భువనేశ్వర్: ఒడిశాలో (Odisha) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. గంజామ్-కంధమల్ సరిహద్దుల్లో టూరిస్టు బస్సు (Tourist Bus) అదుపు తప్పి బోల్తా పడటంతో పశ్చిమబెంగాల్ (West Bengal)కు చెందిన ఆరుగురు టూరిస్టులు దుర్మరణం చెందగా, 40 మంది వరకూ గాయపడ్డారు. మృతులలో నలుగురు మహిళలు ఉన్నారు. మంగళవారంరాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు బుధవారం ఉదయం తెలిపారు. 77 మంది బస్సులో ప్రయాణిస్తున్నారని, వీరిలో 65 మంది పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, హుగ్లీ జిల్లాలకు చెందిన వారేననని చెబుతున్నారు. కంధమల్ జిల్లాలోని దరింగిబండి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని గంజాం ఎస్‌పీ బ్రిజేష్ రాయ్ తెలిపారు. టూరిస్టు బస్సు ప్రమాదంలో మృతులను సుప్రియ డెన్రె (33), సంజీత్ పాత్ర (33), రిమా డెన్రె (22), మౌసుమి డెన్రె, బర్నాలి మన్నా (34), స్వపన్ గుషయిత్ (44)గా గుర్తించారు.
ఇవి కూడా చదవండి
మోదీ, మమత, నవీన్ పట్నాయక్ సంతాపం
కాగా, టూరిస్టు బస్సు బోల్తాపడి పలువురు ప్రయాణికులు మృతిచెందడం, గాయపడటంపై ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. గాయపడిన వారిని, మృతులను వెనక్కు తెచ్చేందుకు డిజాస్టర్ మేనేజిమెంట్‌లోని ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉదయ్‌నారాయణ్‌పూర్ ఎమ్మెల్యే సారథ్యంలోని ఒక అత్యున్నత స్థాయి బృందం ఒడిశా వెళ్తున్నట్టు మమతా బెనర్జీ తెలిపారు. కాగా, ప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఒడిశా రవాణా శాఖ మంత్రి పద్మనాభ బెహర తెలిపారు.