స్విమ్స్‌, రుయా.. కమిటీకి ఏదయా దయ..?

ABN , First Publish Date - 2020-09-19T17:11:28+05:30 IST

ఒకవైపు అడ్డూ అదుపూ లేని కరోనా వ్యాప్తి. మరొకవైపు విపరీతంగా పెరుగుతున్న మరణాలు. జాగ్రత్తలు పాటించని జనం. పెడచెవినపెట్టి బాధితులవుతున్న నాయకులు. విపరీతంగా శ్రమిస్తూ వైరస్‌ బారినపడుతున్న యంత్రాంగం. ప్రతిష్టాత్మక కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పెట్టే దిక్కే లేదంటూ రోగుల

స్విమ్స్‌, రుయా.. కమిటీకి ఏదయా దయ..?

కొవిడ్‌ కేంద్రాలను మెరుగుపరచి ఆస్పత్రుల ఊసు మరచి..

ప్రజల్లో సమన్వయ కమిటీ పై పెరుగుతున్న ఆశలు


తిరుపతి- ఆంధ్రజ్యోతి: ఒకవైపు అడ్డూ అదుపూ లేని కరోనా వ్యాప్తి. మరొకవైపు విపరీతంగా పెరుగుతున్న మరణాలు. జాగ్రత్తలు పాటించని జనం. పెడచెవినపెట్టి బాధితులవుతున్న నాయకులు. విపరీతంగా శ్రమిస్తూ వైరస్‌ బారినపడుతున్న యంత్రాంగం. ప్రతిష్టాత్మక కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పెట్టే దిక్కే లేదంటూ రోగుల ఆందోళనలు. కనీస సమాచారం కూడా చెప్పడం లేదంటూ కుటుంబాల కన్నీళ్ళు...ఇటువంటి క్లిష్ట సమయంలో తిరుపతి ప్రజల్లో భరోసా ఇవ్వడానికి పురుడుపోసుకుంది కొవిడ్‌ సమన్వయ కమిటీ. భూమన కరుణాకరరెడ్డి చైర్మన్‌గా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కో-చైర్మన్‌గా అధికారులు, వైద్య నిపుణులతో ఏర్పడిన కమిటీ మీద ప్రజల్లో కొండంత ఆశలు పేరుకున్నాయి. తిరుపతిలోని కొవిడ్‌ ఆస్పత్రుల తీరు మారుతుందని నమ్మకాలు పెరిగాయి. అయితే, కొవిడ్‌ కేంద్రాల రూపురేఖలు మార్చి మెరుగుపరిచిన కమిటీ దృష్టి విపరీతంగా ఆరోపణలకు గురవుతున్న స్విమ్స్‌,రుయా కొవిడ్‌ ఆస్పత్రుల మీద పడకపోవడమే ఆశ్చర్యం. 


కరోనా వైరస్‌ విజృంభణతో జిల్లా అతలాకుతలం అవుతున్న సమయంలో బాధితులకు మెరుగైన వైద్యం, తగిన సూచనలు అందేలా చూడడం కోసం తిరుపతి కేంద్రంగా కొవిడ్‌ సమన్వయ కమిటీ ఏర్పాటైంది. జూలై 14న ఈ కమిటీ తొలి సమావేశం తుడా చైర్మన్‌, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదని, చేర్చుకున్నా పట్టించుకోవడం లేదని బాధితులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న దశలో ఈ కమిటీ పురుడు పోసుకుంది.అనేక కొరతలతో ప్రభుత్వ ఆస్పత్రులు గందరగోళంగా ఉండడం, ప్రైవేటు ఆస్పత్రులు పూర్తిగా తలుపులు మూసేయడం వంటివి ప్రజల్ని మరింత ఆందోళనకు గురిచేశాయి. తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి అదుపు చేయలేనంతగా ఉండడంతో పరిస్థితులను మెరుగుపరిచే ఉద్దేశంతో సమన్వయ కమిటీ ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ డాక్టర్లతో పాటూ, ఐఎంఏకి చెందిన ప్రైవేటు డాక్టర్లను కూడా కమిటీలో భాగం చేశారు. తుడా కార్యాలయంలో తొలుత కొవిడ్‌ వార్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినా తర్వాత శిల్పారామాన్ని వేదికగా మార్చుకున్నారు. కొవిడ్‌ కేంద్రాలను, కొవిడ్‌ ఆస్పత్రులను సందర్శించిన  కమిటీ సభ్యులు పలు దఫాలుగా సమావేశమై చర్చించారు.ఈలోగా కొవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి, కో-ఛైర్మన్‌గా చెవిరెడ్డి వ్యవహరిస్తారంటూ కలెక్టర్‌ అధికారులకు సర్క్యులర్‌ పంపారు. 


వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన  , మందులు, పారిశుధ్యం, ఆహారం, వసతి,  మానవ వనరులు, వీఐపీల సమన్వయం...ఇలా అనేక విడి విడి బాధ్యతలను అధికారుల కు, డాక్టర్లకు అప్పగిస్తూ కలెక్టర్‌ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.ఇక గురుశిష్యుల ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ మరింత సమర్ధంగా మరింత చొరవగా వ్యవహరిస్తుందని ప్రజలు ఆశించారు. ముఖ్యంగా విపరీతంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొవిడ్‌ ఆస్పత్రుల్లో పరిస్థితులు మెరుగుపడడానికి నిర్మాణాత్మక ప్రయత్నాలు జరుగుతాయని ఎదురు చూశారు. అయితే ఏం జరిగిందో కానీ రాష్ట్ర, జిల్లా కొవిడ్‌ ఆస్పత్రుల ప్రస్తావన లేకుండా కేవలం తిరుపతిలోని కొవిడ్‌ కేంద్రాల్లో మెరుగైన సేవలందేలా సూచనలు చేయడం కోసం అని కేంద్రాల వారీగా బాధ్యతలకు అప్పగిస్తూ కమిటీ చైర్మన్‌ పేరుతో ఈనెల 5న ఒక ప్రకటన వెలువడింది. తీవ్రంగా ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్న స్విమ్స్‌, రుయాల్లోని కొవిడ్‌ ఆస్పత్రులను పట్టించుకోకుండా వైరస్‌ తీవ్రత లేని బాధితులుండే కొవిడ్‌ కేంద్రాలకే సమన్వయ కమిటీ పరిమితం కావడమేంటని పలువురు ఆశ్చర్యపోయారు. నిజానికి కమిటీ సభ్యులు కొవిడ్‌ ఆస్పత్రులను సైతం సందర్శించారు.బాధితులు వ్యక్తం చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. అయితే వీరి దృష్టికి వచ్చిన అంశాలు ఏమిటి, ఇక్కడి పరిస్థితులు మెరుగుపడడానికి చేసిన సూచనలు ఏమిటి అనేది మాత్రం వెల్లడి కాలేదు.


రూపు మారిన కొవిడ్‌ సెంటర్లు

కొవిడ్‌ సమన్వయ కమిటీ ఏర్పడి కార్యాచరణలోకి దిగాక తిరుపతిలోని కొవిడ్‌ కేంద్రాల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. ముఖ్యంగా పద్మావతినిలయం ఒక ఆదర్శ కేంద్రంగా రూపుదిద్దుకుంది. శ్రీనివాసంలో భోజనం నాణ్యత పెరిగింది. కొవిడ్‌ కేంద్రాల్లో ఆక్సిజన్‌ జోన్ల ఏర్పాటు బాధితుల ప్రాణాలకు భరోసాగా మారింది. పల్స్‌ ఆక్సీమీటర్లు, థర్మల్‌ స్కానర్స్‌, డిజిటల్‌ గ్లూకోమీటర్లు అందుబాటులో ఉంచడం, ఎక్స్‌రే, ల్యాబ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేయడం. వేడినీటి సరఫరా, వీల్‌ చైర్ల సౌకర్యం వంటివి  ఈ కమిటీ చొరవతోనే ఏర్పాటయ్యాయి. ప్రతి కొవిడ్‌ కోంద్రంలో అన్నివేళలా డాక్టర్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. నర్సింగ్‌, పారిశుధ్య సిబ్బంది సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచ డానికి వీరి సూచనలే ఉపయోగపడ్డాయి. అలాగే కొవిడ్‌ ట్రయేజ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడంలో కమిటీ కీలకంగా పనిచేసింది. బాధితులు పాజిటివ్‌తో వచ్చిన వెంటనే లక్షణాలను బట్టి ఆయా సెంటర్లకు రెఫర్‌ చేస్తున్నారు. 12మంది రేడియాలజిస్టులను ఆన్‌లైన్‌ ద్వారా రిపోర్ట్‌ ఇచ్చేలా కమిటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కడ ఏ కొరతలు ఉన్నాయో గమనించి అధికారులకు నివేదించడం, అవి సత్వరం అందేలా చూడడం చేస్తున్నారు. 


శిల్పారామంలో కాల్‌ సెంటర్‌

శిల్పారామంలో కొవిడ్‌ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కాల్‌సెంటర్‌ ఏర్పాటుచేశారు. కొవిడ్‌ సెంటర్లలో ఉన్న బాధితుల సందేహాలు తీర్చేందుకు ఇక్కడ ఆరుగురు డాక్టర్లు, మూడు షిఫ్ట్‌ల్లోనూ అందుబాటులో ఉండే ఏర్పాటు చేశారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఇక్కడి డాక్టర్లే ఫోన్‌ చేసి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని వైద్య సలహాలు ఇస్తుంటారు. 


స్విమ్స్‌, రుయాల మాటేమిటి?

కొవిడ్‌ కేంద్రాల్లో మౌలికంగా గణనీయమైన తీసుకురావడానికి కారణమైన కొవిడ్‌ సమన్వయ కమిటీ, కరోనా ఆస్పత్రులను పట్టించుకోకపోవడమే విచిత్రం. విపరీతంగా మరణాలు నమోదవుతున్న ఈ ఆస్పత్రుల్లో పరిస్థితులను అధ్యయనం చేసిన కమిటీ చేసిన సూచనలేమిటో, అమలైన అంశాలేమిటో గానీ మరణాలు తగ్గలేదు, ఆరోప ణలూ ఆగడమే లేదు. స్విమ్స్‌, రుయాల్లోని కొవిడ్‌ ఆస్పత్రుల్లో మరణించినవారి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న ఆందోళన, చికిత్స పొంది బయటకు వచ్చిన వారు చెబుతున్న అంశాలను కమిటీ పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే ఇక్కడి పరిస్థితులు మెరుగవుతాయి.నిజానికి చెవిరెడ్డి స్వయంగా పీపీఈ కిట్‌తో స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో రెండున్నర గంటలకు పైగా ఉండి ప్రతి రోగినీ పలకరించి ధైర్యం చెప్పారు. కమిటీ చైర్మన్‌ కరుణాకరరెడ్డి పాజిటివ్‌ అయినా రుయాలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఈ రెండు ఆస్పత్రుల్లోని పరిస్థితులు ప్రత్యక్షంగా వీరికి తెలుసు. అయినా డాక్టర్లు రారని, పారిశుధ్యం దారుణమని, సకాలంలో ఆక్సిజన్‌ పెట్టరని, కుటుంబసభ్యులకు సమాచారమే చెప్పరని..ఇలా ఆరోపణలు పదే పదే వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో ఉన్న సిబ్బంది సరిపోవడం లేదా, మౌలిక వసతుల కొరత ఏమైనా ఉందా, సిబ్బందికి డ్యూటీలు వేయడంలో ఏమైనా లోపాలున్నాయా అనే అంశాలను అధ్యయనం చేస్తే మెరుగు పడడానికి కమిటీ కారణం అవుతుంది.కరుణాకర్‌రెడ్డి వంటి మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకుడు చైర్మన్‌గా ఉన్న కమిటీ మీద సహజంగానే నమ్మకాలు, ఆశలు ప్రజల్లో చాలానే ఉంటాయి. అయితే అందుకు తగినట్టుగా మాత్రం ఫలితాలు కనిపించకపోవడమే విషాదం. 

Updated Date - 2020-09-19T17:11:28+05:30 IST