కెరీర్‌ ఉజ్జ్వల దశలో.. విష ప్రయోగం!

ABN , First Publish Date - 2022-02-07T08:24:28+05:30 IST

అది 1962 సంవత్సరం. బాలీవుడ్‌లో గాయనిగా లతా మంగేష్కర్‌ పేరు మార్మోగుతున్న కాలం. అలాంటి సమయంలో ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.....

కెరీర్‌ ఉజ్జ్వల దశలో..  విష ప్రయోగం!

అది 1962 సంవత్సరం. బాలీవుడ్‌లో గాయనిగా లతా మంగేష్కర్‌ పేరు మార్మోగుతున్న కాలం. అలాంటి సమయంలో ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మూడు నెలల పాటు మంచానికే పరిమితమయ్యారు. దీనంతటికీ.. ఆమెకు అందించే ఆహారంలో నిదానంగా విష ప్రయోగం (స్లో పాయిజన్‌) జరగడమే కారణమని వైద్యుల పరిశీలనలో తేలింది. దీంతో లతాజీ ఇంట్లో పని చేసే వ్యక్తి చెప్పాపెట్టకుండా, జీతం కూడా తీసుకోకుండా పరారయ్యాడు. అతడిని తమవద్ద పనికి కుదిర్చి ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసినట్లు లతాజీ.. లండన్‌ చెందిన రచయిత నజ్రీన్‌ మున్నీ కబీర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, అది ఎవరనేది తెలియలేదని పేర్కొన్నారు. ఆ కష్ట కాలంలో లతా మంగేష్కర్‌కు బాలీవుడ్‌ గేయ రచయిత మజ్రూహ్‌ సుల్తాన్‌పురి గొప్ప అండగా నిలిచారు. ఆమె తీసుకునే ఆహారం,పానీయాలను ముందుగా ఆయనే తినేవారు. కవిత్వం వినిపిస్తూ.. కథలు చెబుతూ లతాజీకి ఊరట కలిగించి త్వరగా కోలుకునేలా చూశారు.


7 వేల గ్రామ్‌ఫోన్‌ రికార్డులతో మ్యూజియం

సుమధుర గాయని లతా మంగేష్కర్‌పై వీరాభిమానంతో మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన సుమన్‌ చౌరాసియా 7,600 అరుదైన గ్రామ్‌ఫోన్‌ రికార్డులతో మ్యూజియం ఏర్పాటు చేశాడు. 1965 నుంచి చౌరాసియా.. మంగేష్కర్‌ గ్రామ్‌ఫోన్‌ రికార్డులను సేకరిస్తున్నాడు. అవి మొత్తం 7 వేలు దాటాయి. వీటికోసం 1,600 చదరపు అడుగుల గదిని కేటాయించాడు. 


రీమిక్స్‌లకు వ్యతిరేకి.. కానీ,

దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ పాడిన ఎన్నో పాపులర్‌ పాటలు రీమిక్స్‌ అయ్యాయి. అంతే స్థాయిలో ఆదరణ చూరగొన్నాయి. అయితే,  రీమిక్స్‌ సంస్కృతిని లతా పూర్తిగా వ్యతిరేకించేవారు. ఇలాంటి ప్రయత్నాలను ఆపాలని నాలుగేళ్ల క్రితం బాలీవుడ్‌ను కోరారు కూడా. అయితే, పాట సహజత్వం దెబ్బతినకుండా ఉంటూ, సంబంధిత కళాకారులకు తగిన గౌరవం ఇస్తే రీమిక్స్‌ల పట్ల అభ్యంతరమేమీ లేదనేవారు. 


చివరిగా రికార్డు చేసిన పాట గాయత్రీ మంత్రం

లతా మంగేష్కర్‌ సుమధుర గానం చివరిసారిగా వినిపించినది.. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కుమార్తె వివాహం సందర్భంగా. 2018 చివర్లో ఆనంద్‌ పిరమల్‌తో ముఖేశ్‌ కూతురు ఈషాఅంబానీ వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి అభినందనలు తెలుపుతూ గాయత్రీ మంత్రం రికార్డు చేసి పంపారు లతా. ఈషా పెళ్లిలో దీనిని ప్రత్యేకంగా ప్లే చేశారు. లతాజీ.. సింగిల్‌ టేక్‌లో గాయత్రీ మంత్రాన్ని ఆలపించారని చెబుతారు.


‘‘ఒక్క రోజే’’ బడికెళ్లి.. కోపంతో ఇంటికొచ్చేసి

ప్రశాంతమూర్తిలా కనిపించే లతాజీకీ ఓసారి కోపమొచ్చింది. అది కూడా ఒక్క రోజే బడికి వెళ్లి.. మళ్లీ పాఠశాల ముఖం చూడనంతగా. సాంగ్లీలో లతా వాళ్ల ఇంటి ముందే మరాఠీ పాఠశాల ఉండేది. అందులో చదివే సమీప బంధువు వాసంతితో పాటు లత కూడా వెళ్లేవారు. అలా ఆమె కూడా పాఠశాలలో చేరారు. అయితే, మొదటి రోజే చెల్లెలు, మరో ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే (అప్పటికి పది నెలల వయసు)ను తీసుకుని వెళ్లి, ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠం వినసాగారు. ఉపాధ్యాయిని అభ్యంతరం చెప్పడంతో లతాకు ఆగ్రహంగా బయటకొచ్చేశారు. ఇంట్లో పనిచేసే విఠల్‌ను అడిగి మరాఠీ అక్షరమాల, ప్రాథమికంగా చదవడం, రాయడం ఎలాగో తెలుసుకున్నారు. సమీప బంధువు ఇందిరా, లేఖరాజ్‌ శర్మ అనే వ్యక్తి ద్వారా హిందీ నేర్చుకున్నారు. ఏ భాష పాట అయినా.. హిందీలోనే రాసుకునేవారు.


ఐదేళ్ల వయసులో.. సావర్కర్‌ విందులో

అది 1935.. అండమాన్‌ జైలు నుంచి విడుదలయ్యారు స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. నిమ్నవర్గాల పిల్లలను పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాజిక సమానత్వం కోసం దళితవాడల్లో అన్ని కులాల వారు కలిసి భోజనం చేసేలా రాత్రి విందులు నిర్వహించేవారు. అలాంటి విందుకు తండ్రితో కలిసి హాజరయ్యారు లతాజీ. అప్పటికి ఆమెకు ఐదేళ్లే. బహుశా ఆ విందులో ఆమెనే చిన్న వయసు వ్యక్తి. వాస్తవానికి నాడు ఉన్న కట్టుబాట్లతో లతాను పంపేందుకు తల్లి అంగీకరించలేదు. కానీ, ‘‘సావర్కర్‌ చేస్తున్నదేమిటో, అది ఎందుకు అవసరమో పిల్లలకు తెలియాలి’’ అంటూ తండ్రి దీనానాథ్‌.. కూతురును తీసుకుని వెళ్లారు. సావర్కర్‌ను కుటుంబ సభ్యుడిలా భావించేవారమని లతా ఓసారి వెల్లడించారు. చిత్రమేమంటే.. ఛత్రపతి శివాజీపై సావర్కర్‌ రాసిన పాటలను ఆమె ఆలపించారు.


నేనేమీ అసాధారణం కాదు.. అంతా దైవ కృప

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సామెతకు నిలువెత్తు ప్రతిరూపం లతా మంగేష్కర్‌. ఆమె గానం ఎంత మధురమో.. వ్యక్తిత్వమూ అంతే గొప్పది. గాయనిగా ఎవరూ చేరుకోలేని శిఖరాలను అధిరోహించిన లతాజీ.. ఇదంతా దైవ కృపేనని అనేవారు. తానేమీ అసాధారణ వ్యక్తిని కాదని, తనకంటే గొప్పగా పాడగలిగేవారు చాలామంది ఉంటారని, కానీ వారికి తనలా అవకాశాలు వచ్చి ఉండకపోవచ్చని చెప్పేవారు. ఎవరికైనా సరే గెలుపు తలకెక్కకూడదనేది లతా సిద్ధాంతం.


ఇవీ లతాజీకి నచ్చిన లతాజీ 10 పాటలు

లతా మంగేష్కర్‌ పాడిన ప్రతి పాటా సుమధురమే. అలాంటివాటిలో ఆమెకు నచ్చిన ఓ పది పాటలేవని ఇండియా టుడే 1981లో చేసిన ఇంటర్య్వూలో ప్రశ్నించింది. ఇంతకీ లతాజీకి ఇష్టమైన లతాజీ పాటలు.. అవి ఏ సినిమాలోనివి అంటే.. 1) ఆయేగా ఆనేవాలా (మహల్‌- 1949), 2) ఏ జిందగీ ఉసీ కీ హై (అనార్కలీ-1953), 3) ఆజా రే పరదేశీ (మధుమతి-1958), 4) ఏ దిల్‌రుబా (రుస్తుం సొహ్రబ్‌-1963), 5) కహిన్‌ దిప్‌ జలే కహీ దిల్‌ (బీస్‌ సాల్‌ బాద్‌ -1962), 6) లగ్‌ జా గలే, 7) నైనా బర్సే (వో కౌన్‌ థీ-1964), 8) వో చుప్‌ రహే తో మేరే (జహాన్‌ అరా-1964), 9) తుమ్‌ న జానె కిస్‌ జహాన్‌ మేన్‌ ఖో గయే (సాజా-1951), 10) జీవన్‌ దోర్‌ తమ్హి సంగ్‌ బంధి (సతీ సావిత్రి-1964).


తెల్ల చీరలంటే అమితమైన మక్కువ

చేతితో నేసిన తెల్ల చీరలంటే లతాజీకి అమితమైన మక్కువ. ఆమె ఎప్పుడూ తెల్లచీర ధరించి, చీరకొంగును భుజాలపై కప్పుకొని, నుదుటిపై బొట్టుతో కనిపించేవారు. స్టేజీపై పాడేటప్పుడూ తెల్ల చీరలోనే కనిపించేవారు. లతాజీ బీరువా నిండా చేతితో నేసిన ధవళ వర్ణపు చీరలే. లతాజీ గాయని గానే కాకుండా నిర్మాతగా కూడా పనిచేశారు. నిర్మాతగా ఆమె కొన్ని సినిమాలు తీశారు. 1953లో వాడాల్‌ (మరాఠీ), ఝాంఝర్‌ (హిందీ), 1955లో కాంచన్‌ గంగా (హిందీ), 1990లో లేకిన్‌ సినిమాలు తీశారు.


గొంతు మూగబోతే.. 

ఏం చెప్పగలం..?

లతా మంగేష్కర్‌ మృతి పట్ల వ్యాపార ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ‘మీ గొంతు మూగబోయినప్పుడు మీరే చెప్పగలరు..?’ అని ట్వీట్‌ చేశారు. అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, ఐవోసీ చైర్మన్‌ ఎస్‌.ఎం.వైద్య, అపోలో హాస్పిటల్స్‌ జేఎండీ సంగీతారెడ్డి, ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ చైర్మన్‌ సంజీవ్‌ గోయెంకా తదితర ప్రముఖ పారిశ్రామికవేత్తలు లత మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు సంగీత పరిశ్రమ వర్గాలూ తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. లతాజీ లాంటి గాయని మళ్లీ పుట్టబోరని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని తెలిపాయి. టి సిరీస్‌, టిప్స్‌ ఫిల్మ్స్‌ అండ్‌ మ్యూజిక్‌, సోనీ మ్యూజిక్‌ ఇండియా తదితర సంస్థల ప్రతినిధులు లతకు ఘనంగా నివాళులు అర్పించారు.


ఆ గాత్రం ఎప్పటికీ 

బతికే ఉంటుంది..

భారతరత్న లతా మంగేష్కర్‌ మృతి పట్ల పలు దేశాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. సుమధురమైన ఆమె గాత్రం ఎప్పటికీ బతికే ఉంటుందని పేర్కొన్నాయి. లత భారత నైటింగేల్‌ అని, ఆమె మెలోడీకి మహారాణి అని పాకిస్థాన్‌ రాజకీయ నాయకులు, కళాకారులు, క్రికెటర్లు పేర్కొన్నారు. సంగీత ప్రపంచానికి చీకటి రోజన్నారు. ఉపఖండం ఒక గొప్ప గాయనిని కోల్పోయిందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ గాయనీమణిని కోల్పోయామని ట్వీట్‌ చేశారు. ఉర్దూ మాట్లాడే, అర్థం చేసుకునే ప్రజలంతా లతాజీకి ఘనంగా వీడ్కోలు పలుకుతారని ఇమ్రాన్‌ బృందంలోని చౌధరి ట్వీట్‌ చేశా రు. సంగీత సామ్రాజ్యానికి మహారాణి అయిన లత మృతి అత్యంత బాధాకరమని బంగ్లాదేశ్‌ ప్రధాని హసీనా పేర్కొన్నారు. యూఏఈ, శ్రీలంక, నేపాల్‌, తదితర దేశాధినేతలు కూడా లత మృతి భారత్‌కు తీరని లోటని పేర్కొంటూ.. ఆమె కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ఢిల్లీలోని వివిధ దేశాల రాయబారులు, దౌత్యాధికారులు కూడా లత మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

 

నారదుడిగా.. కృష్ణుడిగా..

గాయనిగా హిందీ చిత్రసీమను ఏలడానికి ముందే.. లతా మంగేష్కర్‌ నటిగా తెరంగేట్రం చేశారు. తన తండ్రి రూపొందించిన మరాఠీ సంగీత నాటకాల్లో చిన్నప్పటి నుంచే నటించారామె. ‘బల్వంత్‌ సంగీత్‌ మండలి’ పేరుతో దీనానాథ్‌ మంగేష్కర్‌ ప్రదర్శించే ‘సౌభద్ర’ నాటకంలో ఆయన అర్జునుడి పాత్ర పోషిస్తే.. తొమ్మిదేళ్ల లత నారదుడి వేషంలో అలరించేది. అలాగే కృష్ణుడిగా కూడా నటించేది. 1942లో తండ్రి మరణించడంతో.. మంగేష్కర్‌ కుటుంబానికి స్నేహితుడు, ఫిలిం డైరెక్టర్‌ అయిన వినాయక్‌ దామోదర్‌ కర్ణాటకి.. లతకు అండగా నిలిచారు. ‘పహిలీ మంగళాగౌర’ అనే చిత్రంలో ఆమెకు చిన్న పాత్ర ఇచ్చారు. ‘నటాలీ చైత్రాచీ నవలాయీ’ అనే పాట పాడించారు. అంతకుముందే ఆమె వసంత్‌ జోగ్లేకర్‌ మరాఠీ చిత్రం ‘కిటీ హాసల్‌’లో ‘నాచు యా..’ అనే మరాఠీ పాట పాడారు. ఆ పాటను చిత్రంలో వాడలేదు. 1945లో ఆమె ముంబైకి చేరుకుని సంగీత పాఠాలు నేర్చుకున్నారు. అదే ఏడాది.. వినాయక్‌ తొలి హిందీ సినిమా ‘బడీ మా’లో ఆశా భోంస్లేతో కలిసి ఒక చిన్న పాత్ర పోషించారు. ఆ చిత్రంలో ఆమె ‘మాతా తేరే చరణోమే’ అనే భజన కూడా పాడారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో హీరోయిన్‌ చెల్లెలు, హీరో చెల్లెలు వంటి చిన్నచిన్న పాత్రలు పోషించేవారు. అయితే, నటన ఆమెకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ‘‘నేను నటిగా నా కెరీర్‌ మొదలుపెట్టా. కానీ, నాకు అది ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. మేకప్‌ వేసుకోవడం, కెమెరా ముందు నవ్వడం, ఏడవడం ఇష్టం ఉండేది కాదు. పాటలు పాడడమే ఇష్టంగా ఉండేది’’ అని లత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1947లో వినాయక్‌ చనిపోవడంతో ఆయన ‘ప్రఫుల్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌ మూత పడింది. ఆ తర్వాత ఆమె గాయనిగా అవకాశాల కోసమే ఎక్కువగా ప్రయత్నించేవారు. అలా 1948లో మజ్బూర్‌ సినిమాలో ‘దిల్‌ మేరా తోడా’ పాటతో ఆమెకు తొలి బ్రేక్‌ వచ్చింది. ఆ తర్వాత 1949లో వచ్చిన మహల్‌ సినిమాలో ‘ఆయేగా ఆనేవాలా’ పాటలో లత గొంతు విన్నవారంతా.. ఎవరీమె అని ఆరాతీయడం ప్రారంభమైంది. ఆ తర్వాత అంతా చరిత్రే.

 


‘‘ఈ సుదీర్ఘ ప్రయాణం అంతా నాకు గుర్తుంది. ఆనాటి చిన్నారి లత ఇంకా నాలో అలాగే ఉంది. ఆమె ఎక్కడికీ పోలేదు. కొంతమంది నన్ను సరస్వతిగా భావిస్తారు. కొందరు ఆ తల్లి ఆశీస్సులు నాకు ఉన్నాయని అంటుంటారు. ఇలా ఎన్నెన్నో చెబుతుంటారు. కానీ.. ఇదంతా నేను ఏది పాడినా వింటున్న ప్రజల ఆశీర్వాదమే. వారే లేకుంటే నేనెవరిని? అయామ్‌ నథింగ్‌’’

-లతా మంగేష్కర్‌


తరాలు మారినా.. మారని మధుర స్వరం

నేపథ్య గాయకుల్లో మన ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ఒక ఘనత ఉంది. సుశీల, జానకి, చిత్ర, తర్వాతి తరాల్లో సునీత, కౌసల్య, ఉష.. ఇలా తన సహగాయకులు ఎందరు మారినా పలు తరాలను ఎస్పీబీ తన గాన మాధుర్యంలో ఓలలాడించారు. హిందీలో ఆ ఘనత లతదే. కిశోర్‌కుమార్‌, మహ్మద్‌ రఫీ, ముకేశ్‌కుమార్‌, తలత్‌, మన్నాడే, హేమంత్‌కుమార్‌, దుర్రానీ, మహేంద్ర కపూర్‌, శైలేంద్రసింగ్‌, షబ్బీర్‌ కుమార్‌, నితిన్‌ ముకేశ్‌, మన్హర్‌ ఉధాస్‌, అమిత్‌ కుమార్‌(కిశోర్‌ కుమార్‌ కొడుకు), ఎస్పీబీ, హరిహరన్‌, పంకజ్‌ ఉధాస్‌ (మన్హర్‌ ఉధాస్‌ సోదరుడు), అభిజీత్‌, ఉదిత్‌ నారాయణ్‌, కుమార్‌ సాను.. ఇలా ఎందరో గాయకులు వచ్చారు, వెళ్లారు. కానీ అటువైపు  మాత్రం.. లత ఒక్కరే ఏడు దశాబ్దాలపాటు ఉజ్వల తారగా వెలిగారు.

Updated Date - 2022-02-07T08:24:28+05:30 IST