కొత్త రిటర్నులు ఎలా దాఖలు చేయాలి?

ABN , First Publish Date - 2020-03-01T07:09:49+05:30 IST

వస్తు సేవల పన్నులో రిజిస్ట్రేషన్‌ తీసుకున్న వారు జీఎస్టీఆర్3బీ, జీఎస్టీఆర్-1 అనే రిటర్నులను సమర్పించాలన్న విషయం తెలిసిందే. అయితే వీటిని దాఖలు చేయటంలో ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా వీటి స్థానంలో...

కొత్త రిటర్నులు ఎలా దాఖలు చేయాలి?

వస్తు సేవల పన్నులో రిజిస్ట్రేషన్‌ తీసుకున్న వారు జీఎస్టీఆర్3బీ, జీఎస్టీఆర్-1 అనే రిటర్నులను సమర్పించాలన్న విషయం తెలిసిందే. అయితే వీటిని దాఖలు చేయటంలో ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా వీటి స్థానంలో కొత్త రిటర్నులను ప్రవేశపెట్టాలని 31వ జీఎస్‌టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. వీటి పనితీరును, సాంకేతిక నైపుణ్యాన్ని, దాఖలు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలుసుకోవటానికి గత కొద్ది నెలలుగా డమ్మీ రిటర్నులను పన్ను చెల్లింపుదారులతో ఫైల్‌ చేయించటం జరిగింది. వచ్చిన ఫలితాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ.. ఈ ఏప్రిల్‌ నుంచి ఈ రిటర్నులను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనున్నారు.  ఈ నేపథ్యంలో కొత్త రిటర్నుల గురించిన ప్రాథమిక సమాచారం మీకోసం..

పన్ను చెల్లింపుదారుల అవసరాలను, వారి టర్నోవర్‌ ఆధారంగా మూడు రకాల రిటర్నులను ప్రవేశపెట్టడం జరిగింది.  వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఉన్నవారు జీఎస్టీ ఆర్‌ఈటీ-1 అనే నెలవారీ రిటర్న్‌ను ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. దీనినే నార్మల్‌ రిటర్న్‌ అని కూడా అంటారు. అలాగే వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్ల కంటే తక్కువ  ఉన్న వారు జీఎస్టీ ఆర్‌ఈటీ-2 లేదా జీఎస్టీ ఆర్‌ఈటీ-3 అనే త్రైమాసిక రిటర్న్‌ను ఫైల్‌ చేయవచ్చు.

సహజ్‌ అని పిలిచే జీఎస్టీ ఆర్‌ఈటీ-2 రిటర్న్‌ను కేవలం  బీ2సీ సరఫరాలు మాత్రమే జరిపే వ్యాపారులు దాఖలు చేయవచ్చు. అలాగే సుగమ్‌ అని పిలువబడే జీఎస్టీ ఆర్‌ఈటీ-3 రిటర్న్‌ను కేవలం బీ2బీ, బీ2సీ సరఫరాలు జరిపే వ్యాపారులు దాఖలు చేయవచ్చు. అయితే నార్మల్‌ రిటర్న్‌ను నెలవారీ పద్ధతిలో వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఉన్నవారు కచ్చితంగా ఫైల్‌ చేయాల్సి ఉండగా, వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్ల కంటే తక్కువ ఉన్నవారు ఇదే రిటర్న్‌ను త్రైమాసిక రిటర్న్‌ కింద ఐచ్ఛికంగా ఫైల్‌ చేయవచ్చు. అలాగే, ఏ రిటర్న్‌ ఫైల్‌ చేసినప్పటికీ  దీనికి అనుబంధంగా రెండు ఫార్మ్స్‌ ఉంటాయి. వీటిని జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1, జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-2 అంటారు. జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1 అనేది ఒక వ్యక్తి అమ్మకాలకు సంబంధించినది కాగా, జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-2 అనేది కొనుగోళ్లకు సంబంధించింది. అంటే సరఫరాదారుడు జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1 లో నింపే వివరాలు కొనుగోలుదారుని జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-2 లో కనిపిస్తాయి. దీనివల్ల కొనుగోలుదారుడు సులువుగా క్రెడిట్‌ తీసుకోవటానికి వీలవుతుంది. అలాగే జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1 ఆధారంగా అమ్మకందారుడు పన్ను కట్టటం సులువు అవుతుంది.

ఇంతకుముందు జీఎస్టీఆర్-1 రిటర్న్‌ ఉన్నప్పటికీ దానికి, జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1 కు మౌఖికపరమైన తేడాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ఏదేనీ ఇన్వాయిస్‌ ఇవ్వగానే దాని వివరాలను అమ్మకందారుడు వెనువెంటనే  జీఎస్టీ ఏఎన్‌ఎక్స్-1లో నింపవచ్చు. అలాగే కొనుగోలుదారుడు కూడా ఆ వివరాలను ఎప్పటికప్పుడు చూడటంతో పాటు ఆ ఇన్వాయి్‌సను లాక్‌ చేయవచ్చు. ఒకసారి లాక్‌ చేసిన ఇన్వాయి్‌సను అమ్మకందారుడు మార్చలేడు. అలాగే, ఇప్పుడు ఉన్న పద్ధతిలో రిటర్నులను సవరించే (అమెండ్) సౌకర్యం లేదు. కానీ, కొత్త పద్ధతిలో ఒకసారి రిటర్న్‌ ఫైల్‌ చేసిన తర్వాత  అవసరం అనుకుంటే సవరణ చేయవచ్చు. అలాగే నిల్‌ రిటర్నులను సులభంగా ఒక ఎస్‌ఎంస్‌ ద్వారా ఫైల్‌ చేయవచ్చు. అయితే ముఖ్య విషయం ఏమిటంటే నెలవారీ రిటర్న్‌ అయినా త్రైమాసిక రిటర్న్‌ అయినా పన్ను చెల్లింపు మాత్రం కచ్చితంగా నెలవారీగా చేయాల్సి ఉంటుంది. 

గమనిక : ఈ వ్యాసాల ద్వారా ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పాఠకులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత చట్టాలు/నిబంధనలను కూలంకషంగా పరిశీలించాలి.

Updated Date - 2020-03-01T07:09:49+05:30 IST