మహిళను కిడ్నాప్ చేసి అమ్మేసి, అత్యాచారం చేసిన కేసులో ఆరుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-16T03:20:41+05:30 IST

24 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడి అమ్మేసిన కేసులో మధ్యప్రదేశ్‌ పోలీసులు ఆరుగురు

మహిళను కిడ్నాప్ చేసి అమ్మేసి, అత్యాచారం చేసిన కేసులో ఆరుగురి అరెస్ట్

భోపాల్: 24 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడి అమ్మేసిన కేసులో మధ్యప్రదేశ్‌ పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మొరేనా జిల్లా ఎస్పీ అనురాగ్ సుజానియా కథనం ప్రకారం.. భోపాల్‌కు చెందిన బాధిత యువతి ప్రైవేటు కంపెనీలో పని కోసం కొన్ని రోజుల క్రితం గ్వాలియర్ వెళ్లింది. ఈ ఏడాది జూన్‌లో పరిచయమైన మాయా శాక్య అనే నిందితురాలు ఆమెను మొరేనాకు తీసుకెళ్లింది. మాయా అక్కడ జౌరాకు చెందిన మరో ముగ్గురు స్నేహితులు మొహర్ సింగ్ రాజక్, ఓమ్‌వటి, లోకేంద్రశర్మతో కలిసి బాధితురాలిని మాయా కిడ్నాప్ చేసింది. 


ఆ తర్వాత వారు ఆమెను మొరేనాలోని బాన్మోర్ ప్రాంతానికి ఇద్దరు అవివాహిత సోదరులు రణ్‌వీర్, విజయ్ గుర్జార్‌లకు రెండు లక్షల రూపాయలకు అమ్మేశారు. రణ్‌వీర్, విజయ్‌లు బాధితురాలిపై దాడిచేయడమే కాకుండా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఓ గ్రామస్థుడి సాయంతో భోపాల్‌లోని తన సోదరుడికి సమాచారం అందించింది. అతడు అప్పటికే ఆమె కోసం నెల రోజులుగా వెతుకుతున్నాడు. 


సమాచారం అందుకున్న యువతి సోదరుడు మధ్యప్రదేశ్ హైకోర్టులోని గ్వాలియర్ బెంచ్‌లో హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేశాడు. అలాగే, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాన్మోరే ప్రాంతంలో మంగళవారం బాధితురాలిని రక్షించారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల సమాచారం చెప్పిన ఒక్కొక్కరికి రూ. 5 వేల రివార్డు ప్రకటించారు. చివరికి నిందితుల సమాచారం అందుకున్న పోలీసులు బాన్మోర్‌లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి జుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-08-16T03:20:41+05:30 IST