..పాటవై మిగిలావు

ABN , First Publish Date - 2022-02-07T08:16:35+05:30 IST

సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. సంగీత సరస్వతి గారాల పుత్రిక, గానకోకిల, భారతరత్న లతా మంగేష్కర్‌ (92) అస్తమించారు....

..పాటవై మిగిలావు

భారత చలనచిత్ర సంగీత మేరునగ శిఖరం కూలింది! కరోనా కాటుకు మరో సంగీత వటవృక్షం నేలకొరిగింది!! ‘ఏ మేరే వతన్‌ కే లోగో’ అంటూ జాతిలో స్ఫూర్తి నింపిన గళం మూగవోయింది!! వేయి కోయిలల మధురగానమై ఏడు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత ప్రేక్షకుల మనసున మల్లెల మాలలు పూయించిన సుస్వరగానం ఆగిపోయింది. ‘భారతరత్న.. గానకోకిల.. సంగీత మహావృక్షానికి పెనవేసుకున్న సప్త స్వరాల సుమనోహర ‘లత’.. లతా మంగేష్కర్‌ (92) ఇక లేరు. దశాబ్దాల స్వరప్రస్థానంతో అలసిపోయిన ఆ మహాగాయని.. శాశ్వతంగా సెలవంటూ వెళ్లిపోయారు. భౌతికంగా వెళ్లిపోయినా తన అజరామరమైన గానంతో మనందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచే ఉంటారు.


లతా మంగేష్కర్‌ అస్తమయం

తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో కన్నుమూత

కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. అవయవాల వైఫల్యం

28 రోజులు ఆస్పత్రిలో చికిత్స.. అయినా దక్కని ఫలితం

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు

హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. లతకు ఘనంగా నివాళి

రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

దేశ వ్యాప్తంగా జాతీయ పతాకం అవనతం

తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి.. కొవిడ్‌ నుంచి కోలుకున్నా అవయవాల వైఫల్యంతో తుదిశ్వాస


ముంబై, ఫిబ్రవరి 6: సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. సంగీత సరస్వతి గారాల పుత్రిక, గానకోకిల, భారతరత్న లతా మంగేష్కర్‌ (92) అస్తమించారు. ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జనవరి 8న కొవిడ్‌ బారినపడ్డ లతా మంగేష్కర్‌.. కొద్దిపాటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజులకు కొవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ.. న్యుమోనియా తీవ్రమవడంతో.. చికిత్స కొనసాగింది. క్రమంగా ప్రధాన అవయవాల పనితీరు మందగించింది. శనివారం ఒక్కసారిగా ఆరోగ్యం విషమించడంతో.. వైద్యులు మరోసారి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో.. ఆదివారం ఉదయం ఆమె శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. లతా మంగేష్కర్‌ కన్నుమూశారన్న విషయాన్ని ఆమె సోదరి ఉషా మంగేష్కర్‌ వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే అభిమానులు.. ఆస్పత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన గాయనిని కడసారి దర్శించుకునేందుకు గంటల తరబడి ఆస్పత్రి ముందు వేచి ఉన్నారు. 




ఇండోర్‌లో వీధికి లత పేరు కోసం

రోడ్డెక్కిన అభిమానులు

లతా మంగేష్కర్‌.. ఇండోర్‌లోని సిఖ్‌ మొహల్లా వీధిలో జన్మించారు. కానీ, వృత్తి రీత్యా ఆమె ముంబైలో స్థిరపడ్డారు. కానీ, ఆ వీధికి లతా మంగేష్కర్‌ పేరుతో నామకరణం చేయాలంటూ స్థానికుల నుంచి ఏళ్లుగా డిమాండ్‌ ఉంది. ఇప్పుడు ఆమె మరణం తర్వాత ఒక్కసారిగా ఆ డిమాండ్‌ ఊపందుకుంది. ఆదివారం ఆమె అభిమానులు వందలాదిగా రోడ్లపైకి చేరుకుని ఈ వీధికి వెంటనే ఆమె పేరు పెట్టాలని నినాదాలు చేశారు. ఆమె జన్మించిన ఇంటిని స్మారక చిహ్నంగా మార్చాలని కోరారు. ఆమె జీవించి ఉండగానే ఈ వీధికి ఆమె పేరు పెట్టుంటే బాగుండేదని, కనీసం ఇప్పటికైనా స్థానిక పాలనా యంత్రాంగం దీనిపై నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.


జాతీయ పతాకం అవనతం

లతా మంగేష్కర్‌ మృతికి కేంద్రం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలను అవనతం చేయాలని ఆదేశించింది. ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలనూ నిర్వహించవద్దని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు సెలవు ప్రకటించగా.. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం అర్ధరోజు సెలవుతో పాటు బహిరంగ ప్రదేశాలు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద 15 రోజుల పాటు లతా మంగేష్కర్‌ ఆలపించిన పాటలను ప్రసారం చేయాలని ఆదేశించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించాయి. అలాగే, లతా మంగేష్కర్‌కు ఘన నివాళి అర్పించాలని పార్లమెంటు ఉభయ సభలూ నిర్ణయించాయి. సోమవారం ఉదయం రాజ్యసభ సమావేశం కాగానే.. లతా మంగేష్కర్‌కు నివాళి అర్పించి.. గంటపాటు సభను వాయిదా వేయాలని చైర్మన్‌ వెంకయ్యనాయుడు నిర్ణయించగా.. సాయంత్రం సమావేశం కానున్న లోక్‌సభలోనూ లతకు నివాళి అర్పించి గంట పాటు సభను వాయిదా వేస్తామని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. కాగా, లతా మంగేష్కర్‌.. 1929 సెప్టెంబరు 28న ఇండోర్‌లో జన్మించారు. ఆమె తండ్రి దీననాథ్‌ మంగేష్కర్‌.. శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకున్న లత.. ఆయన బాటలోనే పయనించారు. తన ఐదో ఏటనే తండ్రి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. తన 13వ ఏటనే గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. అదే ఏట సినీ నటిగానూ మారారు. తొలిపాటను మరాఠీ సినిమా కోసం ఆలపించిన ఆమె.. అనంతరం 36 భాషల్లో వేలాది పాటలతో కోట్లాది సంగీత ప్రియులకు వీనుల విందును అందించారు.



ముగిసిన అంత్యక్రియలు

లతా మంగేష్కర్‌ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో జరిగిన గాన కోకిల తుది వీడ్కోలుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆమె పార్థివదేహాన్ని దర్శించి, పుష్పగుచ్ఛం ఉంచి, నమస్కరించారు. అంత్యక్రియల ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, షారూఖ్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై.. లతా మంగేష్కర్‌కు నివాళి అర్పించారు. అనంతరం.. ఆమె పార్థివదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని తొలగించి.. కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత లత సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌.. చితికి నిప్పంటించి.. సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకుముందు.. పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య లతా మంగేష్కర్‌ భౌతికకాయాన్ని.. అభిమానుల సందర్శనార్ధం ఆస్పత్రి నుంచి ఆమె ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నుంచి ఆమె ఇంటికి వెళ్లే దారి మొత్తం అభిమానులతో కిక్కిరిపోయింది. అనంతరం లతా మంగేష్కర్‌ నివాసానికి చేరుకున్న సైనికాధికారులు.. ఆమె పార్థివదేహంపై జాతీయ పతాకాన్ని కప్పి సైనిక వందనం సమర్పించారు. సైనిక బ్యాండ్‌ ద్వారా జాతీయగీతాన్ని ఆలపించారు. కాగా.. లతను కడసారి చూసేందుకు సంగీత ప్రియులు వేలాదిగా ఆమె నివాసానికి తరలి వచ్చారు. ఆమె భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ‘లతాజీ.. అమర్‌రహే’ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. అనంతరం.. ఆమె అంతిమయాత్ర మొదలయింది. లతా పాటలు పాడుతూ.. అశ్రునయనాలతో అభిమానులు వెంట నడువగా.. శివాజీ పార్క్‌కు చేరుకుంది. 





Updated Date - 2022-02-07T08:16:35+05:30 IST