సింగిల్‌ టీ.. సినిమా టికెట్‌!

ABN , First Publish Date - 2021-12-02T08:18:57+05:30 IST

రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా... సింగిల్‌ టీ కనీసం 7 రూపాయలు! కాఫీ... పది రూపాయలు! అయితే... సినిమా టికెట్‌ అంతకంటే తక్కువే ఉండాలని సర్కారు తేల్చి చెబుతోంది. సినిమా టికెట్‌ ధరలపై గతంలో ఇచ్చిన సర్క్యులర్‌ను మరోసారి తెరపైకి..

సింగిల్‌ టీ.. సినిమా టికెట్‌!

  • ఏపీలో సినీ వినోద ‘చిత్రం’
  • పల్లెల్లో రూ.5కే ఎకానమీ టికెట్‌
  • కరెంటు ఖర్చులూ రావంటున్న ఎగ్జిబిటర్లు
  • బెనిఫిట్‌ షోలకు సర్కారు ససేమిరా
  • చెప్పిన ధరకే అమ్మాలని ఆదేశం
  • బాలయ్య ‘అఖండ’కు తొలి దెబ్బ
  • ఆ తర్వాత... వరుసగా పెద్ద సినిమాలు


విజయవాడ/హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా... సింగిల్‌ టీ కనీసం 7 రూపాయలు! కాఫీ... పది రూపాయలు! అయితే... సినిమా టికెట్‌ అంతకంటే తక్కువే ఉండాలని సర్కారు తేల్చి చెబుతోంది. సినిమా టికెట్‌ ధరలపై గతంలో ఇచ్చిన సర్క్యులర్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. పెద్ద బడ్జెట్‌ సినిమా అయినా సరే... టికెట్‌ అంతకుమించి ఎక్కువకు అమ్మకూడదని స్పష్టం చేస్తోంది. దీంతో... గురువారం విడుదలవుతున్న ‘అఖండ’ నుంచి సంక్రాంతి వరకు విడుదలకు సిద్ధంగా ఉన్న పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, భీమ్లా నాయక్‌ తదితర చిత్రాల ‘కలెక్షన్ల’పై సినీ పరిశ్రమ వర్గాల్లో గుబులు మొదలైంది. 1990వ దశకంలో నేల టికెట్‌ ధర 5 రూపాయలు ఉండేది. ఇప్పుడు గ్రామ పంచాయతీల్లోని నాన్‌ ఏసీ థియేటర్లలో ఎకానమీ టికెట్‌ ధర 5 రూపాయలే! అదే ఏసీ థియేటర్‌ అయితే.. 10 రూపాయలు. పట్టణాలు, నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల లో ప్రీమియం, డీలక్స్‌ క్లాస్‌ల ధరలపట్ల కొంత సంతృప్తిగానే ఉన్నప్పటికీ... మిగిలిన అన్ని ధరలు గిట్టుబాటు కావని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1200కి పైగా సినిమా థియేటర్లున్నాయి. వాటిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. గతంలో.. కొత్త చిత్రం విడుదలైన తర్వాత తొలి వారం రోజులు టికెట్‌ ధరలను పెంచుకునే అవకాశం థియేటర్ల యజమానులకు ఉండేది. అయితే వకీల్‌సాబ్‌ చిత్రం నుంచి ప్రభుత్వం బ్రేక్‌లు వేసింది. 


పెద్ద సినిమాలకు షాకే..

పెద్ద సినిమా విడుదలవుతోందంటే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, ఫ్యాన్స్‌ అందరికీ పండగే! బెనిఫిట్‌ షోలు, రోజంతా ప్రదర్శనలు, అభిమానుల హడావిడి.. రాష్ట్రంలో ఇదంతా గతకాల వైభవమే. బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వం బ్రేక్‌ వేసిం ది. రోజుకు నాలుగు ఆటలకు మించకూడదని తేల్చి చెప్పింది. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని ప్రవేశపెడుతూ సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేసిం ది. దాని ప్రకారం సినిమా టికెట్ల కొత్త రేట్లను నిర్ణయించింది. పాత సర్క్యులర్‌ను మరోసారి థియేటర్ల యజమానులకు గుర్తు చేసింది. ప్రముఖ కథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం మరికొన్ని గంటల్లో విడుదల కానుండగా ఈ సర్క్యులర్‌ మరోసారి తెరపైకి రావడం గమనార్హం. వెరసి.. సర్కారు వారి తొలిదెబ్బ ‘అఖండ’కే తగులుతోంది. ‘టికెట్‌ రేట్లు తగ్గిపోయాయి. అందుకే, మీ సినిమాను కనీసం 30 శాతం తగ్గిస్తే కానీ మాకు వర్కవుట్‌ కాదు’ అని రెండు నెలలుగా బయ్యర్లు ‘అఖండ’ నిర్మాత మిరియాల రవీందర్‌రెడ్డి మీద ఒత్తిడి తెస్తున్నారు. చివరకు 20 నుంచి 25 శాతం వరకూ ఆయన తగ్గించడానికి అంగీకరించారని సమాచారం.


వెరసి... ఈ సినిమాతో పది కోట్ల టేబుల్‌ ప్రాఫిట్‌ వస్తుందనే ఆశతో ఉన్న నిర్మాతకు, ఇప్పుడు చేతి నుంచి రూ.5 కోట్లు కట్టాల్సి వస్తుందని అంటున్నారు. ‘అఖండ’ ఆ తర్వాత ‘పుష్ప’, ‘భీమ్లా నాయక్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి భారీ బడ్జెట్‌ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటికి కూడా 20 నుంచి 25 శాతం వరకూ బిజినె్‌సలో కోత జరిగితే పరిస్థితి ఊహాతీతం. 


టాలీవుడ్‌ పెద్దల మాటలు పట్టించుకోలేదు

ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం తమకు సమ్మతమేననీ, అయితే టికెట్‌ రేట్లు పెంచిన తర్వాత ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయాలని చిరంజీవి విన్నవించారు. చివరకు నాగార్జున స్వయంగా వెళ్లి సీఎం జగన్‌ను కలిసి వచ్చారు.  సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా రంగంలోకి దిగి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఏపీ ప్రభుత్వం కచ్చితంగా బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతోందనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో ఏర్పడుతోంది.   

Updated Date - 2021-12-02T08:18:57+05:30 IST