ఇది వీరభూమి

ABN , First Publish Date - 2022-07-05T07:40:17+05:30 IST

ఆంగ్లేయులపై పోరాడే క్రమంలో అల్లూరి సీతారామరాజు చూపించిన తెగువ 130 కోట్ల భారతీయులకు స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై అల్లూరి మాదిరిగానే పోరాడాలని పిలుపునిచ్చారు. మన్యం వీరుడి స్ఫూర్తితో దేశ ప్రజలందరూ..

ఇది వీరభూమి

దేశభక్తులను కన్నగడ్డ ఆంధ్రప్రదేశ్‌

మాతృభాష బోధనతోనే నాణ్యమైన విద్య

నేర్చుకోవడం కూడా పిల్లలకు బాగా తేలిక

అందుకే స్థానిక భాషలో చదువుకు పెద్దపీట

అడవి బిడ్డలకే వనఫలాలు 

అణగారినవారి నేతృత్వం ఈరోజు అవసరం

వారు ముందుకొస్తే అభివృద్ధికి తిరుగుండదు

భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన

ఘనంగా సీతారామరాజు విగ్రహావిష్కరణ

అల్లూరి ఆదర్శం అజరామరం

ఆయన స్ఫూర్తిని యువత స్వీకరించాలి

‘దమ్ముంటే నా దేశ ప్రగతిని అడ్డుకోండి’

అంటూ అల్లూరిలా సవాల్‌ చేయాలి


మోదీ నోట తెలుగు పలుకులు

‘తెలుగువీర లేవరా.. దీక్ష బూని సాగరా! మన్యం వీరుడు..తెలుగుజాతి యుగపురుషుడు..స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్తు భారతావనికే స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన అందరి నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన నేలపై మనమందరం కలుసుకోవడం మన అదృష్టం’ 


తెలుగు ప్రముఖుల స్మరణ

తెలుగు ప్రముఖులు టంగుటూరి ప్రకాశం పంతులు, పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులును ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో స్మరించారు. మహాకవి శ్రీశ్రీ గీతం ‘తెలుగువీర లేవరా..’లోని కొన్ని చరణాలు పలికారు.


మన్నెం వీరుడి స్ఫూర్తిగా..

‘‘మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన ఘనత విప్లవ వీరుడు అల్లూరికే దక్కుతుంది. మన్నెం వీరుడుగా ముందుకువచ్చి ఆంగ్లేయులకు సవాలు విసిరి వీరోచితంగా పోరాడారు. ఆయనతోపాటు ఎందరో యువకులు దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు పోరాటం చేశారు. వారి ప్రేరణతో దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలి. దేశ చరిత్రలో అనాదిగా ఒకే దేశం-ఒకే భావన ఉంది. దానిని ఈ తరం ముందుకు తీసుకెళ్లాలి’’

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


అల్లూరి సీతారామరాజు సోదరుడైన సత్యనారాయణరాజు పెద్ద కుమారుడు శ్రీరామరాజును సత్కరించి నమస్కరిస్తున్న మోదీ


(భీమవరం నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఆంగ్లేయులపై పోరాడే క్రమంలో అల్లూరి సీతారామరాజు చూపించిన తెగువ 130 కోట్ల భారతీయులకు స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై అల్లూరి మాదిరిగానే పోరాడాలని పిలుపునిచ్చారు. మన్యం వీరుడి స్ఫూర్తితో దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ముందుకెళితే భారతదేశ ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ దేశ భక్తులకు పురిటిగడ్డ అంటూ పలువురు స్వతంత్ర సమరయోధుల పేర్లను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను ప్రజలకు వివరిస్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, యావత్‌ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన తెలుగుజాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన 125 జయంతి సందర్భంగా ఆ మహనీయుడు నడయాడిన గడ్డపై ఆయన కుటుంబసభ్యులతో వేదిక పంచుకోవడం, కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ దేశభక్తులను కన్న పుణ్యభూమి, వీరభూమి అని, ఇటువంటి ప్రాంతానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి మహానుభావులు తెలుగునేలపై  దేశం కోసం బలిదానం చేశారని గుర్తు చేశారు. ఇలాంటివారి కలలను సాకారం చేయాల్సి బాధ్యత దేశ ప్రజలందరిపై ఉందని...ఒకే దేశం, ఒకే భావనతో ప్రాణత్యాగం చేసిన ఈ మహనీయులు స్ఫూర్తిగా దేశాభివృద్ధికి యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఇటువంటి మహనీయుల త్యాగాలను నేటితరానికి తెలియజెప్పాలని, వారి పోరాటపటిమ నేటితరానికి స్ఫూర్తి కావాలనే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం వేడుకలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. అల్లూరి సీతారామరాజు దేశంకోసం బ్రిటీషర్లపై తిరగబడినప్పుడు ఆయన వయసు కేవలం 24 ఏళ్లని, ఆదివాసీల్లో శౌర్యం, ధైర్యం నింపి ఆయన చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ‘మనదే రాజ్యం’ నినాదంతో ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన ఘనత విప్లవ వీరుడు అల్లూరికే దక్కుతుందని తెలిపారు. మన్నెం వీరుడుగా ముందుకువచ్చి అంగ్లేయులకు సవాలు విసిరి వీరోచితంగా పోరాడాడని కొనియాడారు.


ఆయనతోపాటూ ఎందరో యువకులు దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు పోరాటం చేశారని, వారి ప్రేరణతో నేడు దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలని ప్రధాని ఆకాంక్షించారు. దేశ చరిత్రలో అనాదిగా ఒకే దేశం-ఒకే భావన ఉన్నదని, దాన్ని ఈ తరం ముందుకు తీసుకెళ్లాలన్నారు. దేశం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకుంటోందని ఈ ఏడాది మొత్తం మన్నెం వీరుడి 125వ జయంత్యుత్సవాలు కూడా జరుపుతామన్నారు. అల్లూరి రంప ఉద్యమం ప్రారంభించి సరిగా 100 ఏళ్లు అవుతోందని గుర్తు చేశారు. 


మన్యం వీరుడి మెమోరియల్‌... 

దేశవ్యాప్తంగా వెనుక బడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లా లంబసింగిలో అల్లూరి మెమోరియల్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య కోసం ఏకలవ్య పాఠశాల ఏర్పాటు చేసినట్టు  చెప్పారు. మోగల్లులో ధ్యాన మందిరం, అల్లూరి దాడి చేసిన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ అభివృద్ధి, స్వాతంత్య్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్ఫూరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అల్లూరి తిరిగిన ప్రాంతాలను స్మరించుకుంటూ ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. దేశ వ్యాప్తంగా 3 వేల వనధన్‌ యోజన కేంద్రాలను ఏర్పాటుచేశామని, రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో ట్రైబల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించామన్నారు. గిరిజన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మోదీ తెలిపారు.


అన్ని వర్గాల అభివృద్ధికి చర్యలు..

దేశంలో ఆదివాసీలతోపాటు యువకులు, మహిళలు, వెనుకబడిన అన్నివర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని అన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో గిరిజనులకు అటవీ సంపదపై హక్కులు కల్పించామన్నారు. అంతకుముందు అడవిలో ఎదురుబొంగులు తీసుకునే హక్కు కూడా వారికి లేదని, ఈ రోజు అటవీ సంపదపై వారికి పూర్తి హక్కు కల్పించామన్నారు. తమ ప్రభుత్వం వచ్చేనాటికి కేవలం 12 రకాల ఉత్పత్తులపైనే గిరిజనులు హక్కులు కలిగి ఉండేవారని, ఇప్పుడు 90 రకాల ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా దృష్టి సారించామని తెలిపారు. మహనీయుల కలలను సాకారం చేసేందుకు ‘ఖేల్‌ ఇండియా’ కింద యువతకు నైపుణ్య కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రైతులను అన్నివిధాలా అదుకుంటున్నామన్న ఆయన, అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించామని ప్రధాని చెప్పారు.


మోదీ సభలో ‘మెగా’ సందడి

చిరంజీవితో ప్రధాని ముచ్చట్లు..

కుశల ప్రశ్నలు.. చిరునవ్వులు

భీమవరం, జూలై 4(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మెగాస్టార్‌ చిరంజీవి మధ్య ముచ్చట్లు అందరినీ ఆకర్షించాయి. కేంద్ర పర్యాటకశాఖ మాజీ మంత్రిగా చిరంజీవికి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. దీంతో అల్లూరి సభకు హాజరైన చిరంజీవి వేదికపై మోదీని శాలువాతో సత్కరించారు. ఇరువురూ పరస్పరం వందనం చేసుకున్నారు. కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. చిరునవ్వులు చిందించారు. చిరంజీవిని ప్రధాని కుశల ప్రశ్నలు వేశారు. సభ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి జగన్‌, చిరంజీవి పరస్పరం పలకరించుకుని, నవ్వులు చిందిస్తూ ఆలింగనం చేసుకున్నారు. ఈ సన్నివేశమూ అందరినీ ఆకట్టుకుంది. 


ప్రధాని ఆవిష్కరించిన అల్లూరి విగ్రహం వద్ద కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితర నాయకులు






సీతారామరాజు ప్రధాన అనుచరుడు గంటం దొర మనవడు బోడి దొరను సత్కరించి నమస్కరిస్తున్న మోదీ



తెలుగువీర లేవరా..

విప్లవ వీరుడి విగ్రహావిష్కరణ సందర్భంగా తన ప్రసంగాన్ని ప్రధాని మోదీ తెలుగులో మొదలుపెట్టి సభికులను ఆకట్టుకున్నారు. ‘‘తెలుగు వీర లేవరా -దీక్ష బూని సాగరా’ అంటూ తెలుగులో ప్రసంగించారు. ఇది శ్రీశ్రీ రచించిన గీతం. ప్రసంగం మొదలుపెట్టగానే ‘భారత్‌ మాతాకు జై’ అని తానూ అంటూ..సభికులతో అనిపించి ప్రధాని తన ప్రసంగం తెలుగులో ప్రారంభించి.. ఆ తర్వాత హిందీలో కొనసాగించారు. గిరిజన బిడ్డలకు మంచి విద్యాభ్యాసం కోసం 750 ఏకలవ్య పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ‘‘దేశం అభివృద్ధి జరగాలంటే అణచివేతకు గురైన కులాలు నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. యువకులు, ఆదివాసీలు, మహిళలు, దళితులు... ఇలా వెనుక బడిన కులాలన్నింటికీ సమాన ఫలాలు అందాల్సి ఉంది. అణచివేత నుంచి వచ్చిన వారి నాయకత్వంలో జరిగే దేశ అభివృద్ధి కృషిని ఏ శక్తీ నిలువరించలేదు. అల్లూరి స్ఫూర్తిగా...‘దమ్ముంటే నా దేశ ప్రగతిని ఆడ్డుకోండి’ అంటూ సవాల్‌ విసిరి ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.  

Updated Date - 2022-07-05T07:40:17+05:30 IST