Abn logo
Sep 20 2020 @ 22:59PM

సినిమా పాట రాసేటప్పుడు నా లక్ష్యం ఏంటంటే: సిరివెన్నెల

Kaakateeya

తెలుగు సినిమా గేయ రచయిత, పద్మశ్రీ పురస్కార గ్రహీత సిరివెన్నెల సీతారామశాస్త్రి.. క్వోరా తెలుగులో 'జీవితమూ జీవించడమూ, నా సాహిత్యం' అనే అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయనే స్వయంగా సమాధానాలు ఇస్తున్నారు. క్వోరాలో ప్రశ్నలు అడిగిన వారికి ఆయన ఇచ్చిన సమాధానాలు.. నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.  తాజాగా ఆయనను ''సినిమా కోసం మీరు ఒక పాట రాసేటప్పుడు మీరు ఏ ఏ విషయాలను దృష్టిలో పెట్టుకుంటారు? పాత్రనా? సందర్భాన్నా? సమాజాన్నా?" అని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. 

దీనికి ఆయన ఇచ్చిన సమాధానం:

సినిమా అనేది సమాజంలో మనిషి తాలూకూ ఇతివృత్తమే. కాకపోతే, చిన్నగా ఉన్న విషయాన్ని కాస్త నాటకీయతతో పెంచి చూపిస్తారు సినిమాలో. ఒక పాట నేను రాయవలసి వచ్చినప్పుడు, ముందు దాని అసలైన సందర్భానికి వెళ్ళి ఆలోచిస్తాను. సినిమా గేయ రచయిత పని ఏంటంటే రాయగలగడం అనే తన శక్తిని పాత్రలకి అరువివ్వడం. డబ్బింగ్ కళాకారులు గొంతు అరువిచ్చినట్టు అన్నమాట. ఎంతో మంది కవులు మనకి ఉన్నారు. వారి వారి భావాలను గొప్ప గొప్ప కవితలుగా చక్కగా రాసుకున్నారు. కానీ, వాళ్ళలో కొందరు సినిమా పాటలు రాయకపోవడానికి కారణం ఏంటంటే, సినిమా పాటకి వచ్చేసరికి కవిగా నువ్వు ఉండవు. పాట పాడే పాత్రకి నీ రచనా శక్తిని అరువు ఇవ్వాల్సి వస్తుంది.


నాకు చిన్నతనంలో ఒక సందేహం ఉండేది. సినిమాలో ఆ నటీనటులు పాడుతున్నారే తప్ప వాయిద్యాలు వాయించట్లేదు కదా. మరి, ఆ వాయిద్యాలు ఎవరు వాయిస్తున్నట్టు అని. పైగా, అప్పటిదాకా లక్షణంగా కబుర్లు చెప్పుకుంటున్నవాళ్ళల్లా గబ గబా పరిగెట్టుకుంటూ పాట ఎందుకు మొదలెట్టారు అనుకునేవాణ్ణి. అలా, చాలా సినిమాల్లో పాటలు అసందర్భంగానే వస్తాయన్నది నిజమే. కానీ, జీవితంలో పాట అనేది చాలా అవసరమైన విషయం. ఒక బిడ్డ పుట్టినప్పుడు లాలి పాట దగ్గర నుంచి, వాడు ఎదుగుతున్నప్పుడు పాడుకునే ఈల పాట దాకా. అలాగే, ఉయ్యాలలో వేసేటప్పుడు, పండగలప్పుడూ, పూజలప్పుడూ, పెళ్ళికీ ఇలా ప్రతి సందర్భంలోనూ పాట ఉంటుంది. నిజ జీవితంలో పాడతారు కూడా. కాబట్టే, మనిషి తాలూకు ఇతివృత్తమైన సినిమాలో పాట వస్తుంది.

ఐతే, నవరసాల్లో అన్ని రసాలనీ ఏదో ఒక విధంగా వ్యక్తీకరించవచ్చు. నవ్వడం, ఏడవడం, కోపం వస్తే అరవడం, ఆశ్చర్యపోయినప్పుడు కూడా పదాలు ఉన్నాయి. కోపం వస్తే ఛందస్సులో పద్యం రాసుకోవచ్చు, "జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము" అని. కానీ ఒకే ఒక్క రసానికి అసలు వెర్బల్ ఎక్స్‌ప్రెషనే లేదు. అదే శృంగారం. శృంగారం పరాకాష్ట చెందితే మౌనమే ఎక్స్‌ప్రెషన్. అందుకే ఒక్క శృంగార రసానికి మాత్రం నిజ జీవితంలో పాటలు పాడరు. చిత్రమేమిటంటే సినిమాల్లో ఉన్న పాటల్లో 90 శాతం పాటలు శృంగార రసానికి సంబంధించినవే. భారతదేశంలో నాటకాల నుంచి ఇప్పటివరకూ నిజ జీవితంలో ఆ రూపంలో వ్యక్తీకరణే లేని రసాన్ని పాట రూపంలో వ్యక్తీకరించేస్తున్నారు. అలా, 90 శాతం పాటలకి అసందర్భమే సందర్భం అయిపోయింది.


అసలు మిగిలిన రకాలైన పాటలు రాయడం కాస్త సులభమే. శృంగార గీతాలు రాయడం కష్టం. ఇలా రాయాల్సి వచ్చినప్పుడు నేను వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తాను. వారిద్దరూ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమనో, వాంఛనో, కోరికనో, ఆరాధననో, ఆరాటాన్నో వాళ్ళ అంతరంగాలు వ్యక్తపరుస్తున్నట్టు భావించి, నేను వారిగా మారి తుంటరిగా, కొంటెగా, పవిత్రంగా, ఒకోసారి పట్టలేని ఆరాటంగా, ఒకోసారి గొప్ప ఆరాధనగా ఆ సందర్భానికి తగ్గట్టుగా నా భావాన్ని వారి గొంతుకు అరువు ఇస్తాను. కాబట్టి, సినిమా పాట రాసేటప్పుడు నా లక్ష్యం ఏంటంటే నా భావాన్ని ఆయా పాత్రలకి ఆపాదించడం. అందుకే ప్రతీ దానికీ నేనే ఆ సందర్భంలోకి వెళ్ళిపోతాను.


ఈ కాలంలోనే కాదు మా కాలంలో మేమూ ప్రేమించేవాళ్ళం. ప్రేమించకుండా ఏ కాలంలో ఎవడు మాత్రం ఉంటాడు!? కాకపోతే మా కాలంలో - అమ్మాయికి తెలిస్తే, ఆమె బాధపడితే, పెద్దవాళ్ళ దాకా వెళితే - అనే భయంతో దూరంగా కనిపించీ కనిపించని ఆ అమ్మాయి ఇంటి వైపు చూసి ఏదో హిందీ పాట మనసులో పాడుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు పద్ధతులు మారాయి. పద్ధతులు మారినా ఆ ప్రేమ అనే భావం ఎప్పుడూ అదే. ప్రేమ అనే భావం గుండెలో కదిలినప్పుడు, ఆ కదలిక విస్మరించలేని విధంగా ఉన్నప్పుడు, అది ఎలా కదిలి ఉంటుందో అని అందరికీ చెప్పాలనుకుంటున్నట్టుగా "గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే.. కళ్ళ నిండా సంక్రాంతులు, సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే.. వెంటనే పోల్చాను నీ చిరునామా.. ప్రేమా!" అని రాశాను. అలాంటి అలజడి, తియ్యటి కదలికా నాకూ కలిగే ఉంటుంది కదా. శ్రీరాముడికే సీతమ్మ తల్లిని చూస్తే అలాంటి అందమైన అలజడి కలిగింది. కాబట్టి, ప్రేమ పాటగా నాకు కలిగిన ఆ భావాన్నే ఆ కథానాయికా, నాయకులకు కలిగినట్టుగా రాయమని దర్శక నిర్మాతలు అడిగారన్న మాట. రేపు నా పిల్లలకి అలాంటి భావం కలిగినా ఎవరికీ అభ్యంతరం లేనంత బాగా, వల్గారిటీ లేకుండా దానిని వ్యక్తీకరించాలి. ఎలా వ్యక్తీకరిస్తే అది సార్వజనీనంగా, మంగళకరంగా ఉంటుందో అలా రాయాలని రాశాను. అలాగే రాస్తాను కూడా.

అలా- సినిమా పరిధిని దాటి సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని, సినిమా అవసరానికి లోబడి రాస్తాను. ప్రత్యేకంగా, శృంగార గీతాల గురించే ఎందుకు చెప్తున్నానూ అంటే "నిగ్గదీసి అడుగు" లాంటి పాటను తన భావాలకు అనుగుణంగా ఎవరైనా రాయగలరు. స్థాయీ బేధం ఉండచ్చేమో. కానీ, శృంగార గీతాలు రాసేటప్పుడు, కుర్రాళ్ళు పాడుకునే పాటల విషయంలో జాగ్రత్త అవసరం. కాబట్టే, చాలా నిబద్ధతగా ఆలోచించి రాస్తాను.


ఐటెం సాంగ్ అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు రాయను. ఏదో- క్లబ్బులో డ్యాన్స్ చేస్తోంది కదా అని ఆమె పాత్రని అడ్డుపెట్టుకుని మౌలికమైన స్త్రీతత్వాన్ని అవమానించకూడదు కదా. నిజానికి, ఆమె అలా బజారున పడటానికి కారణం ఎవరు? సమాజమే కదా. ఆమె తన శరీరాన్ని అమ్ముకుని భోజనం చేయాల్సిన అగత్యం పట్టడానికి సమాజమే కదా కారణం. అందుకోసమని- పాత్రని అడ్డుపెట్టుకుని విశృంఖలంగా రాయడం తప్పు. క్లబ్‌లో డ్యాన్స్ చేసే అమ్మాయి "ముసుగు వెయ్యద్దు మనసు మీద" అని తాత్వికంగా మాట్లాడకూడదా? ఆమెకు ఆలోచనలు, భావాలూ ఉంటాయి కదా. అదే రాశాను.


ఇలా రాస్తే దర్శక, నిర్మాతలేం వద్దు పొమ్మనరు. వాళ్ళేం ఆకాశం నుంచి రాలిపడిన వడగళ్ళేం కాదు కదా! ఆ సందర్భానికి తగ్గట్టుగా, ఇచ్చిన ట్యూనుకి తగ్గట్టుగా పాట రాయడం కావాలి వాళ్ళకి. అందులో మంచి, ఆదర్శ భావాలు వస్తే "ఇది ఎవడు రాయమన్నాడు, చెత్తగానే రాయి" అనేం అనరు వాళ్ళు. కనుక, దర్శక, నిర్మాతలకి కావాల్సిన సందర్భానికి, వారికి కావాల్సిన భావాన్నే ఇస్తాను, కానీ - అందులో సమాజానికి కవిగా నేను ఏం చేరవేయాలనుకుంటున్నానో వాటినీ చొప్పిస్తాను.

- (క్వోరా తెలుగు సౌజన్యంతో) 

ఇవి కూడా చదవండిImage Caption

నాకుండే గౌరవాన్ని నా అక్షరం నిలబెట్టేలా ఉండాలి: సిరివెన్నెల

Advertisement
Advertisement