సింగరేణి సమ్మె విజయవంతం

ABN , First Publish Date - 2020-07-04T10:30:45+05:30 IST

సింగరేణిలో రెండో రోజు శుక్రవారం సమ్మె విజయవంతమైంది. 80 శాతం కార్మికులు గైర్హాజరయ్యారు

సింగరేణి సమ్మె విజయవంతం

రెండో రోజు 80 శాతం కార్మికుల గైర్హాజరు 

అరెస్టులు, ధర్నాలతో అట్టుడికిన నల్లనేల....

టీబీజీకేఎస్‌ కార్మికులు విధులకు హాజరు... 

ఉత్పత్తికి విఘాతం యథాతథం... 


మంచిర్యాల, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : సింగరేణిలో రెండో రోజు శుక్రవారం సమ్మె విజయవంతమైంది. 80 శాతం కార్మికులు గైర్హాజరయ్యారు. కార్మిక సంఘాల నాయకుల అరెస్టులు, ధర్నాలు, బైఠాయింపులతో నల్లనేల అట్టుడికింది. బొగ్గుబ్లాక్‌లను వేలం వేసి ప్రైవేటుపరం చేయడానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె రెండో  రోజు శుక్రవారం సింగరేణిలో ఉద్రిక్తంగా మారింది.  టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ కార్మికులు శుక్రవారం విధుల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ 80 శాతం కార్మికులు విధులను బహిష్కరించారు. గురువారం మాదిరే ఉత్పత్తికి విఘాతం కలిగింది. జాతీయ కార్మిక సంఘాల, విప్లవ కార్మిక సంఘాల నాయకుల అరెస్టును కార్మికవర్గం తీవ్రంగా ఖండించింది.


సింగరేణిలో జాతీయ స్థాయి డిమాండ్‌లపై జరిగిన సమ్మెలో ఇలాంటి పరిణా మాలు ఎన్నడూ చోటు చేసుకోలేదని సీనియర్‌ కార్మికు లు పేర్కొన్నారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌ నాయకులను శ్రీరాంపూర్‌ వద్ద  అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వాగ్వాదం, ధర్నాలు జరిగాయి. బలవంతం గా పోలీసులు వాహనాలలో ఎక్కించి నాయకులను లాక్కెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


సమ్మె విచ్ఛిన్నకారులుగా మారిన టీబీజీకేఎస్‌ నాయకులు...  

మొదటి రోజు సమ్మెలో పాల్గొన్నట్లు నాటకాలాడిన టీబీజీకేఎస్‌ నాయకులు శుక్రవారం విధులకు హాజరై  అరెస్టులు చేయించి సమ్మె విచ్ఛిన్నకారులుగా మారారని ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ బి.జనక్‌ఫ్రసాద్‌ పేర్కొ న్నారు. ఈ విధానాలు సరియైునవి కావని బీఎంఎస్‌  అధ్యక్షుడు  కెంగర్ల మల్లయ్య, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌, సీఐటీయూ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్‌లు పేర్కొన్నారు.  ఏఐటీ యూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 16 సంఘాలు మద్దతునిచ్చి 72 గంటల సమ్మెలో పాల్గొంటుండగా టీబీజీకేఎస్‌ యూనియన్‌ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం గనులలోకి దిగి సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడ్డారన్నారు.


ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పిన కల్వకుంట్ల కవిత, వారి నాయకులు, కార్యకర్తలు సమ్మె విచ్ఛిన్నం చేయడం కనబడటం లేదా అని ప్రశ్నించారు. యూనియ న్‌ నాయకులను, కార్యకర్తలను పోలీసులతో అరెస్టు చేయించడం, ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం అవుతుందా అని కవితను ప్రశ్నించారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడి శా, వెస్ట్‌బెంగాల్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖలు రాస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎందుకు నోరు  మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీబీజీకేఎస్‌ నాయకులు చౌకబారు రాజకీయాలను మాని సమ్మెకు మద్దతివ్వాలని సీతారామయ్య  కోరారు. రామగుండం లోని సెంటినరీ కాలనీలో, ఇతర ఏరియాలలో జాతీయ సంఘాల, విప్లవ కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 


24 శాతం విధులకు హాజరు...

సింగరేణిలో 24 శాతం మంది కార్మికులు విధులకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. సింగరేణిలోని 45 బొగ్గుబావుల్లో 28 డిపార్ట్‌మెంట్లలో 80 శాతం కార్మికులు విధులను బహిష్కరించారు. ఉత్పత్తి కేవలం 20 శాతం మాత్రమే జరిగింది. మూడో రోజు శనివారం కూడా కార్మికులు సమ్మెలో పాల్గొనాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు జనక్‌ప్రసాద్‌, రియాజ్‌ అహ్మద్‌, కెంగర్ల మల్లయ్య, రాజిరెడ్డి తదితరులు పిలుపునిచ్చారు. 


కోల్‌ ఇండియాలో సమ్మె విజయవంతం...

కోల్‌ ఇండియాలోని అన్ని సబ్సిడరీలలోనూ శుక్రవారం సమ్మె విజయవంతమైనట్లు జాతీయ కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఈసీఎల్‌ (ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌)లో మహిళ కార్మికులు విధులకు హాజరుకావడానికి వచ్చిన కొందరు కార్మికులకు గాజులతో స్వాగతం చెప్పడంతో వారు సిగ్గుతో వెనుదిరి గారని, అందుకు సంబంధించిన ఒక ఫొటోను విడుదల చేశారు. డబ్ల్యూసీఎల్‌లోనూ సమ్మె 100 శాతం విజయ వంతమైనట్లు వారు పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-04T10:30:45+05:30 IST