సింగరాయకొండ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2022-09-25T06:15:58+05:30 IST

సింగరాయకొండలో వైసీపీకి చెందిన పసుపులేటి రవితేజ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

సింగరాయకొండ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
సోమరాజుపల్లి వద్ద పికెట్‌ నిర్వహిస్తున్న పోలీసులు

కాల్‌డేటా ఆధారంగా అదుపులోకి పలువురు 

విచారిస్తున్న పోలీసులు

నిందితుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు

కొనసాగుతున్న పికెట్‌లు

సింగరాయకొండ, సెప్టెంబరు 24 : సింగరాయకొండలో  వైసీపీకి చెందిన పసుపులేటి రవితేజ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కాల్‌డేటా ఆధారంగా శనివారం పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితులైన అంబటి అజయ్‌, మోటుపల్లి గోపి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ముమ్మరంగా గాలిస్తున్నాయి.


దర్శి డీఎస్పీ పర్యవేక్షణ

వైసీపీ నేత రవితేజ హత్య జరిగిన గురువారం రాత్రి నుంచి సింగరాయకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డిని ఎస్పీ మలికగర్గ్‌ పర్యవేక్షణాధికారిగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ముందస్తు జాగ్రత్తగా సింగరాయకొండ, మూలగుంటపాడులోని పలుప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పికెట్‌లను కొనసాగిస్తున్నారు. హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని విచారణాధికారి అయిన సీఐ లక్ష్మణ్‌ తెలిపారు.


లారీకి నిప్పుపెట్టిన ఘటనపై ఆరా

పోలీసుస్టేషన్‌లో ఉన్న హత్యకు ఉపయోగించిన లారీకి మృతుడి మద్దతుదారులు శుక్రవారం నిప్పుపెట్టారు. దీన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎస్పీ ఆదేశాలతో నిప్పుపెట్టిన వారి గురించి ఆరా తీసున్నారు.


నిందితులుగా చేర్చిన  వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన

మృతుడు రవితేజ తండ్రి పనుపులేటి శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మెత్తం 17మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 16 మంది బీసీల్లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, మరొక బీసీ యువకుడు ఉన్నారు. వీరిలో చాలామంది కుటుంబసభ్యులు తమ వారికి, హత్యకు ఎటువంటి సంబంధం లేకపోయినా కేసులో ఇరికించారని ఆందోళన చెందుతున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. 


Updated Date - 2022-09-25T06:15:58+05:30 IST