మన్యం సాగుకు సీతారామానే శరణ్యం

ABN , First Publish Date - 2020-10-01T09:42:38+05:30 IST

శాశ్వత సాగునీటి వనరులు లేక వర్షాధారంపైనే ఆధారపడి పంటలు సాగుచేస్త్తున్న ఏజెన్సీ ప్రాంతాల రైతులకు సీతారామప్రాజెక్టే శరణ్యంగా

మన్యం సాగుకు సీతారామానే శరణ్యం

సీఎం శంకుస్థాపన చేసినా తొలిదశలో ఇల్లెందు ఏజెన్సీకి దక్కని చోటు 

రెండో ఫేజ్‌కోసం గిరిజన రైతుల ఎదురుచూపులు

భారీ మార్పులతో రెండోదశకుప్రతిపాదనలు


ఇల్లెందు, సెప్టెంబర్‌ 30: శాశ్వత సాగునీటి వనరులు లేక వర్షాధారంపైనే ఆధారపడి పంటలు సాగుచేస్త్తున్న ఏజెన్సీ ప్రాంతాల రైతులకు సీతారామప్రాజెక్టే శరణ్యంగా మారింది. గోదావరిపై నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతలకు 2016 ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద శంకుకుస్థాపన చేశారు. కానీ మొదటి దశలో ఇల్లెందు నియోజకవర్గానికి  ఈ ప్రాజెక్టులో చోటు లభించకపోవడంతో గిరిజన రైతులు నిరాశకు లోనయ్యారు. అయితే తాజాగా రెండో దశకు జరుగుతున్న కసరత్తులో అవకాశం దక్కడంతో ఇక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండోదశలో నియోజకవర్గ ఆయకట్టుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌కు విన్నవించారు.  ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. 


భారీ మార్పులతో సెకండ్‌ఫేజ్‌ ప్రతిపాదనలు

సీతారామ ఎత్తిపోతల పథకం రెండోదశ పాలేరు నియోజకవర్గం వరకు డిజైన్‌ చేయడంతో ఇల్లెందు నియోజకవర్గంలోకి సీతారామ నీటిని మళ్లించడానికి సింగరేణి మండలం చీమలపాడు ఏరియా నుంచి మొయిన్‌కేనాల్‌ లిప్టు ద్వారా పంపిణి చేసేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు నివేదిక రూపొందించారు. సీఎం ఆదేశాలతో రెండు నెలల క్రితం ఇల్లెందు, టేకులపల్లి, బయ్యారం, గార్ల, కామేపల్లి మండలాల మీదుగా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి, ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలాల పరిధిలో 1,38,705 ఏకరాల ఆయకట్టు లక్ష్యంగా, పంపుహౌజ్‌లు, ప్రెషర్‌మెయిన్స్‌ డెలివరీ సిస్టమ్‌లు, భూసేకరణల నిమిత్తం రూ.986కోట్లతో అంచనాలు రూపొందించారు. కాగా గత వారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో సీతారామ ఎత్తిపోతల పథకంలో ఆదనపు ఆయకట్టును చేర్చడంతో ప్రాజెక్టు సమగ్ర నివేదికను(డీపీఆర్‌) మరోసారి రూపొందించడానికి ఇరిగేషన్‌ విభాగం అధికారులు కసరత్తు ప్రారంభించారు.


ఇల్లెందు నియోజకవర్గానికి సీతారామ నీరు తరలించాలంటే సింగరేణి మండలం చీమలపాడువద్ద ఒక కిలోమీటర్‌ వరకు సోరంగ మార్గం నిర్మించాల్సి ఉంటుంది. గోదావరి నదికి ఇల్లెందు నియోజకవర్గం 245మీటర్ల ఎత్తున ఉండటంతో ఎత్తిపోతల ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల భూములకు నీరు చేరుతుందన్న అధికారుల అంచనాల మూలంగా 216 మీటర్ల ఎత్తున ఉన్న లలితాపురం చెరువుకు, అక్కడినుంచి 175 మీటర్ల ఎత్తున ఉన్న రోళ్లపాడు ప్రాజెక్టుకు గ్రావిటి ద్వారా సాగునీరు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. అనంతరం 245 మీటర్ల ఎత్తున ఉన్న రొంపేడు ఏరియా చెరువుకు నీటిని మల్లించి తరువాత బయ్యారం, గార్ల మండలాల మీదగా కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లోని ఆయకట్టుకు సీతరామ జలాలను అందించేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు రూపకల్పన చేయడం గమనార్హం. 


రిజర్వాయర్‌గా బయ్యారం పెద్ద చెరువు 

కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువుకు సీతారామ నీటిని మళ్లించేందుకు ఆమోదం లభించడంతో ఆ చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు సన్నాహలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం జరిపేందుకు సిద్దపడుతుండటంతో ఫ్యాక్టరీకి అవసరమైన నీటిని అందించాలన్న యోచనతోనే బయ్యారం చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం దసరా కానుకగా ఇల్లెందు నియోజకవర్గం రైతులకు సీతారామ ఎత్తిపోతల పథకం రెండోదశ అధికారిక మంజూరును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-10-01T09:42:38+05:30 IST