రూ.కోట్ల స్థలంలో చిల్లర వేట!

ABN , First Publish Date - 2022-08-13T04:55:10+05:30 IST

ఎన్టీఆర్‌ సర్కిల్‌లో మున్సిపాలిటీకి ఉన్న 23 సెంట్ల త్రిభుజాకార స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మాణానికి పూనుకున్న అధికారులు ఇటీవల గుడ్‌విల్‌ ఆక్షన నిర్వహించారు.

రూ.కోట్ల స్థలంలో  చిల్లర వేట!
వాణిజ్య సముదాయం నిర్మించ తలపెట్టిన మున్సిపాలిటీ స్థలం ఇదే!

కందుకూరు మున్సిపాలిటీలో వింత వైఖరి

వాణిజ్య సముదాయ నిర్మాణానికి గుడ్‌విల్‌ ఆక్షన

32 షాపులకు వేలం.. మొదట వ్యాపారుల పోటీ

అంతా అయ్యాక చేతులెత్తేసిన వైనం

 తక్కువకు దక్కించుకునేందుకు ఎత్తుగడ 

అధికారుల తీరుపైనా విమర్శల వెల్లువ

సొంతంగా నిర్మిస్తేనే ప్రయోజనమంటున్న నిపుణులు


జనసంద్రం ఉన్న ప్రాంతంలో మనకు స్థలం ఉంటే ఏం చేస్తాం. వాణిజ్య సముదాయం నిర్మించి, అడ్వాన్సు, అద్దెల రూపంలో రూ.లక్షలు రాబట్టేందుకు ప్రయత్నిస్తాం. బిల్డర్లు, ఇతర వ్యాపారులు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తారు. కానీ కందుకూరు మున్సిపల్‌ అధికారుల నిర్వాకం విమర్శలకు తావిస్తోంది. కేవలం రూ.కోటి వెచ్చిస్తే షాపింగ్‌ కాంప్లెక్స్‌ పూర్తయ్యేదానికి గుడ్‌విల్‌ ఆక్షన అవసరం ఏముందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గుడ్‌విల్‌ ఆక్షన ద్వారా మున్సిపాలిటీకి రూ.60 లక్షలలోపే వస్తుండగా అంతతక్కువ మొత్తం కోసం షాపులను నామమాత్రపు అద్దెకు 30 సంవత్సరాలు వ్యాపారుల చేతుల్లో పెట్టడం అవసరమా అన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం కరువవుతోంది.


కందుకూరు, ఆగస్టు 12 : ఎన్టీఆర్‌ సర్కిల్‌లో మున్సిపాలిటీకి ఉన్న 23 సెంట్ల త్రిభుజాకార స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మాణానికి పూనుకున్న అధికారులు ఇటీవల గుడ్‌విల్‌ ఆక్షన నిర్వహించారు. కింద (గ్రౌండ్‌ఫ్లోర్‌) 16, మొదటి అంతస్తులో 16 షాపులు నిర్మించేలా డిజైన చేసి గుడ్‌విల్‌ ఆక్షన నిర్వహించారు. వేలంలో షాపులు దక్కించుకున్న వారు ఆ మొత్తాన్ని విడతలవారీగా రూముల నిర్మాణం పూర్తయ్యేలోగా చెల్లించాలి. ఆ తర్వాత సదరు షాపులపై 30 సంవత్సరాలు హక్కులు ఉంటాయని, ప్రతి నెల కేవలం రూ.2500 అద్దె చెల్లించాలని నిబంధనలలో పేర్కొన్నారు. వీటిలో సగం షాపులు జనరల్‌ కేటగిరీకి, మిగిలిన సగం వివిధ రిజర్వేషన్ల వారికి కేటాయించారు. ఇటీవల జరిగిన బహిరంగ వేలంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గదుల కోసం జనరల్‌ కేటగిరీ వ్యాపారులు పోటీ పడ్డారు. 3, 4 రూములకు ఒక్కో గదికి రూ.20 లక్షలకుపైగా చెల్లించేందుకు కూడా సిద్ధపడ్డారు. మిగిలిన రూములకు రూ.12 లక్షలకుపైన పలకగా రిజర్వేషన కేటగిరీలోని 8 రూములు కేవలం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పాడారు. అయితే అధిక మొత్తాలకు పాడిన వారంతా మొదటి ఇనస్టాల్‌మెంట్‌గా 25 శాతం చెల్లించకుండా మొండికేశారు. మున్సిపల్‌ అధికారులు ఒత్తిడి పెంచడంతో తాము విరమించుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో తక్కువకు పాడిన వారి ద్వారా రూ.58 లక్షలు మాత్రమే మున్సిపాలిటీకి ఆదాయం రానుంది. ఇక మొదటి అంతస్తులోని 16 గదులలో సగానికిపైగా పాటదారులు పాల్గొనపోగా మిగిలిన సగం రూములు కూడా నాలుగైదు లక్షలలోపే పలకడంతో మొదటి అంతస్తు నిర్మాణం ఆలోచనను మున్సిపాలిటీ విరమించుకుంది. కేవలం గ్రౌండ్‌ఫ్లోర్‌ వరకే నిర్మించాలని నిర్ణయించుకుని రూ.1.2 కోట్ల అంచనాతో ఇటీవల టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించారు. జనరల్‌ కేటగిరీలో పెద్ద మొత్తాలకు పాడుకున్న 8 మందిలో ఏడుగురు వెనక్కు తగ్గారు. అంతమొత్తం చెల్లించలేమని మున్సిపాలిటీకి రాసిచ్చేసి తమ వాటా చెల్లించకుండా నిరాకరించారు. దీంతో ఆ ఏడు రూములకు తిరిగి వేలం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈదఫా పాటలు జరిపితే ఆ రూములకు కూడా అతి తక్కువ మొత్తాలకే పాడుకునేందుకు వ్యాపారులు సిద్ధపడిపోయారు. 


వ్యాపారులపాలు కాకుండా చూడాలి 


వాస్తవానికి కబ్జాదారుల చేతుల్లో ఉన్న కోట్ల విలువజేసే ఈ స్థలాన్ని వారి చెర నుంచి విడిపించేందుకు దశాబ్దాల పోరాటం నడిచింది. మీడియాలో ప్రత్యేకించి ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వచ్చాయి. 2020లో ఎమ్మెల్యే మహీధరరెడ్డి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చేయించి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వటంతో సెలవు రోజుల్లో ఆక్రమణలు కూల్చివేసి మున్సిపల్‌ అఽధికారులు 140 గదుల ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ గది రూ.10 లక్షలకు పైనే ఉన్నందున తక్కువలో తక్కువ ఆ స్థలం విలువ రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాంటి స్థలం దశాబ్దాల పాటు ఆక్రమణదారుల చెరలో ఉండగా విడిపించిన కొద్దికాలానికే మళ్లీ గుడ్‌విల్‌ ఆక్షన అంటే కొందరి కబంధహస్తాలలోకి వెళ్లేందుకు రాజమార్గమే అవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సెంటర్‌లో చిన్న రూముకు కూడా రూ.25 వేల నుంచి 30 వేల దాకా బాడుగ ఇస్తున్న స్థితిలో కేవలం రూ.2500 అద్దెకు ఇవ్వడం ఎంతవరకు న్యాయమన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మున్సిపాలిటీకి కోట్లలో ఆదాయం వస్తుందా అంటే అదీ లేదు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి సరిపడా కూడా గుడ్‌విల్‌ ఆక్షన ద్వారా రాకుండా వ్యాపారులు ఎత్తులు వేస్తున్నారు. ఈ స్థితిలో 30 సంవత్సరాలపాటు వారికి హక్కులు కల్పిస్తే ఆ తర్వాత ఒకతరం మారుతుందని వారిని ఖాళీ చేయించడం అంత సులభం కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


గుడ్‌విల్‌ ఆక్షనతో రూ.40 వేలే 


ఈ ప్రాంతంలో కేవలం రూ.కోటి మున్సిపాలిటీ సొమ్ము వెచ్చించి గదులు నిర్మించి బహిరంగ వేలం ద్వారా అద్దెకు ఇస్తే ప్రతి నెలా రూ.5 లక్షలు అద్దె రావడమేగాక అడ్వాన్సుల రూపంలో రూ.30 లక్షల వరకు వస్తుందని చెబుతున్నారు. అలాకాకుండా గుడ్‌విల్‌ ఆక్షన అంటే నెలకు వచ్చేది కేవలం రూ.40 వేలు మాత్రమే అయినందున ఆ ఆలోచనను అధికారులు, ప్రజాప్రతినిధులు విరమించుకుని  వేలం పాటలను రద్దు చేయాలని కోరుతున్నారు.  మున్సిపాలిటీ జనరల్‌ ఫండ్‌ తో షాపులు నిర్మిస్తే మున్సిపాలిటీ కోట్ల విలువజేసే ఆస్తి భద్రంగా ఉండటంతోపాటు ఏడాదిన్నర తిరగకుండానే కాంప్లెక్స్‌ మున్సిపాలిటీ సొంతమవుతుందని విశ్లేషిస్తున్నారు.


 సొంతంగా నిర్మాణానికి అనుమతి లేదు 


ఇక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ద్వారా మంచి అద్దెలు వచ్చే అవకాశం ఉంది. గుడ్‌విల్‌ ఆక్షన సరికాదని మేము కూడా భావించాం. బ్యాంకు రుణంతో కాంప్లెక్స్‌ నిర్మించేందుకు అనుమతించాలని ఉన్నతాధికారులకు రెండుసార్లు లేఖలు రాశాం. అయితే వారు మా వినతిని పరిశీలించకుండా జీవో 21 ఫాలో కండి (గుడ్‌విల్‌ ఆక్షన) అని మా అభ్యర్థనను తోసిపుచ్చారు. విధిలేని పరిస్థితుల్లో గుడ్‌విల్‌ ఆక్షనకు వెళ్లాం. అయితే మేము అంచనా వేసినంత గుడ్‌విల్‌ ఆక్షనలో పాడకపోగా అధిక మొత్తాలకు పాడిన వారు వెనక్కు తగ్గారు. దీంతో వారు ఒక్కొక్కరు ఈఎండీగా చెల్లించిన రూ.50 వేలు జమ చేసుకుని మళ్లీ పాటలు నిర్వహించేందుకు సిద్ధపడుతున్నాం.

- ఎస్‌.మనోహర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ 

Updated Date - 2022-08-13T04:55:10+05:30 IST