ఆ 6 గంటలే ముంచుతోందా!?

ABN , First Publish Date - 2021-05-18T05:39:25+05:30 IST

మహమ్మారి కట్టడికంటూ ఈ నెల 5 నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ ఏమాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు.

ఆ 6 గంటలే  ముంచుతోందా!?
మాస్క్‌కు మస్కా! : విడవలూరు మండలం పొన్నపూడి లక్ష్మీపురంలో సోమవారం ఓ క్రికెట్‌ మైదానాన్ని కొందరు ప్రారంభించారు. ఇది బాగానే ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒక్కరు కూడా మాస్క్‌ ధరించలేదు. - విడవలూరు

 కర్ఫ్యూ ఉన్నా అదుపుకాని కరోనా

సడలింపులో ఇష్టానుసారం తిరిగేస్తున్న ప్రజలు

మాస్కు పెట్టుకున్నా భౌతికదూరం లేదు!

పాక్షిక లాక్‌డౌన్‌ ఈ నెలాఖరు వరకు పొడిగింపు

మరిన్ని కఠిన ఆంక్షలు అమలులోకి!? 


కర్ఫ్యూ సడలింపు గంటలే కొంప ముంచుతున్నాయా!?. వైరస్‌ విజృంభణకు ఆ ఆరు గంటలే కీలకంగా మారిందా అని అంటే అవుననే అంటున్నాయి వైద్యవర్గాలు, నిపుణులు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ విరామ సమయం ఉండటంతో జనం రోడ్లమీదకు వచ్చేస్తున్నారు. మాస్క్‌ ధరించాలన్న అవగాహన ఉన్నా దుకాణాలు, ఇతర కార్యాలయాల వద్ద భౌతిక దూరం అన్న మాటే మరచిపోతున్నారు. ఇంకేముంది.. ఇదే మహమ్మారి విస్తృతికి కారణమవుతోంది. 


నెల్లూరు, మే 17 (ఆంధ్రజ్యోతి) : మహమ్మారి కట్టడికంటూ ఈ నెల 5 నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ ఏమాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. ఇందుకు ఉదాహరణే వరుసగా పెరుగుతున్న పాజిటివ్‌లు, మరణాల సంఖ్య. దీనికితోడు మంగళవారం ముగుస్తునన  కర్ఫ్యూను నెలాఖరువరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కేవలం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలు బయట తిరిగేందుకు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ పాక్షిక లాక్‌డౌన్‌ మూలంగా కొంత వరకైనా కేసులను అదుపు చేయవచ్చని భావించగా చివరకు చూస్తే విఫలయత్నమే మిగిలిందని నిపుణులు చెబుతున్నారు. గడిచిన రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గకపోగా మరింత పెరుగుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నెల మొదట్లో వెయ్యికి అటు ఇటుగా ఉన్న కేసులు ఇప్పుడు 1500 వరకు నమోదవుతున్నాయి. దీంతో జిల్లాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య  క్రమేణా పెరుగుతోంది. దీని మూలంగా ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక అధికార యంత్రాంగం బర్మన్‌ షెడ్ల వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. 


విరామంలో ఇష్టారాజ్యం

ఓ వైపు కరోనా విలతాండవం చేస్తున్నా ప్రజల్లో మాత్రం ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అఽఽధికార యంత్రాంగం కర్ఫ్యూ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నా కేసులు సంఖ్య పెరుగుతుండడానికి ఈ నిర్లక్ష్యమే కారణమని వారు విశ్లేషిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు ఇష్టానుసారం బయట తిరిగేస్తున్నారు. ఎక్కడా కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. వ్యాపార దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా చేరుతున్నారు. మాస్కు ధరించడంపై అందరిలో అవగాహన వచ్చినా భౌతిక దూరం అన్నమాట మరిచిపోయారు.  ఈ కారణంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొదటి వేవ్‌ సమయంలో లాక్‌డౌన్‌లో కొన్ని గంటల సడలింపులు ఇచ్చినా అప్పుడు కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలయ్యాయి. ఇప్పుడు అవేమీ కానరావడం లేదు. చాలా వరకు కుటుంబంలో ఒకరికి పాజిటివ్‌ వస్తే దాదాపుగా మిగిలిన వారూ పాజిటివ్‌గా తేలుతున్నారు. బయటకు వెళ్లిన వ్యక్తి నిర్లక్ష్యం ప్రదర్శించడం మూలంగా ఆ కుటుంబం మొత్తం ఇంట్లో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది.


కర్ఫ్యూ పొడిగింపు

మొదటి దశ పాక్షిక లాక్‌డౌన్‌ (కర్ఫ్యూ) మంగళవారం ముగుస్తుంది. కరోనా అదుపులోకి రాకపోవడంతో ఈ నెలాఖరుకు వరకు కర్ఫ్యూ పొడగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఆరు గంటల సమయాన్ని మరింత కుదించాలని రాష్ట్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి ఇంకా ఎటువంటి విధివిధానాలు అధికారులకు అందలేదు. కాగా రానున్న ఈ రెండు వారాలు కర్ఫ్యూ ఆంక్షలను మరింత గట్టిగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. తాము బయట తిరుగుతున్న వారిని అడ్డుకోవడం ఒక్కటే కరోనా నివారణకు మార్గం కాదని ప్రజల్లో మరింత అవగాహన రావాలని జిల్లా అధికార యంత్రాంగం కోరుతోంది.  


ఈ నెల 5 నుంచి కరోనా విజృంభణ ఇలా..

తేదీ కేసులు మరణాలు 

5 1200         5

6 1292         2

7 1530         4

8 1515         7

9 1574         7

10 1432         8

11 1673         8

12 1689         8

13 1589         5

14 1733         7

15 985         11

16 1593         7

17 1282         8

 

 నేటి నుంచి 7వ విడత ఫీవర్‌ సర్వే                                    

నెల్లూరు (వైద్యం) మే 17 : జిల్లాలో మంగళవారం నుంచి 7వ విడత  ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియచేశారు. 20వ తేదీ వరకు ఆశా కార్యకర్తలు, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి జ్వరం, దగ్గు, ఆయాసం ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారని తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేయిస్తారని పేర్కొన్నారు. పాజిటివ్‌ అని తేలితే వైద్యసదుపాయాలు కల్పిస్తారని వెల్లడించారు. 


1,282 పాజిటివ్‌లు

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సోమవారం 1,282  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక వైరస్‌ నుంచి కోలుకోలేక 8 మంది బాధితులు మృతి చెందారు. అలాగే కోలుకున్న 318 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.  


నలుగురు న్యాయవాదుల మృతి

నెల్లూరు(లీగల్‌) : నెల్లూరు బార్‌ అసోసియేషన్‌కు చెందిన నలుగురు న్యాయవాదులు కరోనా బారిన పడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. న్యాయవాదులు కే.పద్మనాభయ్య, మోరంరెడ్డి రామిరెడ్డి, మారం రాజేశ్వరావు, సీతారామరాజులు కరోనాతో మృతి చెందారు. న్యాయవాదులు నలుగురు ఒకే రోజు మృతి చెందడం పట్ల రాష్ట్ర బార్‌ కౌన్సెల్‌ మెంబర్‌ వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి రోజారెడ్డి, ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు గోళ్ల బాలసుబ్రహ్మణ్యం, ఎన్‌ కృష్ణుడు, న్యాయవాదులు నావూరు శ్రీధర్‌, పీసీ కృష్ణయ్య, డన్‌పాల్‌ రమేష్‌ తీవ్ర దిగ్ర్భాంతి చెందారు.   







Updated Date - 2021-05-18T05:39:25+05:30 IST