నిర్లక్ష్యపు నీడలో ‘సింగరాయ’

ABN , First Publish Date - 2021-06-21T05:03:58+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులను ఆధునీకరించిన అధికారుల నిర్లక్ష్యంతో ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదు.

నిర్లక్ష్యపు నీడలో ‘సింగరాయ’
కోహెడ మండలంలోని సింగరాయ ప్రాజెక్టు

 నాసిరకంగా ప్రాజెక్టు ఆధునీకరణ పనులు

 మత్తడి వద్ద లేచిన సిమెంట్‌ పెచ్చులు

 ప్రమాదకరంగా కూరెల్ల హై లెవెల్‌ కాలువ

 పట్టించుకోని అధికారులు


కోహెడ, జూన్‌ 20: తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులను ఆధునీకరించిన అధికారుల నిర్లక్ష్యంతో ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదు. ఇందుకు ఉదాహరణగా కోహెడ మండలంలోని కూరెల్ల, తంగళ్లపల్లి, గుండారెడ్డిపల్లి గ్రామాల మధ్యన నిర్మించిన సింగరాయ ప్రాజెక్ట్‌ అని చెప్పవచ్చు. 1987లో రూ.1.97 కోట్లతో పనులు ప్రారంభించారు. పదేళ్ల తర్వాత 1997లో ప్రాజెక్టును పూర్తి చేశారు. చిన్న తరహా ప్రాజెక్టుగా గత ప్రభుత్వాలు నిధులు కేటాయించి పనులు చేపట్టినా 2004 వరకు ప్రధాన కాలువల నిర్మాణం చేయకపోవడంతో నిరుపయోగంగా ఉంది. సాగునీటి కాలువలు చేపట్టకపోవడంతో ప్రాజెక్టు నిండినా రైతులకు పెద్దగా ఉపయోగపడలేదు. అప్పటికే ప్రాజెక్టుకు రెండుసార్లు గండి పడింది. గండికి మరమ్మతులతో పాటు ప్రధాన కాలువల నిర్మాణ పనులు రూ.66 లక్షలతో 2005లో చేపట్టారు. కూరెల్ల, తంగళ్లపల్లి హైలెవెల్‌ ప్రధాన కాలువ నాలుగు కిలోమీటర్లు, లో లెవెల్‌ కాలువ కింద వింజపల్లి, వెల్దండపల్లి, గోట్లమిట్ట, రామచంద్రాపూర్‌, ఓగులాపూర్‌, తీగలకుంటపల్లి గ్రామాలకు సాగునీరు కోసం పదకొండు కిలోమీటర్లు కాలువలు తవ్వారు. ఈ కాలువల ద్వారానే ఆ గ్రామాల్లోని చెరువులను నింపడంతో పాటు సాగునీటి కోసం నీటిని విడుదల చేసేందుకు కాలువపై చిన్నచిన్న తూం షెట్టర్లను నిర్మించారు. రైతులకు ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనంలేదని, ఆధునీకరించాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, రైతాంగం అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కోరారు. దీంతో 2018లో మంత్రి హరీశ్‌రావు ఆధునీకరణ పనులకు రూ.5.83 కోట్లతో శంకుస్థాపన చేశారు. కాగా ఈ ప్రాజెక్టులో చేపల పెంపకం వల్ల దాదాపు వందకు పైగా ముదిరాజ్‌ కార్మిక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.




ఆధునీకరించినా అంతంతే


సింగరాయ ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిపుణులతో కమిటీ వేసి, ఆధునీకరణకు రూ.5.83 కోట్లు మంజూరు చేశారు. ప్రాజెక్టు సామార్థ్యం 109 ఎంసీఎ్‌ఫసీ ఉండగా 140 ఎంసీఎ్‌ఫసీకి పెంచారు. దీంతో ఈ కాలువల నిర్మాణం జరిగిన 8 గ్రామాలకు 23 వందల ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనా వేశారు.  ఆధునీకరణ పనుల్లో భాగంగా ప్రాజెక్టు కట్ట, మత్తడి సీసీ లైనింగ్‌ పనులు చేశారు. నాసిరకంగా పనులు చేపట్టడంతో సిమెంట్‌ కొట్టుకుపోయింది. అలాగే 11 కిలోమీటర్ల వింజపల్లి ప్రధాన కాలువల సీసీ నిర్మాణాలు తూతూ మంత్రంగా చేపట్టి చేతులు దులుపుకున్నారు. కూరెళ్ల తూము గేటుషెట్టరు విరిగి, కాల్వలోనే సంవత్సరం పాటు పడి ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ సంవత్సరం ప్రాజెక్టు నిండితే తూము పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే సృష్టమైన సమాధానం చెప్పడంలేదు.




70శాతానికి పైగా దెబ్బతిన్న కాలువ


సింగరేణి ప్రాజెక్టు హైలెవల్‌ కాలువ కట్ట ప్రమాదకరంగా మారింది. 70 శాతానికి పైగా ఈ కాలువ కట్ట దెబ్బతింది. తూము షెట్టర్‌ విరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు మాత్రం ఇంతవరకు మరమ్మతు చేయడం లేదు. వానలు దంచికొడితే మోయ తుమ్మెద వాగు వరద ఉధృతికి ఈ ప్రాజెక్టు నిండుతుంది. గతేడాది ఈ కాలువ ద్వారా వచ్చే నీటితో కూరెల్ల సమీపంలో గండి పడి, పంట పొలాలకు నీరు చేరుకొని ఇసుక మేటలు పెట్టాయి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపించలేదు. కాలువ మరమ్మతులు చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో రైతులే కాలువను పూడ్చారు.


 

Updated Date - 2021-06-21T05:03:58+05:30 IST