సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

ABN , First Publish Date - 2022-08-11T06:08:53+05:30 IST

సింగూరు ప్రాజెక్టుకు రెండురోజులుగా వరద నీటి ప్రవాహం మళ్లీ పెరిగింది. ప్రాజెక్టుకు ఎగువన మంజీర నది తీర ప్రాంతంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్టాల నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది.

సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వరద ప్రవాహం

ఒక గేటు ద్వారా వరద నీరు దిగువకు విడుదల

29.917 టీఎంసీలకు 28.219 టీఎంసీలు నిల్వ

ఇన్‌ ఫ్లో 7,950 క్యూసెక్కులు,  అవుట్‌ ఫ్లో 11,301 క్యూసెక్కులు


 పుల్‌కల్‌, ఆగస్టు 10: సింగూరు ప్రాజెక్టుకు రెండురోజులుగా వరద నీటి ప్రవాహం మళ్లీ పెరిగింది. ప్రాజెక్టుకు ఎగువన మంజీర నది తీర ప్రాంతంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్టాల నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ ప్రాంతంలోని మంజీర నది క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో మిగిలిన వరదను నీటిపారుదలశాఖ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులోకి 15,827 క్యూసెక్కులు వరద నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు రాత్రి 7 గంటలకు 8, 9నంబర్‌ క్రస్ట్‌ గేట్లను మీటరున్నర ఎత్తి  నీటిని దిగువన గల మంజీర రిజర్వాయర్‌లోకి వదిలారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు వరద నీటి ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఉండటంతో 9వ గేట్‌ను మూసివేశారు. సాయంత్రానికి అందిన సమాచారం మేరకు ప్రాజెక్టులోకి 7,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, 11,301 క్యూసెక్కులు అవుట్‌ ఫ్లో నమోదైంది. 29.917 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన ప్రాజెక్టులో 28.219 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. 

Updated Date - 2022-08-11T06:08:53+05:30 IST