పోస్టులన్నీ ఖాళీ.. డాక్టర్లు లేరు.. సిబ్బందిని నియమించరు

ABN , First Publish Date - 2020-07-06T20:54:02+05:30 IST

నర్సాపూర్‌లో పేరుకు 100 పడకల ఆస్పత్రి ఉన్నా పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేయకపోవడంతో వైద్యసేవలు నామమాత్రంగానే అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పోస్టులన్నీ ఖాళీ.. డాక్టర్లు లేరు.. సిబ్బందిని నియమించరు

29 మంది డాక్టర్లకు  విధుల్లో పది మంది!

28 మంది నర్సులకు ఉన్నది ఇద్దరే!

ఫార్మాసిస్టు,  ల్యాబ్‌టెక్నీషియన్‌,  థియోటర్‌ అసిస్టెంటు పోస్టుల భర్తీనే లేదు


నర్సాపూర్‌(మెదక్) : నర్సాపూర్‌లో పేరుకు 100 పడకల ఆస్పత్రి ఉన్నా పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేయకపోవడంతో వైద్యసేవలు నామమాత్రంగానే అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నర్సాపూర్‌లో గతంలో 30 పడకల ఆస్పత్రి ఉండగా ఐదేళ్ల క్రితం రూ.11 కోట్లతో అధునాతన హంగులతో 100 పడకల ఆస్పత్రిని నిర్మించారు. కార్పొరేట్‌ ఆస్పత్రిని తలపించే భవనాలు, రూ. లక్షలు వెచ్చించి అదునాతన పరికరాలు సమకూర్చారు. ఆస్పత్రిని విస్తరించినా అదనపు పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. 30 పడకల ఆస్పత్రిలో ఉన్న సిబ్బందినే కొనసాగిస్తున్నారు. సరిపడా సిబ్బందిని లేకపోవడంతో సౌకర్యాలన్నీ వృథాగా మారుతున్నాయి. ఆస్పత్రిలో 29 మంది డాక్టర్లకు 14 మంది మాత్రమే ఉన్నారు. ఇందులోనూ నలుగురు డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో 10 మంది వైద్యులే అందుబాటులో ఉన్నారు. 


ఆస్పత్రిలో 28 మంది నర్సులు ఉండాల్సినా.. కేవలం ఇద్దరితోనే నెట్టుకొస్తున్నారు. నియోజకవర్గ కేంద్రం కావడంతో ఈ ఆస్పత్రికి నిత్యం వందల సంఖ్యలో అవుట్‌ పేషెంట్లు వస్తుంటారు. హైదరాబాద్‌ వెళ్లే ప్రధాన రహదారి ఉండడంతో రోడ్డు ప్రమాద బాధితులను కూడా ఇక్కడికే తీసుకువస్తుంటారు. ఇలాంటి సమయంలో ఇద్దరు నర్సులు నానా అవస్థలు పడుతున్నారు. ఆరుగురు ఎంపీహెచ్‌ఏలకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న శానిటేషన్‌ సిబ్బందిని ఇతర సేవలకు వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత నెల నర్సాపూర్‌ సమీపంలో అర్బన్‌ పార్కు ప్రారంభానికి సీఎం కేసీఆర్‌ విచ్చేసినప్పుడు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆస్పత్రిలోని పోస్టుల ఖాళీలపై వినతిపత్రం అందజేశారు. సీఎం కరుణించి అదనుపు పోస్టులు మంజూరు చేస్తే ఆసుపత్రి బాగుపడుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2020-07-06T20:54:02+05:30 IST