Abn logo
Nov 30 2020 @ 00:00AM

గ్రామీ రేసులో ఆల్‌రౌండర్‌!

సంగీతం, నటన, సామాజిక సేవ, అలా్ట్ర మారథాన్‌...  ‘రంగం ఏదైనా అత్యుత్తమంగా ప్రయత్నించడం, అత్యున్నత ఫలితం సాధించడం నా లక్ష్యం’ అంటారు గాయని  ప్రియ దర్శిని. సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన గ్రామీ పురస్కారానికి తాజాగా ఆమె తొలి ఆల్బమ్‌ ‘పెరిఫెరీ’ నామినేట్‌ అయింది. ఇప్పుడామె తన చిన్ననాటి కలను నెరవేర్చుకోడానికి మరొక్క అడుగు దూరంలో ఉన్నారు.


ప్రియ దర్శినిది ముంబయ్‌లో స్థిరపడిన తమిళ కుటుంబం. ఆమె బామ్మ భరతనాట్య కళాకారిణి. శాస్త్రీయ సంగీత గాయని కూడా. ఆమె పేరే ప్రియదర్శినికి పెట్టారు. ‘‘పేరునే కాదు కళాస్ఫూర్తిని కూడా బామ్మ నుంచే అందుకున్నాను. సంగీతాన్ని వృత్తిగా తీసుకొనేలా ఆమె నన్ను బాగా ప్రోత్సహించారు’’ అంటారు ప్రియ దర్శిని. అలా నాలుగేళ్ళ వయసులో ఆమె కర్ణాటక సంగీత పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచీ అదే ఆమె ప్రపంచమైపోయింది. కచ్చేరీలు కూడా చేశారు. ఆ తరువాత వివిధ సంగీత సంప్రదాయాలవైపు దృష్టి మళ్ళించారు. పాశ్చాత్య సంగీత రీతుల్ని కూడా అధ్యయనం చేశారు. దాదాపు వందకి పైగా రేడియో, టెలివిజన్‌ వాణిజ్య ప్రకటనలకూ, అనేక సినిమాల్లో సౌండ్‌ ట్రాక్‌లకు గళాన్ని అందించారు. 


చదువుకోసం న్యూయార్క్‌ వెళ్ళి, అక్కడే స్థిరపడ్డారు. న్యూయార్క్‌ ఆమె సంగీత ప్రతిభను ప్రదర్శించడానికి కొత్త ద్వారాలు తెరిచింది. పెరల్‌ జామ్‌, జాక్‌ షిమబుకురో, రాయ్‌ ఫ్యూచర్‌మేన్‌ వూటెన్‌, ఫిలిప్‌ లాసిస్టర్‌, జెఫ్‌ కఫిన్‌ లాంటి సుప్రసిద్ధ సంగీత కళాకారులతో ఆమె పని చేశారు. ఎపీకోరస్‌ లాంటి అనేక బ్యాండ్స్‌లో భాగస్వామిగా ఉన్నారు. ‘ప్రియదర్శిని ట్రయో’ అనే బ్యాండ్‌ను స్వయంగా ప్రారంభించారు. ‘ఉమెన్స్‌ రాగా మాసివ్‌ బ్యాండ్‌’కు ఆమె సహ నిర్వాహకురాలు. ‘‘అవుటాఫ్‌ ది వుడ్‌’ అనే మ్యూజిక్‌ ఫెస్టివల్‌ నిర్వహణలో మూడేళ్ళుగా ఆమె కీలకపాత్ర వహిస్తున్నారు. 

సామాజిక సేవలో కూడా ప్రియ దర్శిని చురుగ్గా ఉంటారు. ‘జనరక్షిత’ అనే స్వచ్ఛంద సంస్థను ఇండియాలో 2004లో ఆమె ప్రారంభించారు. దాని ద్వారా పేద క్యాన్సర్‌ రోగులకు వైద్య సహాయాన్నీ, పునరావాసాన్నీ అందిస్తున్నారు. ‘‘సమాజానికి ఏదైనా చెయ్యాలనే ఆలోచన నాకు రావడానికి కారణం మా అమ్మ. ముంబయ్‌లో మేం సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇంట్లో ఉండేవాళ్ళం. అనారోగ్యంతో ఉన్న పేదలను మా అమ్మ ఇంటికి తీసుకువస్తూ ఉండేది. వాళ్ళందరూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం ముంబయ్‌ వచ్చి, తలదాచుకోడానికి చోటు లేని వాళ్ళు. అలాంటి వారి కోసమే ‘జనరక్షిత’ను ఏర్పాటు చేశాను’’ అంటారు ప్రియ దర్శిని. ఆ సంస్థ ద్వారా మహారాష్ట్రలో రెండు పాఠశాలలను కూడా ఆమె దత్తత తీసుకున్నారు.

అలాగే అలా్ట్ర మారథాన్‌లోనూ ప్రియ దర్శిని తనదైన ముద్ర వేస్తున్నారు. హిమాలయాల్లో వంద మైళ్ళ రేసులో పాల్గొన్న మొదటి, అతి చిన్న తక్కువ వయసున్న మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అలా్ట్ర మారథాన్ల నిర్వహణ కోసం ‘ది విండ్‌ఛేంజర్స్‌’ అనే సంస్థను ఆమె ఏర్పాటు చేశారు. 


‘‘నేను ఎక్కువగా ఇష్టపడేది సంగీతాన్నే. అయితే మిగిలిన కళారూపాల్లో సంతోషాన్ని వెతుక్కోవడానికి అది నాకు అవరోధం ఎప్పుడూ కాలేదు. మదర్‌ థెరిసా జీవితం ఆధారంగా 2014లో తీసిన ‘ది లెటర్స్‌’అనే సినిమాలో... థెరిసా దగ్గిర చదువుకొని, ఆమె అడుగుజాడల్లో నడిచిన సుభాషిణీ దాస్‌ పాత్ర పోషించాను’’ అని చెబుతున్నారు ముప్ఫై ఏడేళ్ళ ప్రియదర్శిని. 

తాజాగా గ్రామీ అవార్డులకు ‘బెస్ట్‌ న్యూ ఏజ్‌ ఆల్బమ్‌’ విభాగంలో ఆమె తొలి ఆల్బమ్‌ ‘పెరిఫెరీ’ నామినేట్‌ అయింది. తొమ్మిది పాటలున్న ఈ ఆల్బమ్‌ కర్ణాటక సంగీతం, అమెరికన్‌ పాప్‌ల సమ్మేళనం.  

సంగీత ప్రపంచంలో అత్యున్నత స్థాయి విజయాలకు గుర్తింపుగా గ్రామీ అవార్డును పరిగణిస్తారు. గతంలో అయిదు సార్లు ఈ అవార్డుకు నామినేట్‌ అయిన అనౌష్కా శంకర్‌ కూడా 2021లో అందించే 63వ గ్రామీ పురస్కారాల పోటీలో ఉన్నారు.

ప్రత్యేకం మరిన్ని...