Jun 24 2021 @ 12:14PM

రెండు సినిమాలను రీ స్టార్ట్ చేసిన సితార ఎంటెర్‌టైన్‌మెంట్స్

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎంటెర్‌టైన్‌మెంట్ లో తెరకెక్కుతున్న రెండు సినిమాలు లాక్ డౌన్ తర్వాత తిరిగి సెట్స్ మీదకి వచ్చాయి. గత ఏడాది ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత అక్టోబర్ నుంచి మళ్ళీ టాలీవుడ్‌లో సందడి మొదలైంది. చిన్న సినిమా నుంచి పాన్ ఇండియన్ సినిమాల వరకు అన్నీ చక చకా షూటింగ్ జరుపుకున్నాయి. 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యాం', 'ఆచార్య', 'ఖిలాడి', 'పుష్ప' లాంటి సినిమాలు చిత్రీకరణ చివరి దశకు చేరుకునే సమయంలో మళ్ళీ సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ విధించారు. దాంతో దాదాపు రెండు నెలలు ఆగిపోయిన షూటింగ్స్ మళ్ళీ మొదలవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ సారధి స్టూడియోలో 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ మొదలవగా, ఈరోజు ( జూన్ 24 గురువారం ) నుంచి సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న రెండు చిత్రాలను తిరిగి సెట్స్‌పైకి తీసుకు వచ్చారు. 

అందులో ఒకటిది 'వరుడు కావలెను'. యంగ్ హీరో నాగశౌర్య, రీతువర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నదియా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. నేటి నుండి తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. అలాగే ఇదే బ్యానర్‌లో నిర్మిస్తున్న మరో సినిమా 'నరుడి బ్రతుకు నటన'. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్నారు. విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమయింది. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ కూడా షూటింగ్ జూలై రెండవ వారంలో మొదలు కానుందట.