కోలీవుడ్: తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని నటుడు శివకార్తికేయన్ తెలిపారు. ఇటీవల ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారం పొందిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ప్రజాప్రతినిధిగా మారాలన్న ఆశ లేదన్నారు. తన మనసుకు ఏది మంచి అనిపిస్తుందో దాన్ని తన చిత్రాల ద్వారా సమాజానికి ఒక సందేశం రూపంలో తెలియజేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా సమాజంలోని కొన్ని సమస్యలను తాను నటించిన ‘వేలైక్కారన్’, ‘హీరో’, ‘గనా’ వంటి చిత్రాల్లో చెప్పినట్టు గుర్తుచేశారు. ఈ దేశ పౌరుడుగా, దేశ సేవలో తనకు తోచింది చేస్తున్నానని తెలిపారు.
ఇకపోతే, ఒకానొక సమయంలో సినిమాల్లో నటించే అవకాశం లభిస్తుందా అని కలలుకన్నానని, ఆ కలలు ఫలించి ప్రజల అశీస్సుల వల్ల హీరో స్థాయికి ఎదిగినట్టు తెలిపారు. సినీ ప్రేక్షకదేవుళ్ళ ఆదరాభిమానాలతో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి, ఈ ‘కలైమామణి’ పురస్కారాన్ని అందుకున్నట్టు శివకార్తికేయన్ చెప్పారు. కాగా, ఈయన నటించిన ‘డాక్టర్’, ’అయిలాన్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా వుండగా, ‘డాన్’ అనే చిత్రం అండర్ ప్రొడక్షన్లో ఉంది.