Jun 15 2021 @ 08:08AM

శివ‌కార్తికేయ‌న్ మిద్దె తోట‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. దీంతో షూటింగులన్నీ బంద్‌ కావడంతో హీరో హీరోయిన్లు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. షూటింగులతో నిత్యం బిజీగా వుండే హీరోలు, హీరోయిన్లు లాక్‌డౌన్‌ కారణంగా లభించిన ఖాళీ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారు. ఇలాంటి వారిలో శివకార్తికేయన్‌ ఒకరు. ఈయన కరోనా లాక్‌డౌన్‌ కాలంలో తన సొంత ఇంటి మిద్దెపై ఓ మినీ తోట (టెర్రస్‌ గార్డెన్‌)ను సాగు చేశారు. ఈ మిద్దె తోటలో అనేక రకాలైన కూరగాయల మొక్కలను పెంచారు. 

అవి పెరిగి పెద్దవై ఇప్పుడు ఇంటికి సరిపడా కూరగాయలను అందిస్తున్నాయి. శివకార్తికేయన్‌కు ఈసీఆర్‌ రోడ్డులో సొంతిల్లు ఉంది. ఈ ఇంటి మిద్దెపైనే ఈయన ఈ తోటను అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ తోటకు సంబంధించి ఒక వీడియో తీసి దాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా లభించిన ఖాళీ సమయంలో ఈ తోటను అభివృద్ధి చేశానని, దీన్ని ప్రతి ఒక్కరికీ చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోను పోస్ట్‌ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ తోట నుంచే తన ఇంటికి అవసరమైన కూరగాయలను ఉపయోగిస్తున్నట్టు శివకార్తికేయన్‌ వెల్లడించారు. కాగా, శివకార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.