కరోనా ఎఫెక్ట్: సింగపూర్‌లో నెలరోజులు షట్‌డౌన్

ABN , First Publish Date - 2020-04-03T21:32:08+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 కారణంగా షట్‌డౌన్ ప్రకటించిన దేశాల జాబితాలోకి సింగపూర్ కూడా..

కరోనా ఎఫెక్ట్: సింగపూర్‌లో నెలరోజులు షట్‌డౌన్

సింగపూర్: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 కారణంగా షట్‌డౌన్ ప్రకటించిన దేశాల జాబితాలోకి సింగపూర్ కూడా చేరింది. వచ్చే మంగళవారం నుంచి నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా షట్‌డౌన్ అమలు చేయనున్నట్టు సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్ ప్రకటించారు. అత్యవసర సేవలు, కీలక ఆర్థిక రంగాలు తప్ప అన్ని కార్యాలయాలను మూసివేయనున్నట్టు ఆయన తెలిపారు. కోవిడ్-19పై ఒక క్రమపద్ధతిలో, ప్రణాళికా బద్ధంగా స్పందిస్తూ వచ్చిన తాము.. పరిస్థితులు మారుతున్నందున మరింత పటిష్ట చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు సింగపూర్ ప్రధాని పేర్కొన్నారు.


‘‘అత్యవసర సేవలు, కీలక ఆర్ధిక రంగాలు తప్ప మిగతా కార్యాలయాలన్నీ మూసివేస్తున్నాం. ఆహార తయారీ సంస్థలు, సూపర్ మార్కెట్లు, హాస్పిటళ్లు, రవాణా, కీలక బ్యాంకింగ్ సర్వీసులు తదితర సేవలన్నీ అందుబాటులో ఉంటాయి..’’ అని లూంగ్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందనీ.. కోవిడ్-19 కారణంతా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా సింగపూర్‌లో ఇప్పటికే కరోనా వైరస్ కేసుల సంఖ్య వెయ్యి దాటగా... ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నేటితో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పది లక్షలు దాటగా... మృతుల సంఖ్య 50 వేలు దాటినట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-04-03T21:32:08+05:30 IST