‌, కాంగ్రెస్‌ తరఫున పి.చిదంబరం, అన్నాడీఎంకే తరఫున సీవీ షణ్ముగం, ధర్మర్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరుగురు ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లలో తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు.


అధిక సంపన్నుడు చిదంబరం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం దాఖలు చేసిన ఆస్తుల వివరాల పట్టికలో తన వద్ద 32 గ్రాముల బంగారం, 3.25 కేరట్ల వజ్రం సహా మొత్తం రూ.135 కోట్ల మేరకు చరాస్తులున్నాయని తెలిపారు. పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి సహా రూ.5.83 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయని, రూ.76.46 లక్షల మేరకు రుణాలున్నాయని వివరించారు. మొత్తానికి తన ఆస్తుల విలువ రూ.140.83 కోట్లని, తన భార్య పేరిట 1,457 గ్రాముల బంగారం, 76.71 కేరట్ల వజ్రం సహా రూ.17.38 కోట్ల విలువైన చరాస్తులు, రూ.26.53 కోట్ల స్థిరాస్తులున్నాయని తెలిపారు. ఉమ్మడి కుటుంబ ఆస్తిగా రూ.4.59 లక్షల విలువైన చరాస్తులు, రూ.12.21 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.74.34 లక్షల రుణాలు ఉన్నాయని వివరించారు.


కల్యాణసుందరం...

డీఎంకే అభ్యర్థి కల్యాణ సుందరం తన చరాస్థుల విలువ రూ.43.46 లక్షలుగా, ఇతన ఇద్దరు భార్యల పేరుతో 113 సవర్ల బంగారు నగలు సహా రూ.67.76 లక్షల ఆస్తులు, తన పేరుతో 3.46 కోట్ల స్తిరాస్తులు, భార్యల పేరుతో రూ.1.39 కోట్ల స్థిరాస్తులున్నాయని తెలిపారు. ఇదే విధంగా తనకు రూ.4.53 లక్షల రుణాలు, భార్యలకు 20.76 లక్షల రుణాలున్నాయని పేర్కొన్నారు.


రాజేష్ కుమార్‌...

డీఎంకే అభ్యర్థి రాజేష్ కుమార్‌ తన పేరుతో రూ.17.15లక్షల చరాస్తులు, రూ.78.08 లక్షల విలువైన స్థిరాస్తులున్నాయని పేర్కొన్నారు. భార్య పేరుతో రూ.27.57 లక్షల చరాస్తులు, రూ.47.40 లక్షల స్థిరాస్తులున్నాయని తెలిపారు.


గిరిరాజన్‌...

డీఎంకే అభ్యర్థి గిరిరాజన్‌ తన పేరిట రూ.1.53 కోట్ల విలువైన చరాస్తులు, రూ.5.12 కోట్ల స్థిరాస్తులున్నాయని తెలిపారు. భార్య పేరుతో రూ.1.04 కోట్ల చరాస్తులు, రూ.39.47 లక్షల విలువైన స్థిరాస్తులున్నాయని పేర్కొన్నారు.


సీవీ షణ్ముగం...

అన్నాడీఎంకే అభ్యర్థి సీవీ షణ్ముగం తనకు రూ.6.76 లక్షల విలువైన చరాస్తులు, రూ.18.45 లక్షల స్థిరాస్తులున్నాయని తెలిపారు. భార్యత పేరుతో రూ.27.12 లక్షల విలువైన చరాస్తులు, రూ.2.10 కోట్ల విలువైన స్థిరాస్తులు,  తల్లి పేరుతలో రూ.61.64 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని వివరించారు.


ధర్మర్‌...

మరో అన్నాడీఎంకే అభ్యర్థి ధర్మర్‌ తనకు రూ.14.49 లక్షల విలులైన చరాస్తులు, రూ.62.37 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు. భార్య పేరుతో రూ.17.09 లక్షల విలువైన స్థిరాస్తులు, కుమార్తెల పేరుతో రూ.36.05లక్షల చరాస్తులున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-06-01T13:37:54+05:30 IST