ముంచుకొస్తున్న కరోనా సెకండ్‌వేవ్‌

ABN , First Publish Date - 2021-04-16T06:17:25+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. అత్యంత వేగంగా వ్యాధివ్యాప్తి చెందుతోంది. నెలరోజుల వ్యవధిలోనే రోజుకు 500 మంది కరోనా బారినపడే పరిస్థితులు నెలకొనడం పొంచి ఉన్న ముప్పు తీవ్రతను చాటుతున్నది. గత సంవత్సరం కరోనా ప్రారంభమైన సమయంలో ఐదు నెలల తర్వాత నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు మొదటి నెలలోనే అగుపిస్తున్నాయి. గురువారం జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 503 మంది వ్యాధిబారినపడ్డారు.

ముంచుకొస్తున్న కరోనా సెకండ్‌వేవ్‌

 ఒక్కరోజే 500 మార్కు దాటిన పాజిటివ్‌ కేసులు

 కరీంనగర్‌ పట్టణంలో  253 మందికి 

 మరికొన్ని రోజుల్లో ఆసుపత్రుల్లో బెడ్స్‌ దొరకని పరిస్థితి

 జాగ్రత్త పడకపోతే గాలిలో కలిసిపోనున్న ప్రాణాలు 

 మందులకు ఏర్పడుతున్న కొరత 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. అత్యంత వేగంగా వ్యాధివ్యాప్తి చెందుతోంది. నెలరోజుల వ్యవధిలోనే రోజుకు 500 మంది కరోనా బారినపడే పరిస్థితులు నెలకొనడం పొంచి ఉన్న ముప్పు తీవ్రతను చాటుతున్నది. గత సంవత్సరం కరోనా ప్రారంభమైన సమయంలో ఐదు నెలల తర్వాత నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు మొదటి నెలలోనే అగుపిస్తున్నాయి. గురువారం జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 503 మంది వ్యాధిబారినపడ్డారు.  జిల్లాలో గతేడాది మార్చి 16న ప్రారంభంకాగా సెప్టెంబర్‌ మొదటివారంలో 500 సంఖ్యలు నమోదుకాగా సెకండ్‌ వేవ్‌లో కేవలం ఒక్క నెల వ్యవధిలోనే రోజుకు 500 మంది వ్యాధిబారినపడే పరిస్థితులు నెలకొనడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పడకలు లభించే అవకాశాలు లేవని ఆందోళన వ్యక్తమవుతున్నది. గురువారం జిల్లాలో మానకొండూరు మండలం లలితాపూర్‌కు చెందిన 52 సంవత్సరాల వ్యక్తి కరోనాతో మృతిచెందారు. హోంఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటుండగా ఆరోగ్యం విషమించడంతో ఈనెల 14న కరీంనగర్‌లో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించారు. రామడుగు మండలంలోని దేశరాజుపల్లిలో 43 సంవత్సరాల మరో వ్యక్తి కూడా కరోనాతో మృతిచెందారు. జిల్లావ్యాప్తంగా 503 మందికి వ్యాధి సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ కాగా వీరిలో 253 మంది జిల్లా కేంద్రానికి చెందిన వారే కావడం మరింత ఆందోళనకు కారణమవుతున్నది. జిల్లావ్యాప్తంగా సుమారు 10.50 లక్షల జనాభా ఉండగా అందులో సుమారు 4 లక్షల మంది కరీంనగర్‌ పట్టణంలోనే నివసిస్తున్నారు. 50శాతానికి మించిన కేసులు పట్టణంలోనే నమోదవుతుండడంతో కరీంనగర్‌ పట్టణమే కరోనా హాట్‌స్పాట్‌గా మారిందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 

జిల్లాలోని మండలాల్లో అత్యధికంగా తిమ్మాపూర్‌ మండలంలో 33 మంది, చొప్పదండి 22, హుజురాబాద్‌లో 30 మంది వ్యాధిబారినపడ్డారు.  కొత్తపల్లి మండలంలో 28 మందికి, రామడుగు 27, గంగాధర 27, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 20 మందికి, జమ్మికుంటలో 13 మందికి, ఇల్లందకుంటలో 12 మందికి, మానకొండూర్‌లో తొమ్మిది, వీణవంకలో ఏడుగురికి, చిగురుమామిడిలో ఆరుగురికి, సైదాపూర్‌ మండలంలో ఆరుగురికి వ్యాధి సోకింది. కరీంనగర్‌ పట్టణంలో 949 మంది పరీక్షలు నిర్వహించగా 253 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. పట్టణంలో పరీక్షలు చేయించుకున్న వారిలో 25శాతం మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న మండలాల్లో 2,178 మందికి పరీక్షలు చేయగా 250 మందికి పాజిటివ్‌ వచ్చింది. మండల కేంద్రాల్లో వ్యాధిసోకుతున్న శాతం 11.4 ఉంది. సగటున జిల్లాలో పరీక్షలు నిర్వహించుకుంటున్న వారిలో 16శాతం మంది వ్యాధిబారినపడుతున్నారు.  ఒక కుటుంబంలో ఒకరు వ్యాధి బారినపడితే కుటుంబంలోని వారంతా ఒకటిరెండు రోజుల్లోనే వ్యాధికి గురవుతున్నారు. దీనితో కేసుల సంఖ్య అత్యధిక వేగంగా పెరుగుతున్నాయి.  వారంరోజులుగా రోజుకు ఒకరో ఇద్దరో మరణించడం, వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు  ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రితోపాటు 17 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రులన్ని జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 180 పడకలు కరోనా రోగుల కోసం అందుబాటులో ఉంచారు. ఇందులో 25 ఐసీయు పడకలు కాగా, 137 ఆర్టీజర్‌ సౌకర్యం ఉన్న పడకలు, మరో 18 మంది రెగ్యులర్‌ పడకలు ఉన్నాయి. కరోనా చికిత్స అందిస్తున్న అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కలిపి 609 పడకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రస్తుతానికి 60 నుండి 70శాతం పడకలు రోగులతో నిండిపోయినట్లు సమాచారం.  ఊహించని విధంగా కేవలం 10, 15 రోజుల వ్యవధిలోనే కరోనా కేసుల వ్యాప్తి పెరుగడంతో వ్యాధికి అవసరమైన మందులు కూడా మార్కెట్‌లో అందుబాటులో లేవు. 2020 అక్టోబర్‌ నుంచి వ్యాధి తీవ్రత పూర్తిగా తగ్గిపోవడంతో మెడికల్‌ ఏజెన్సీల వారు ప్యాకెట్లు, ట్యాబెట్లు, రెడిమిసీవర్‌ ఇంజక్షన్లు తెప్పించడం మానేశారు. 15 రోజుల క్రితం నుంచి మళ్ళీ కేసులు నమోదవుతుండడంతో రిటేల్‌ షాపుల్లో ఉన్న మందులు విక్రయిస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక్కసారిగా రోగుల సంఖ్య పెరుగుతుండడంతో మళ్ళీ టాబ్లెట్లు, ఇంజక్షన్లను అందుబాటులోకి తేవడానికి ఆర్డర్లు చేస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. 


5,646 మందికి వ్యాక్సిన్‌....


జిల్లా వ్యాప్తంగా గురువారం 34 వ్యాక్సినేషన్‌ సెంటర్లలో 5,646 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు. కొవిన్‌ 2.0 యాప్‌ ద్వారా 5,739  మంది పేర్లు నమోదు చేసుకోగా 5,646 మంది టీకా తీసుకున్నారని, 98.37 శాతం వ్యాక్సినేషన్‌ పూరైందని పేర్కొన్నారు. 


20 పడకలు ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రులకు కొవిడ్‌ అనుమతి 


జిల్లాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నందున అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లావ్యాప్తంగా 20 పడకలు ఉన్న అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్స అందించేందుకు అనుమతి మంజూరీ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుజాత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈచర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.  

  

ప్రధానాసుపత్రిలో కొవిడ్‌ చికిత్సకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

 

కరీంనగర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్సకు బెడ్స్‌ను 180 నుంచి 272కు పెంచాలని కలెక్టర్‌ కె శశాంక ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌ చికిత్స ఏర్పాట్లపై ఆసుపత్రి డాక్టర్లతో కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన ఆక్సిజన్‌ జనరేటర్‌ మిషన్‌ సోమవారంలోగా సిద్ధం చేయాలని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. కొవిడ్‌ వార్డులలో ఇంత వరకు 158 ఆక్సిజన్‌ పాయింట్లు ఉన్నాయని, మరో 131 పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల ల్యాబ్‌ను సోమవారంలోగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసే కొవిడ్‌ వార్డులలో ఆక్సిజన్‌ పాయింట్లకు సంబంధించిన ఎలక్ర్టికల్స్‌కు సంబంధించిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొవిడ్‌ చికిత్స వార్డులలో 24 గంటలు వైద్య సేవలందించుటకు డాక్టర్లకు డ్యూటీలు కేటాయించాలని ఆదేశించారు. అదనపు కొవిడ్‌ వార్డులకు సిబ్బందిని కేటాయించాలన్నారు. ఆసుపత్రిలో మందులకు కొరత లేకుండా నిల్వ ఉంచాలని సూచించారు. ఆసుపత్రిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ పెంచాలని, వ్యాక్సినేషన్‌ తీసుకునే వారికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, ఆర్‌ఎంవో శౌరయ్య, కోర్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ అలీం, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ రవీందర్‌,  పాల్గొన్నారు. 


వ్యాక్సినేషన్‌ సెంటర్లు పెంచేందుకు ఏర్పాటు చేయండి

 సుభాష్‌నగర్‌: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్ల శాతం పెంచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మున్సిపల్‌ అధికారులు, మెప్మా పీడీ, అర్బన్‌ వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ పట్టణంలో 6 యూపీహెచ్‌సీలు ఉన్నాయని, వీటిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందని, వ్యాక్సినేషన్‌ సంఖ్య అధికం కావడం వలన రెండు వ్యాక్సినేషన్‌ కేంద్రాలు పెంచడం జరిగిందని, అయినప్పటికీ రద్దీకి తగినట్లుగా ఇంకా నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌, వైద్యాధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో మున్సిపల్‌, మెప్మా సిబ్బందిని వైద్య సిబ్బందికి సహాయంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.  సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. అవసరమైన దగ్గర కిందిస్థాయి నుంచి అధికారుల వరకు ఎవరినైనా నియమించాలని, కొందరిపైనే ఒత్తిడి పడేలా చూడకూడదన్నారు. టీకా వచ్చే వారు  గుంపులుగా ఉండకుండ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కేజీబీవీ స్కూల్‌, సప్తగిరికాలనీలో శుక్రవారం నుంచి కొవిడ్‌ టెస్టులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుజాత, మెప్మా పీడీ రవీందర్‌, డీటీసీవో డాక్టర్‌ కె రవీందర్‌రెడ్డి, నోడల్‌ వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-16T06:17:25+05:30 IST