సింగరేణిలో రెండోరోజూ సమ్మె విజయవంతం

ABN , First Publish Date - 2020-07-04T10:20:04+05:30 IST

బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు మూడు రోజులపాటు చేపట్టిన సమ్మె రెండోరోజైన శుక్రవారం

సింగరేణిలో రెండోరోజూ సమ్మె విజయవంతం

సమ్మెకు నాయకత్వం వహించిన జాతీయ బొగ్గుగని కార్మిక సంఘాలు

విధులకు హాజరు కాని సింగరేణి కార్మికులు 


కొత్తగూడెం, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు మూడు రోజులపాటు చేపట్టిన సమ్మె రెండోరోజైన శుక్రవారం కూడా విజయవంతంగా సాగింది. కోలిండియా, సింగరేణి పరిధిలోని బొగ్గుగనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ.. జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌తోపాటు ఇఫ్టూ కార్మిక సంఘాల నేతలు సమ్మెకు నాయకత్వం వహించారు. వీటితోపాటు ఇఫ్టూ కార్మిక సంఘం సైతం సమ్మెలో పాల్గొని మద్దతు పలికింది. ఈ సమ్మెకు ఆయా కార్మిక సంఘాల అనుబంధ రాజకీయ పార్టీలు కూడా సహకరించి సమ్మెను విజయవంతం చేయించారు. దేశవ్యాప్తంగా 50బొగ్గుగనుల వేలాన్ని నిలిపివేయాలని, కార్మిక చట్టాల సవరణను వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. సింగరేణిలోని కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ హెచ్‌పీసీ వేతనాలు ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేశారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) కేవలం మొదటి రోజు మాత్రమే సమ్మెలో పాల్గొంది. రెండో రోజు నుంచి సమ్మెలో పాల్గొనకుండా ఆ సంఘానికి చెందిన కార్మిక నేతలు మాత్రం సింగరేణి కార్మికులను విధుల్లోకి హాజరు కావాలని పిలుపునిచ్చారు.


ఒక్క రోజు సమ్మెకు మాత్రమే పిలుపునిచ్చామని తెలిపారు. మిగిలిన ఐదు జాతీయ బొగ్గుగని కార్మిక సంఘాల సింగరేణి నేతలతోపాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు కార్మికులు చేపట్టిన సమ్మెకు పూర్తి మద్దతు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బొగ్గుబావులను బడా వ్యాపారులకు అమ్మి కార్మికుల పొట్టన కొట్టే కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మికులు కన్నెర్ర చేయాలని నేతలు పిలుపునిచ్చారు. దేశ సంపదను పాలకులే కాపాడాలని గెలిపిస్తే... గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్న తీరుపై మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రజా శ్రేయస్సు కొరకు ఆలోచించాల్సిందిపోయి ప్రజల సంపదను బాధ్యత ఉన్న ప్రభుత్వాలు నేడు దొంగచాటున బొగ్గుబావులను అమ్మజూస్తున్న పద్ధతిపై ప్రజలు, కార్మికులు కన్నెర్ర చేయాలని కోరారు.


అయితే ఈ సమ్మెలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తు నిర్వహించారు. పలువురు కార్మిక సంఘాల నేతలను పోలీస్‌స్టేషన్లకు తరలించారు. సింగరేణి వ్యాప్తంగా మొదటి షిఫ్టులో మొత్తం సింగరేణి కార్మికులు 26,928మంది కార్మికులకుగాను 15,308మంది సమ్మెకు మద్దతునిచ్చి విధులకు గైర్హాజరయ్యారు. మరో 8,927మంది విధులకు హాజరవగా.. వివిధ కారణాలతో 2,693మంది సెలవుల్లో ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా మొదటి షిఫ్టులో 43.15శాతం మంది మాత్రమే హజరవగా.. రెండో షిఫ్టులో మొత్తం 8,376మందికి గాను 5,087మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 2,652మంది విధులకు హాజరయ్యారు. 637మంది కార్మికులు వివిధ రకాల సెలవుల్లో ఉన్నారు. మొత్తం 39.21శాతం మంది రెండో షిఫ్టులో హాజరయ్యారు.  ఈ క్రమంలో రెండో రోజు కూడా 30శాతం ఉత్పత్తి జరిగి 70శాతం ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 

Updated Date - 2020-07-04T10:20:04+05:30 IST