నేడు అంతరిక్షానికి మన తెలుగమ్మాయి.. తొలి తెలుగు మహిళగా రికార్డ్!

ABN , First Publish Date - 2021-07-11T12:53:35+05:30 IST

తెలుగమ్మాయి బండ్ల శిరీష(34) ఆదివారం అంతరిక్షంలోకి ప్రయాణించనుంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థకు చెందిన వీఎ్‌సఎస్‌ యూనిటీ వ్యోమనౌకలో ఆమె రోదసిలోకి దూసుకెళ్లనుంది. అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి ఈ ప్రయోగం ఉంటుందని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష..

నేడు అంతరిక్షానికి మన తెలుగమ్మాయి.. తొలి తెలుగు మహిళగా రికార్డ్!

అమెరికా నుంచి అంతరిక్షానికి దూసుకెళ్లనున్న

వర్జిన్‌ గెలాక్టిక్‌ ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ’

మరో ప్రయాణికుడిగా సంస్థ అధినేత బ్రాన్సన్‌


కల్పన చావ్లా, సునీత విలియమ్స్‌ తర్వాత రోదసిలోకి ప్రయాణించనున్న మూడో భారతీయ మహిళగా, తొలి తెలుగు మహిళగా శిరీష నిలవనున్నారు. 

హూస్టన్‌, జూలై 10: తెలుగమ్మాయి బండ్ల శిరీష(34) ఆదివారం అంతరిక్షంలోకి ప్రయాణించనుంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థకు చెందిన వీఎ్‌సఎస్‌ యూనిటీ వ్యోమనౌకలో ఆమె రోదసిలోకి దూసుకెళ్లనుంది. అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి ఈ ప్రయోగం ఉంటుందని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష.. హ్యూస్టన్‌లో పెరిగారు. ఇక్కడే విద్యనభ్యసించి ఏరోనాటికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాలు-పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


బాల్యం నుంచీ వ్యోమగామి కావాలనుకున్న శిరీష, ఎట్టకేలకు ఆదివారం తన కలను నెరవేర్చుకోనుండటం విశేషం. ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీష ట్విటర్‌లో పేర్కొన్నారు. కల్పన చావ్లా, సునీత విలియమ్స్‌ తర్వాత రోదసిలోకి ప్రయాణించనున్న మూడవ భారతీయ మహిళగా శిరీష నిలవనున్నారు. ఈ ప్రయాణంలో వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అధినేత సర్‌ రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ కూడా ఉండటం గమనార్హం. ఈ ప్రయోగం విజయం అనంతరం.. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలనేది వర్జిన్‌ సంస్థ యోచన.

Updated Date - 2021-07-11T12:53:35+05:30 IST