ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన సింగపూర్ కవుల కవితా పటిమ

ABN , First Publish Date - 2021-04-11T01:10:08+05:30 IST

ఉగాది సందర్భంగా 21 దేశాల తెలుగు సంస్థల సమన్వయంతో అమెరికా "తానా" వారు నిర్వహించిన "ప్రపంచ తెలుగు మహా కవి సమ్మేళనం" తొలి వేదికలో "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ సింగపూర్‌కు ప్రాతిని

ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన సింగపూర్ కవుల కవితా పటిమ

సింగపూర్ సిటీ: ఉగాది సందర్భంగా 21 దేశాల తెలుగు సంస్థల సమన్వయంతో అమెరికా "తానా" వారు నిర్వహించిన "ప్రపంచ తెలుగు మహా కవి సమ్మేళనం" తొలి వేదికలో "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించింది. సింగపూర్ తెలుగు కవుల ప్రతిభాకేతనాన్ని ఎగురవేసింది. సింగపూర్ వాస్తవ్యులైన పదిమంది కవులు, కవయిత్రులు తమ చక్కటి కవితలతో, ఛందోబద్ధమైన పద్యాలతో, గేయాలతో ప్రేక్షకులను అలరించారు. 


రాధిక మంగిపూడి కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రఖ్యాత సినీ రచయిత భువనచంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని.. సింగపూర్ తెలుగు కవులను ప్రొత్సహించారు. కవితలను ఆస్వాదించడమే కాకుండా అమూల్యమైన వ్యాఖ్యానాన్ని అందించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఆయన ఓ పాటను రచించి, పాడి వినిపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య సూర్య ధనుంజయ్.. విశిష్ట అతిథిగా పాల్గొని, కవులను అభినందించారు. 


"శ్రీ సాంస్కృతిక కళాసారథి" అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడారు. ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమంలో తమ సంస్థ, సింగపూర్‌కు ప్రాతినిధ్యం పట్ల ఆనందంగా ఉందన్నారు. తానా నిర్వాహకులు తాళ్లూరి జయశేఖర్, చిగురుమళ్ల శ్రీనివాస్, తోటకూర ప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కొందరు ఔత్సాహిక రచయితలు ఉన్నట్టు తెలిపారు. తొలిసారి కవితాపఠనం చేసినప్పటికీ.. మొదటి ప్రయత్నంలోనే పెద్దల మెప్పును పొందడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. అంతేకాకుండా ఇటువంటి కార్యక్రమాలు ప్రవాసాంధ్ర రచయితలలో నూతన ఉత్సాహాన్ని నింపి.. తెలుగు సాహిత్య పరంపర కొనసాగేందుకు దోహదం చేస్తుందని "శ్రీ సాంస్కృతిక కళాసారథి" నిర్వాహక వర్గం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


రాధాకృష్ణ రేగళ్ళ, గుడిదేని వీరభద్రయ్య, ఓరుగంటి రోజారమణి, సుబ్బు వి పాలకుర్తి , యడవల్లి శేషు కుమారి, ఊలపల్లి భాస్కర్, మల్లవరపు వేణుమాధవ్, శైలజ శశి ఇందుర్తి, శ్రీనివాస్ జాలిగామ పాల్గొని తమ కవితలను వినిపించారు. రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం, శ్రీహరి శిఖాకొల్లు ఈరెమిట్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ఆర్ధిక సమన్వయం అందించారు. ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సింగపూర్, భారత్, అమెరికా దేశాల నుంచి సాహితీ అభిమానులు వీక్షించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చూడదలచిన వారు ఈ కిందే వీడియోను చూడవచ్చు.






Updated Date - 2021-04-11T01:10:08+05:30 IST