సిరివెన్నెల మృతి దిగ్ర్భాంతిని కలిగించింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-30T23:59:32+05:30 IST

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి దిగ్ర్భాంతిని కలిగించిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మృతి సినిమా రంగానికి తీరని లోటని...

సిరివెన్నెల మృతి దిగ్ర్భాంతిని కలిగించింది:  చంద్రబాబు

అమరావతి: సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి దిగ్ర్భాంతిని కలిగించిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మృతి సినిమా రంగానికి తీరని లోటని ఆయన వ్యాఖ్యానించారు. అంచలంచలుగా ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. తన పాటలతో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో 3 వేలకు పైగా పాటలు రాసి కోట్లాది మంది ప్రేక్షకులను సిరివెన్నల ఆకట్టుకున్నారన్నారు. తన పాటలతో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు అన్నారు. 


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రఖ్యాత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు చలన చిత్రపరిశ్రమ, సాహిత్య లోకానికి తీరనిలోటన్నారు. ‘‘సిరివెన్నెల కలం నుంచి జాలువారిన గీతాలు ఆణిముత్యాలు.  సిరివెన్నెల సీతారామశాస్త్రికి అశ్రునివాళి అర్పిస్తున్నాను.  కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.’’ అని లోకేష్ చెప్పారు. 


ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ మాట్లాడుతూ ‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినీ రంగానికి తీరని లోటు. భరణి పేరుతో కవితలు రాసిన  ప్రఖ్యాత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం బాధాకరం. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అశ్రునివాళి. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం.’’ అని అన్నారు.



మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సిరివెన్నెల మరణం సినీ సాహితీ రంగానికి తీరని లోటు. అనకాపల్లి పేరు ప్రఖ్యాతులను పెంచిన మహోన్నత వ్యక్తి సిరివెన్నెల. తొలి నంది అవార్డు సిరివెన్నెలకు  నా చేతుల మీదగా ఇవ్వడం మరిచిపోలేని అనుభూతి.’’ అని అన్నారు. 

Updated Date - 2021-11-30T23:59:32+05:30 IST