‘శ్యామ్ సింగ రాయ్’: ‘సిరివెన్నెల’ చివరి పాట విడుదల

లెజెండ‌రీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి చివ‌రి పాట న్యాచులర్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం కోసం రాసిన విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. శాస్త్రిగారి అంతిమ సంస్కారాలు నిర్వహించిన రోజున ‘సిరివెన్నెల’ పాటను రికార్డ్ చేశారు. ఈ చిత్రాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం ఇస్తున్నట్లుగా ఇప్పటికే మేక‌ర్స్‌ ప్రకటించి ఉన్నారు. మంగళవారం ఆయన రాసిన చివరి పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. 


నాని, సాయి పల్లవిల మధ్య ఉన్న ఆహ్లాదకరమైన ప్రేమ కథను చిత్రీకరించే ఈ మనోహరమైన పాట‌కు మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. నాని, సాయి ప‌ల్ల‌వి కేవ‌లం రాత్రుల‌లోనే క‌లుస్తారు. వారు క‌లిసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది సాయి ప‌ల్ల‌వి. వారు సినిమా హాలు, ఇత‌ర ప్ర‌దేశాల‌కు వెళ్తుంటారు. వారిద్ద‌రి మ‌ధ్య క్లాసిక్ కెమిస్ట్రీ ఈ పాట‌కు మ‌రింత అందాన్ని తెచ్చింది. సిరివెన్నెలగారి సాహిత్యం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటను మనోహరంగా పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా, ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.


Advertisement