Abn logo
Nov 21 2020 @ 04:41AM

అహరహం శ్రమించి.. ఉన్నతికి బాటలు వేసి..

సిరాజ్‌ కెరీర్‌లో గౌస్‌ కీలక పాత్ర

తండ్రి మృతితో పేసర్‌ కన్నీరుమున్నీరు

జాతీయ జట్టుతో ఆస్ట్రేలియాలో.. 

కడచూపునకు రాలేని పరిస్థితి


తొలిసారి టెస్టులకు ఎంపికైన ఆనందంలో ఉన్న టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు నిజంగా ఇది పిడుగులాంటి వార్తే. తన ఎదుగుదలలో ఎంతో కీలకంగా వ్యవహరించిన తండ్రి మహ్మద్‌ గౌస్‌ శుక్రవారం కన్నుమూయడంతో సిరాజ్‌ కన్నీరుమున్నీరవుతున్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతోపాటు జట్టు సహచరులు సిరాజ్‌ను ఓదారుస్తున్నారు. ప్రస్తుతం సిరాజ్‌ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అక్కడి క్వారంటైన్‌ నిబంధనల కారణంగా అతడు తండ్రి అంత్యక్రియలకు రాలేకపోయాడు. 


ఆ ప్రదర్శనతో మురిసి..: సిరాజ్‌ ఇటీవల ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు తరఫున కోల్‌కతాపై సంచలన ప్రదర్శన (3/8) చేయడానికి ముందు రోజే గౌస్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఈ మ్యాచ్‌ తర్వాత సిరాజ్‌ ఫోన్‌ చేస్తే గౌస్‌ ఇంట్లోనే ఉన్నాడట. కొడుకు ప్రదర్శనతో ఉప్పొంగిపోయిన గౌస్‌.. స్థానిక పేపర్లలో తన కుమారుడి ఫొటోలు చూసుకుని మురిసి పోయారు. కాగా, సిరాజ్‌ తండ్రి మృతిపట్ల బెంగళూరు జట్టు యాజమాన్యం సంతాపం తెలిపింది.  

ఆటో నడుపుతూ..

పేద కుటుంబంలో పుట్టిన సిరాజ్‌ ఏకంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం వెనుక తండ్రి గౌస్‌ పాత్ర వెల కట్టలేనిది. మూడు దశాబ్ధాలపాటు ఆటో డ్రైవర్‌గా పనిచేసిన గౌస్‌ ఆదాయం కుటుంబ అవసరాలకు ఏమాత్రం సరిపోయేది కాదు. చిన్నప్పటి నుంచే సిరాజ్‌కు చదువుపైకన్నా క్రికెట్‌పై ఆసక్తి ఉండడంతో కొడుకును వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఈ ఆట గురించి గౌస్‌కు ఏమాత్రం అవగాహన లేకపోయినా.. కొడుకు మాత్రం ఏదో ఒకరోజు గొప్ప స్థాయికి ఎదుగుతాడని నమ్మాడు. అతడి నమ్మకాన్ని వమ్ము చేయని సిరాజ్‌.. హైదరాబాద్‌ గల్లీల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి తండ్రి కష్టానికి ప్రతిఫలంగా నిలిచాడు. 2016-17 రంజీ సీజన్‌లో 41 వికెట్లు తీసిన సిరాజ్‌ను ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏకంగా రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో సిరాజ్‌ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అటు తండ్రి గౌస్‌ను ఇక ఆటో నడపడం మానేయాలని చెప్పిన సిరాజ్‌.. తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించి వారి కష్టాలకు ముగింపునిచ్చాడు. ఇక 2017లో తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్‌ను చూసి గౌస్‌ ఉప్పొంగిపోయాడు. ఇప్పుడు తుదిశ్వాస వీడినప్పుడు కూడా కొడుకు టెస్టు జట్టు సభ్యుడిగా ఉండడం ఓ రకంగా అతడి త్యాగానికి ఘనంగా నివాళి లభించినట్టే!


అతిపెద్ద అండ కోల్పోయా..

నాన్న చనిపోయాడనే వార్త షాక్‌కు గురి చేసింది. కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లీ ఈ విషయాన్ని నాకు చెప్పారు. నా జీవితంలో అతిపెద్ద అండను కోల్పోయా. నా చిన్నతనంలో నాన్న ఆటో నడుపుతూ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆ కష్టంతోనే ఈస్థాయికి ఎదిగా. ఏదో ఒకరోజు నేను దేశం తరఫున ఆడాలనేది నాన్న కలగా ఉండేది. ఆ కోరిక తీర్చగలిగా. అలాగే నేను దేశానికి గర్వకారణగా నిలవాలని చెప్పేవాడు.

- మహ్మద్‌ సిరాజ్‌