బ్రహ్మంసాగర్‌కు సింగిల్‌ టెండరు

ABN , First Publish Date - 2021-06-23T05:41:00+05:30 IST

ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్రహ్మంసాగర్‌ జలాశయం లీకేజీ మరమ్మతులకు సింగిల్‌ టెండర్‌ మాత్రమే దాఖలైంది.

బ్రహ్మంసాగర్‌కు సింగిల్‌ టెండరు

లీకేజీ మరమ్మతులకు రూ.46.68 కోట్లతో టెండర్లు

టెక్నికల్‌ బిడ్‌ ఓపన్‌

మెగా కంపెనీ ఒక్కటే షెడ్యూల్‌ దాఖలు


కడప, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్రహ్మంసాగర్‌ జలాశయం లీకేజీ మరమ్మతులకు సింగిల్‌ టెండర్‌ మాత్రమే దాఖలైంది. జలవనరుల శాఖ ఇంజనీర్లు పిలిచిన టెండరు షెడ్యూల్‌కు ఆఖరి గడువు మంగళవారం కాగా షెడ్యూల్‌ దాఖలు సమయం ముగిశాక ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ సీఈ శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టెక్నికల్‌ బిడ్‌ ఓపెన్‌ చేశారు. మెగా ఇంజనీరింగ్‌ సంస్థ ఒక్కటే సింగిల్‌ టెండరు దాఖలు చేసింది. రిజర్వాయర్‌ గరిష్ట సామర్థ్యం 17 టీఎంసీలు కాగా.. 13 టీఎంసీలు నిల్వ చేయగానే లీకేజీలు వచ్చిన సంగతి తెలిసిందే. సాగునీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ పలుమార్లు ఆనకట్ట లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించారు. లీకేజీ ప్రాంతంలో గరిష్ట నీటిమట్టం 216.5 మీటర్ల నుంచి దిగువ బాటమ్‌ లెవల్‌ (కటాఫ్‌ వాల్‌) వరకు 100 మీటర్లు పొడవు, 54 మీటర్ల ఎత్తులో ‘ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రం వాల్‌’, ఆనకట్ట బయట వైపున శాండ్‌ ఫిల్టర్‌ నిర్మించాలని సూచించారు. టీజీపీ ఇంజనీర్లు రూ.46.68 కోట్లకు ప్రతిపాదనలు పంపగా ఈనెల 9న ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలల్లో మరమ్మతులు చేసేలా ఇంజనీర్లు టెండర్లు పిలిచారు. షెడ్యూల్‌ గడువు ముగిశాక టెక్నికల్‌ బిడ్‌ ఓపన్‌ చేస్తే సింగిల్‌ టెండరు మాత్రమే దాఖలు కావడం కొసమెరుపు. వాస్తవంగా మూడు నాలుగు కంపెనీలైనా పోటీ పడతాయని ఆశించారు. మెగా సంస్థ ఒక్కటే టెండరు వేసింది. నేడు (బుధవారం) ప్రైజ్‌ బిడ్‌ ఓపన్‌ చేస్తారు. అందులో ఆ సంస్థ ఎంత మొత్తానికి కోట్‌ చేసింది అన్నది పరిగణలోకి తీసుకొని సింగిల్‌ టెండరు ఆమోదించాలా..? మళ్లీ టెండర్లు నిర్వహించాలా..? అన్న కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానం మేరకు ఆన్‌లైన్‌లో రివర్స్‌ టెండర్లు నిర్వహించాలంటే రెండు కంటే ఎక్కువ కంపెనీలు టెండర్లు వేసి ఉండాలి. సింగిల్‌ టెండరు మాత్రమే రావడంతో రివర్స్‌ టెండర్స్‌ ఎలా నిర్వహిస్తారు..? అన్నది ప్రశ్నార్థకమే. ఈ విషయాన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ సీఈ శ్రావణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసుకెళ్లగా బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ లీకేజీ మరమ్మతు టెండర్లలో మెగా ఇంజనీరింగ్‌ సంస్థ ఒక్కటే టెండరు షెడ్యూల్‌ దాఖలు చేసింది. నేడు ప్రైజ్‌ బిడ్‌ ఓపన్‌ చేసి.. ఎంత అమౌంట్‌కు కోట్‌ చేశారో చూసి తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.   

Updated Date - 2021-06-23T05:41:00+05:30 IST