10 మంది భారత‌ పౌరులను బహిష్కరించిన సింగ‌పూర్‌

ABN , First Publish Date - 2020-07-14T17:20:55+05:30 IST

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేసిన "సర్క్యూట్ బ్రేకర్" నిబంధనలను ఉల్లంఘించినందుకు సింగపూర్ ప్రభుత్వం 10 మంది భారతీయ పౌరులను దేశం నుంచి బహిష్కరించింది.

10 మంది భారత‌ పౌరులను బహిష్కరించిన సింగ‌పూర్‌

సింగ‌పూర్ సిటీ: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేసిన "సర్క్యూట్ బ్రేకర్" నిబంధనలను ఉల్లంఘించినందుకు సింగపూర్ ప్రభుత్వం 10 మంది భారతీయ పౌరులను దేశం నుంచి బహిష్కరించింది. అంతేగాక‌ భ‌విష్య‌త్తులో కూడా వారిని తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించిన‌ట్లు అధికారులు తెలిపారు. దేశ బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన 10 మంది భార‌తీయుల్లో విద్యార్థులు కూడా ఉన్నారు. దేశంలో మ‌హ‌మ్మారి వ్యాప్తి నియంత్ర‌ణలో భాగంగా ఏప్రిల్ 7 నుంచి "సర్క్యూట్ బ్రేకర్" నిబంధనలను అమలు చేస్తోంది సింగ‌పూర్‌. దీనిలో భాగంగా జ‌నాలు అన‌వ‌స‌రంగా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో స‌మూహాలుగా తిర‌గ‌డానికి వీలు లేదు. ప్ర‌జ‌లు కేవ‌లం ఆహారం, నిత్యావ‌స‌రాలు కొనుగోలుకు లేదా పరిసరాల్లో ఒంటరిగా వ్యాయామం చేయడం మినహా ఇళ్లను విడిచిపెట్టి బ‌య‌ట‌కు రాకుండా అధికారులు నిషేధించారు. కానీ, 10 మంది భార‌తీయులు మే 5న ఈ నిబంధ‌న‌లను ఉల్లంఘిస్తూ ఒక‌చోట‌ స‌మావేశ‌మ‌య్యారు. 


నవదీప్ సింగ్(20), సజన్‌దీప్ సింగ్(21), అవినాష్ కౌర్(27)... కిమ్ కీట్ రోడ్‌లో ఉన్న‌ వారి అద్దె అపార్ట్‌మెంట్‌లో ఏడుగురిని త‌మ ఇంటికి ఆహ్వానించారు. దీంతో "సర్క్యూట్ బ్రేకర్" నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ 10 మందిపై అధికారులు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. దీనిలో భాగంగానే వీరిపై దేశ బ‌హిష్క‌ర‌ణ విధించారు. అలాగే భ‌విష్య‌త్తులో కూడా వారు తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించిన‌ట్లు అధికారులు తెలియ‌జేశారు. ఇదిలా ఉంటే... సోమ‌వారం సింగ‌పూర్‌లో 322 కొత్త క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్ సోకిన వారి సంఖ్య 46,283కు చేరింది. మొత్తం 42,541 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అలాగే దేశ‌వ్యాప్తంగా 3,716 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు సింగ‌పూర్ వ్యాప్తంగా 26 మంది కోవిడ్‌కు బ‌ల‌య్యారు. 

Updated Date - 2020-07-14T17:20:55+05:30 IST