Abn logo
Feb 25 2020 @ 05:44AM

కనకవ్వ... పాటల గంప ఎత్తుకున్నది!

రేషన్‌కార్డు బియ్యం తెచ్చుకునే కాడ వేలిముద్ర వేసుడు తప్ప అక్షరం తెలువని ఆమె ఇప్పుడు ‘ఫేమస్‌ ఫోక్‌ సింగర్‌’గా దృశ్యమాధ్యమాలకు ఎక్కింది. సమ్మక్క - సారలమ్మ పాట అయినా... సంక్రాంతి గీతమైనా... ఇప్పుడు ఆమెనే పాడాలే... హిట్టు కావాలే. నిన్నటిదాక నెత్తిమీద పండ్ల గంప ఎత్తుకొని మారుబేరం చేసుకునే గొట్టె కనకవ్వ (63) ఇప్పుడు కాల్‌ షీట్లు ఇచ్చే స్థాయికి ఎదిగింది. ‘మైకు ముందర పాడితే నా పాటకే స్టూడియోళ్లు మ్యూజిక్కులు కొడుతండ్రు, పాటైనంక చప్పట్లు కొడుతున్నరు...’ అంటున్న ఈ పల్లె కోయిలమ్మ  ‘నవ్య’తో ముచ్చటించింది. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే...


‘‘చిన్ననాడు నేడు చిక్కుడు పెడితే... చిక్కుడు పెడితే... 

గోరుచిక్కుడై గోలలెత్తి కాసు... గోరు చిక్కుడై...

వయసు నాడు నేను ఆనిగంబు(సొరకాయ) పెడితే... ఆనిగంబు పెడితే...

ఆనిగంబు తీగంతా అల్లిబిల్లాయే... 

ఆడోళ్ల కనతల్లి నీళ్లాకు ఎలితే... ఆడోళ్ల కనతల్లి

అమాస చీకటి ఆబాయి మీద... అమాస చీకాటీ...

మొగొళ్ల కనతల్లి నీళ్లాకు ఎలితే... మొగొళ్ల కనతల్లి 

కోరెవెన్నెల కాసు... కోనేరు మీదా... కోరెవెన్నెల కాసు...’’ 

మా అవ్వ నోట ఇన్న పాట ఇది... ఇప్పుడు పాడుతుంటే అందరికీ నచ్చుతోంది. 


అవ్వే పాటల తోవ సూపింది...

మాది సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం బొడిగెపల్లె. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇందిరానగర్‌లో నివాసముంటున్నం. ఐదుగురు అక్కాచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములున్న ఉమ్మడి కుటుంబంలో పుట్టిన. అందరం గోదావరిఖనిలోనే స్థిరపడ్డం. నాతోటి చెల్లెళ్లు ప్రమీల, స్వరూప సింగరేణి నర్సరీలో పని చేస్తరు. మా అవ్వ పేరు జంగంపల్లి రాజవ్వ. వ్యవసాయం చేస్తూ వ్యవసాయ కూలీగా బతికేది. ఆ ప్రాంతానికి కరువు వస్తే కప్పతల్లి ఆటకంటే ముందు మా అవ్వతో పాట పాడించేవారట. మా అవ్వ రాజవ్వ ఐదు రోజుల పాటు ఆగకుండా పాట పాడేదట. ఆమె పాట పాడితే వాన తప్పకుండా పడేదట. ఆ పాట వారసత్వం నాకు అబ్బింది. 40ఏళ్ల క్రితం గోదావరిఖనికి వచ్చినప్పుడు వరంగల్‌, హైదరాబాద్‌ల్లో కూడా నేను, నా పెనిమిటి (భర్త) కలిసి కూలీనాలి చేసుకున్నం. ఊళ్లె వ్యవసాయ కూలీలుగా పని చేస్తాం. పట్టణాల్లో హమాలీ పని, రైతు మార్కెట్‌లలో చేసినం. గోదావరిఖని వచ్చిన తరువాత ఏ కాలం పండ్లు వస్తే ఆ కాలంలో అమ్ముకున్నాం. పంటలు సరిగ్గా లేక పెద్ద కొడుకు, పని దొరకక చిన్న కొడుకు ఇప్పటికీ తిప్పల పడుతుండ్రు. కష్టం వచ్చినా, ఆకలి అయినా, దూప అయినా మాకు పాటే దిక్కు. 


మనవరాలు పంపిన పాటతో...

నాలుగు నెలల క్రితం ఏదో టీవీల ఫోక్‌ సింగర్స్‌ ఉంటే ఒక్క నిమిషం పాట పాడి సెల్‌ఫోన్‌లో పంపుమని చెప్పంగా మా మనుమరాలు ఇన్నది. నిద్రలకెళ్లి లేపి మా ముగ్గురు అక్కాచెల్లెళ్లతోని పాడిచ్చి పంపింది. ఆ టీవీ వోళ్లు ఫోన్‌ చేసి కనకవ్వది ఒక పాట రికార్డు చేసి మళ్లీ పంపమని చెప్పిండ్రు. నేను పాడి పంపిన. హైదరాబాద్‌కు రమ్మన్నరు. ఆడికి పోయినంక అదో ప్రపంచం. అన్నీ నేర్సినోళ్లు అక్కడ ఉన్నరు. భయమైంది. కానీ నా పాట ఇన్నంక చప్పట్లు కొట్టిండ్రు. కొన్నిచోట్ల ఎట్ల పాడాల్నో వాళ్లు చెప్పిండ్లు. వాళ్ల పాటలు నాకు నేర్పిండ్రు. ఒకటి రెండుసార్లు ఇనంగానే నేను పాడిన. వాళ్లకు నచ్చింది. ఇగ అక్కడి నుంచి నాకు రికాం లేదు. టీవీలోళ్లు, పేపర్లోళ్లు, పాటలోళ్లు... ఇలా అందరూ నా చుట్టే తిరుగుతండ్రు. ఒక సినిమాల పాడమని అడుగుతండ్రు. ఇప్పుడు ఒక్కటేదమ్ము షూటింగ్‌లు, రికార్డింగులు, సెల్ఫీలు దిగుడు అంతా గమ్మత్‌ అయితంది. నన్ను చూసి ‘సింగర్‌ కనకవ్వవు కదా’ అంటండ్రు. సెలబ్రెటినంటండ్రు... 


అన్ని పాటలు పాడుతా...

రెండుమూడేళ్లుగా మా అక్కాచెల్లెళ్ల పాటలు, మా అమ్మ చెప్పిన పాటలు జనాల్లోకి పోవాలని ఆలోచిస్తన్నం. అమ్మపాట, పల్లెపాట రికార్డు కావాలన్నది మా తపన. కోలాటం, బతుకమ్మ, ఉయ్యలపాట, బాగోతం పాటలు, బోనాల పాటలు, ఇది గది అని కాదు... అన్నీ పాడుతం. పొలంలో ఉంటే తప్ప పాట రాదు. కానీ లోకం తీరును బట్టి ఈ మధ్య అన్నీ రకాల పాటలు నేర్చుకుంటున్నం. సినిమా పాటలు కూడా ఇంటికాడ పాడుతం. పొలం నెర్రెవారితే కండ్లళ్ల నీళ్లు తిరిగి పాట అదే తన్నుకచ్చేది. నా పాట ప్రజలు ఇనాలే, నన్ను మెచ్చుకోవాలే. సచ్చేదాక పాడుతా... ఏ పాట నేర్పినా ఆ పాట పాడుతా...

మా అమ్మపాడే పాటలళ్ల ఆడపిల్లల కష్టాలు, కన్నీళ్లు ఉండేవి. మాకు చిన్నప్పుడు తెలువకపోవు, కానీ ఆడోళ్లు కష్టాలళ్ల కుంగిపోవద్దు, వంగిపోవద్దు. ఇంట్ల బాధలనే ఆమె పాటలు పాడుకునేది. పాట రాసింది తెలువదు, కైగట్టింది ఎవరో తెలువదు, రాగం అల్లింది ఎవరో తెలువదు.అమ్మపాడితే నేనూ పాడేదాన్ని. చిన్నప్పుడు గౌరెళ్లి, గోవర్ధనగిరి, హుస్నాబాద్‌లళ్ల బాగోతం ఆడుదురు. కచ్చరాలు కట్టుకుని పోదుము. ఇంటికి వచ్చే సరికి తెల్లారేది. రాత్రి ఇన్నయి తెల్లారి పాడేది అమ్మ. కాలం గాకపోతే మా అమ్మతో పాటపాడిస్తే వాన పడేదట. తొమ్మిది రోజులు బతుకమ్మ పాటలు పాడుకునేవాళ్లం. ఇప్పుడంటే డీజేలు వచ్చినయి. 

నన్ను చిన్నప్పుడు బళ్లె వేస్తే చింతల కింద ఆటలాడేదాన్ని. ఆవుల కావలి పోయేదాన్ని. అచ్చరం నేర్వలేదు. పదేళ్లకే పెళ్లి అయ్యింది, మేనరికం, 16 ఏళ్లకే పెద్దబిడ్డ పుట్టింది. చిన్నప్పుడు పెళ్లి కావడంతో పెనిమిటి నేను దోస్తుల లెక్క తిరిగేటోళ్లం. మునుపటి కాలమే మంచిగుండే. అవ్వఅయ్యా చెప్పినొళ్లనే చేసుకున్నం. ఇప్పుడు ఆడోళ్లను చంపుతండ్రు, గొంతులు పిసుకుతుండ్రు. ఆడోళ్లు గుండె ధైర్యంగా ఉండాలే. మన దారిలో మనం నడవాలే.’’


-వంశీ, గోదావరిఖని 

Advertisement
Advertisement
Advertisement