బదిలీ వర్కర్లకు తీపి కబురు

ABN , First Publish Date - 2022-08-17T03:53:09+05:30 IST

సింగరేణిలో ప్రస్తుతం బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న కార్మికులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. నియమ నిబంధనల మేరకు అర్హత ఉన్న కార్మికులకు త్వరలో జనరల్‌ మజ్దూర్లుగా పదోన్నతి కల్పించేందుకు సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు ప్రారంభించింది. బదిలీ వర్కర్లను పర్మనెంట్‌ చేసేందుకు అవసరమైన ఉత్తర్వులు ఇస్తామని ఈ నెల 11న యాజమాన్యం నుంచి అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లకు సూచనలు అందాయి.

బదిలీ వర్కర్లకు తీపి కబురు

జనరల్‌ మజ్దూర్లుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు సుముఖం 

త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్న సింగరేణి  

మంచిర్యాల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో ప్రస్తుతం బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న కార్మికులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. నియమ నిబంధనల  మేరకు అర్హత ఉన్న కార్మికులకు త్వరలో జనరల్‌ మజ్దూర్లుగా పదోన్నతి కల్పించేందుకు సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు ప్రారంభించింది. బదిలీ వర్కర్లను పర్మనెంట్‌ చేసేందుకు అవసరమైన ఉత్తర్వులు ఇస్తామని ఈ నెల 11న యాజమాన్యం నుంచి అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లకు సూచనలు అందాయి. ఆయా గనుల సంక్షేమాధికారులు అర్హుల వివ రాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నాలుగైదు రోజుల్లో జాబితాలు సిద్ధం చేసి జీఎం కార్యాలయాల్లో అందజేయనున్నారు.

 చేకూరనున్న లబ్ధి

సింగరేణి యాజమాన్యం బదిలీ వర్కర్లను జనరల్‌ మజ్దూర్‌లుగా పదో న్నతి కల్పించేందుకు నిర్ణయించడంతో సంస్థ పరిధిలో వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో పలువురికి మేలు జరగనుంది. జిల్లాలోని మూడు ఏరియాల్లో శ్రీరాంపూర్‌ ప్రాముఖ్యం కలిగి ఉంది. సింగరేణి వ్యాప్తంగా పోలిస్తే అత్యధికంగా దాదాపు 10 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. బెల్లంపల్లి ఏరియాలో దాదాపు 200 మంది అర్హత గల కార్మికులుండగా మందమర్రి ఏరియాలో 3 వేల వరకు పదోన్నతి లభించే జాబితాలో ఉన్నట్లు తెలు స్తోంది. ప్రతి ఏడాది డిసెంబర్‌ 31 వరకు మూడు ఏరియాల్లో కలిపి సుమారు 2300 మంది కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొం దారు. వీరంతా యువ కార్మికులు కావడం, బదిలీ పిల్లర్‌లుగా ఉద్యోగాల్లో చేరడంతో సంస్థ నిర్ణయం మేరకు వీరిలో అర్హత గల వారికి పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి.  

ఎవరు అర్హులు...?

సింగరేణి యాజమాన్యం నిబంధనల ప్రకారం 31-12-2021 వరకు ఉద్యోగం పొంది ఏదైనా ఒక యేడాదిలో అండర్‌ గ్రౌండ్‌లో 190 మస్టర్లు, 240 సర్ఫేస్‌ మస్టర్లు పూర్తి చేసుకున్న వారికి జనరల్‌ మజ్దూర్‌ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నెల 20వ తేదీ లోగా అర్హుల పేర్లతో జాబితాను కార్పొరేట్‌ కార్యాలయానికి అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఉద్యోగంలో చేరిన చాలా మంది యువ కార్మికులకు పూర్తి స్థాయిలో మస్టర్లు నిండలేదు. యువ కార్మికుల్లో అనేక మంది ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల కఠినమైన పనులు చేయ డంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పైగా సింగరేణి గనుల్లో భిన్నమైన వాతావరణంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. యువ కార్మికులకు ఈ పనులు కొంత ఇబ్బందిగా మారగా రెగ్యులర్‌గా డ్యూటీకి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. యువ కార్మికులు  తమకు సర్ఫేస్‌ పనులు కావాలని అధికారులను కోరుతున్నారు. సర్ఫేస్‌పై విధుల్లో కుదిరేందుకు యువ కార్మికులు యూనియన్‌ నాయకులతో పైరవీలు చేయిస్తున్నారు. 

కౌన్సెలింగ్‌తో మెరుగైన ఫలితాలు 

సంస్థ నియమ నిబంధనల ప్రకారం వంద లోపు మస్టర్లు మాత్రమే చేస్తూ మూడేండ్లు వరుసగా అదే పద్ధతిలో కొనసాగితే డిస్మిస్‌ అయ్యే ప్రమాదం ఉంది. విధులకు ఎక్కువగా గైర్హాజరవుతున్న వారిని గుర్తించి యాజమాన్యం ప్రతీ మూడు నెలలకు ఒకసారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. దీంతో కొంత హాజరు శాతం పెరుగుతుంది. కౌన్సెలింగ్‌లో పారిశ్రామిక నిబంధనలు వివరించడం తోపాటు క్రమంగా విధులకు హాజరయ్యేలా సంక్షేమాధికారులు, పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌ వారు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం బదిలీ వర్కర్లకు జనరల్‌ మజ్దూర్‌లుగా పదోన్నతి కల్పించేందుకు సంస్థ ఉత్తర్వులు జారీ చేయ డంతో ముఖ్యంగా యువ కార్మికులు అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే అర్హుల జాబితా తయారు చేసే పనిలో గనుల అధికారులు ఉండడంతో మస్టర్లు నింపుకునేందుకు యువ కార్మికులు విధుల్లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది.  

టీబీజీకేఎస్‌ కృషితోనే

కే సురేందర్‌రె డ్డి, ఏరియా ఉపాద్యక్షుడు  

టీబీజీకేఎస్‌ కృషితోనే బదిలీ వర్కర్లకు జనరల్‌ మజ్దూర్‌లుగా పదోన్నతి కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం ముందుకు వచ్చింది. గతంలో బదిలీ వర్కర్లకు, బదిలీ పిల్లర్‌లకు పదోన్నతి కావాలంటే ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ఆగాల్సి వచ్చేది. టీబీజీకేఎస్‌ గుర్తింపు సంఘంగా గెలుపొందిన తర్వాత ఏడాదిన్నరలోగా పదోన్నతులు ఇస్తున్నారు. ఇది కార్మికులకు ఎంతో మేలు చేస్తుంది. 


Updated Date - 2022-08-17T03:53:09+05:30 IST