సరళ సుందర అనువాద ఝరి

ABN , First Publish Date - 2020-11-16T06:57:02+05:30 IST

ఆమెది అనువాదమా? కాదు మృదునాదం. సహజ శ్రావ్య స్వరాలాపం. ఆమె అనువదించిన రచన చదువుతుంటే మూల రచన కన్నా అనువాదమే...

సరళ సుందర అనువాద ఝరి

శాంతసుందరి గారు ఎపుడూ తనకు నచ్చని రచనలని అనువాదం చేయలేదు. ఆమెకి నచ్చాలంటే ఆ రచనలో ‘‘విషయం సార్వజనీనంగా ఉండాలి, శిల్పంలో కొత్తదనం ఉండాలి, ఆ రచన సమాజానికి ప్రయోజనం చేకూర్చేదై ఉండాలి’’. ఒకసారి రచన నచ్చి అనువాదానికి ఎన్నుకున్నారంటే వారి అనువాదం ప్రవాహంలా సాగిపోయేది. ఖచ్చితమైన పనివేళలు పాటిస్తూ రోజుకి తప్పనిసరిగా 4 నుంచి 5 గంటలపాటు అనువాద రచన సాగించేవారు. డెబ్భై అయిదో ఏట అడుగు పెట్టకుండానే 75 పుస్తకాల అనువాదం పూర్తి చేశారంటే ఎంతటి నిబద్ధతతో ఆమె తన పని చేసుకుంటూ పోయేవారో ఊహించవచ్చు.


తెలుగు రచయితల రచనలని వేరే భాషలవారికి పరిచయం చేయడం చాలా అవసరమని ఆమె భావించేవారు. ‘‘నా మాతృభాష తెలుగు. నా వాళ్ళని ఇతరులకి పరిచయాలనుకోవడం సహజమే కదా! హిందీ పుస్తకాలని ఇతర భాషలలోకి అనువదించడం సులువుగానే జరుగుతుంది. తెలుగు రచనలు ఇతర భాషలలోకి అంతగా వెళ్లడం లేదు. అందుకే ఆ ప్రయత్నానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను’’ అన్నారు.


ఆమెది అనువాదమా? కాదు మృదునాదం. సహజ శ్రావ్య స్వరాలాపం. ఆమె అనువదించిన రచన చదువుతుంటే మూల రచన కన్నా అనువాదమే బావున్నట్టనిపించిన సందర్భాలు అనేకం! ఒక్కపదం ఎక్కువైనా, అంతరార్థం ఒకింత అటూ ఇటూ అయినా ఆమెకి సంతృప్తి లేదు. కవిత్వంలో అయితే భావమే కాక లయ కూడా కుదిరేవరకూ ఆమె తపన కొనసాగుతూనే ఉంటుంది. హిందీ, తెలుగు, తమిళం, ఆంగ్లం భాషేదైనా ఆమె చూసేది అందులోని సాహితీ విలువలనే. రచనలోని ఆత్మ ఆమెతో సంభాషిస్తుంది. ఆ ఆత్మ ఆమెకేం చెపితే ఆమె కలం దాన్నే అనుసృజిస్తుంది! 


ఆమె కృషికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ఆమెని వెతుక్కుంటూ వచ్చింది. 2015లో. ‘వెతుక్కోవడం ఎందుకూ’ అంటే ఆమె ‘ఇవన్నీ నాకెందుకు’ అంటూ వెనకెక్కడో దాక్కుంటారు కనుక. ఈ పురస్కారం ఆమెకు లభించడంలో ఆలస్యం జరిగిందని కొందరు అభిప్రాయపడినపుడు ఆమె స్పందన ‘‘అవార్డులు రావలసినప్పుడే వస్తాయి. వస్తే సంతోషమే కానీ రాకపోతే విచారించను. అవార్డుల కోసం ఆశించకుండా మంచి పుస్తకాలని అందించాలన్న కోరికా, అందించానన్న తృప్తీ నాకు ముఖ్యం’’.


పరిచయమే అక్కర్లేని ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఆమెకి తండ్రి. తల్లి వరూధినికి మేనమామ అయిన చలం ఆమెకు వరసకి తాతగారు. అమ్మమ్మ కొమ్మూరి పద్మావతీదేవి. కొమ్మూరి సాంబశివరావు స్వయానా మేనమామ. సాహితీ పరిమళాలు, అభ్యుదయ భావాలు, వినయసంపన్నత, పేరుప్రతిష్టలకోసం పాకులాడని నిర్మోహం- ఇవన్నీ ఆ ఇంట పుట్టిపెరిగిన శాంతసుందరి వ్యక్తిత్వంలో భాగమైపోయాయి. 


పూలతోటలో సంచరిస్తుంటే ఆ పూల పరిమళం గాలిలో చేరిపోయి ఆ పరిసరాల నిండా ప్రసరిస్తుంది. ఒక పారిజాతం చెట్టో, పున్నాగ చెట్టో మన ఆవరణలో ఉంటే ఆ పూల వాస నలు మనని చుట్టేస్తూ ఉంటాయి. మనం చాలా సార్లు ఆ సువాసనల్ని గమనించం. కాని వాటి ఉనికి వల్ల మన వ్యక్తిత్వంలో ఒక మృదుత్వం వస్తుంది, మనలో ఒక భావుకత పరిమళిస్తుంది. ఇలాంటి వాతావరణంలో పుట్టిపెరిగి, ఆ వారసత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న శాంత గారికి, సాహితీవిలువలు చెప్పుకోదగ్గ ప్రమాణంలో ఉంటే తప్ప, వాటిలో ప్రగతిశీల భావాలు కనిపిస్తే తప్ప ఏ రచనా నచ్చదు. 


మద్రాసులోని అడయార్‌ థియొసా ఫికల్‌ సొసైటీ వారి బాల భారతి అనే పాఠశాలలో శాంత సుందరి చదువు మొదలయింది. అది బడిలా కాకుండా గురుకులంలా ఉండేదనీ, అక్కడ మా ర్కులూ రాంకులూ లేకుండా ఒక్కో విద్యార్థినీ వ్యక్తిగతంగా ఎలా ఎదుగు తున్నారో గమనించి చూస్తూ మార్గ నిర్దేశనం చేసేవారనీ చెప్తూ, ‘‘పిల్లలకి చిన్నప్పట్నుంచే సంతోషంగా, సంతృ ప్తిగా బతకటం నేర్పించాలి. అటువంటి మార్పు సమాజంలో రావాలి. ప్రస్తుతం చిన్నపిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారు’’ అంటూ నేటి విద్యా విధానాన్ని తలచుకుని ఆమె విచారించేవారు. 


ఆవిడకి సంగీతమంటే చాలా ఇష్టం. ఆపాత మధురాలైన పాత హిందీ పాటలు వింటూ ఆ భాష మీద మమకారం పెంచు కున్న శాంతగారు హిందీ పరీక్షలు రాసి, చదువు అందులోనే కొనసాగించి, హిందీ ఎమ్మేచేసి, బీఎడ్‌ పూర్తి చేశారు. లిబియాలో అనేక సంవత్సరాలు హైస్కూల్‌ టీచర్‌గా పనిచేసిన ఆమెకి ‘‘పిల్ల లందరికీ ఊహ తెలిసినప్పటినుంచే వయసుకి తగ్గ సంగీతం, సాహిత్యం పరిచయం చేసే ధోరణి తల్లిదండ్రులలో ఉంటే సమాజం ఇంతకంటే ఎంతో మెరుగ్గా ఉంటుం’’దని నమ్మకం. 


ఆమె బియ్యే చదువుతూండగా మద్రాస్‌ యూనివర్సిటీ హిందీ మాతృ భాష కాని విద్యార్థులకి ఒక పోటీ నిర్వహించింది. అందులో ప్రథమ స్థానంలో నిలిచి బహుమతిగా లభించిన వెయ్యి రూపాయలతో కుటుంబసమేతంగా ఢిల్లీ బనారస్‌ ప్రదేశాలు చూడాలని వెళ్లారు. తనకిష్టమైన హిందీ కవులని కలుసుకున్నారు. వారిలో ఒకరు హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌. 


ఆ మహాకవి ఇంటికి వెళ్ళినపుడు తలుపు తెరిచిన పొడు గాటి యువకుడెవరో చెప్పుకోమని శాంతగారు అడిగినపుడు, ‘‘ఇంకెవరు అమితాబ్‌ బచ్చన్‌’’ అన్నాను. ఆమె నవ్వులు చిందిస్తూ హరివంశరాయ్‌ బచ్చన్‌ తనని ప్రోత్సహించిన ఆ సంఘటనని ఎంతో ఇష్టంగా గుర్తుచేసుకున్నారు. ఇంటికి వెళ్లాక తాను ఆ ప్రయాణంలో సందర్శించిన కవులందరికీ, తనని ఆప్యాయంగా పలకరించి ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉత్త రాలు రాశాననీ, ఒక్క హరివంశరాయ్‌ బచ్చన్‌ నించి మాత్రమే తనకి జవాబు వచ్చిందనీ చెప్పారు. 


ఆ ఉత్తరంలో శాంత సుందరి హిందీ చాలా బావుందనీ, భారతీయ భాషల మధ్య పరస్పర అనువాదాలు చాలా అవ సరమనీ చెప్పి, ఆమెని అనువాదాలు విరివిగా చెయ్యమన్న సలహా ఇచ్చారు ఆ మహాకవి. అంతే... శాంతగారికి అనువా దాల పట్ల ఆసక్తి కలిగింది! హరివంశరాయ్‌ బచ్చన్‌, శాంత గారికి తటస్థ పడకపోతే ఒక అద్భుతమైన అనువాద రచయిత తెలుగువారికి లభించేవారు కాదేమో! 


తెలుగు నించి హిందీకి, హిందీ నించి తెలుగుకీ, ఇంగ్లీష్‌ నించి తెలుగుకీ ఆమె చేసిన అనువాదాలలో వరవరరావు, కె.శివారెడ్డి గార్ల కవిత్వానికీ, డాక్టర్‌ ఎన్‌ గోపీ గారి కవితా సంపుటి ‘కాలాన్ని నిద్రపోనివ్వను’, సలీం గారి నవల ‘కాలుతున్న పూల తోట’కీ, డేల్‌ కార్నెగీ వ్యక్తిత్వ వికాస గ్రంథాలకీ మంచి స్పందన లభించింది. కొడవటిగంటి కుటుంబరావు గారి అద్భుత రచన ‘చదువు’ నవలను హిందీలోకీ; ‘కథాభారతి’, ‘కథ కాని కథ’, ఆనంద్‌ నీలకంఠన్‌ ‘అసురుడు’, ‘అజేయుడు’, ‘రెక్కల ఏను గులు’ బాలల కథలను తెలుగులోకీ ఆమె అనువదించారు. ఈ మధ్యనే ్గఠఠ్చిజూ ూ్చౌజి ఏ్చట్చటజీ  రచించిన ఖ్చిఞజ్ఛీుఽట అనే ప్రఖ్యాత గ్రంథాన్ని ఆమె ‘మానవజాతి పరిణామ క్రమం’గా తెలుగులోకి అనువదించారు. ఆమె ఆఖరి అనువాదం నానీల సృష్టికర్త డాక్టర్‌ ఎన్‌. గోపీ గారి ‘వృద్ధోపనిషత్‌’.


ఆమెకు లభించిన మొదటి పురస్కారం 2005లో ఢిల్లీ లోని భారతీయ అనువాద్‌ పరిషద్‌ ‘డా. గార్గీ గుప్త ద్వివాగీశ్‌ పుర స్కార్‌’. రెండు భాషల్లో తగినన్ని అనువాదాలు చేసినవాళ్లకి ఈ పురస్కారం ఇస్తారు. తరువాత 2009లో సలీం ‘కాలుతున్న పూలతోట’ నవలకి చేసిన హిందీ అనువాదానికి గాను ఢిల్లీ లోని జాతీయ మానవ హక్కుల సంఘం ప్రథమ బహుమతి అందజేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ అనువాద పురస్కారం, అమృత లత అపురూప పురస్కారం, లేఖిని పురస్కారం ఆమె అందుకున్న ఇతర పురస్కారాలు.


శాంత గారికి ప్రేమ్‌చంద్‌ అంటే చెప్పలేనంత ఇష్టం. ‘ప్రేమ్‌ చంద్‌ ఘర్‌ మే’ అనే పేరుతో ప్రేమ్‌చంద్‌ సతీమణి శ్రీమతి శివరాణీ దేవి ప్రేమ్‌ చంద్‌ రాసిన హిందీ గ్రంథాన్ని తెలుగులో ‘ఇంట్లో ప్రేమ్‌ చంద్‌’గా అనువదించి ఆమె 2014 సంవత్సరపు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి అనువాద పురస్కారం కూడా ప్రేమ్‌ చంద్‌ బాల సాహిత్యం పుస్తకానువాదానికే ఈమెకి లభించింది. 


ఇప్పటివరకూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందు కున్న తెలుగు రచయితలు దాదాపు అరవైమంది ఉండగా మహిళలు మాత్రం కేవలం అయిదుగురే. తెలుగులో అనువాద ప్రక్రియలో ఈ అవార్డు పొందినవారు ముప్ఫైకి పైగా ఉన్నా, మహిళలు మాత్రం ముగ్గురే. వీరిలో శాంత సుందరి రెండవ వారు. అకాడమీ స్థాపించి ఇప్పటికి అరవయ్యేళ్లు. అంటే దశా బ్దానికి ఒక్క స్త్రీ కూడా ఈ అవార్డు రాలేదన్నమాట. 


అనువాద ప్రక్రియ ఆవశ్యకత గురించి విడిగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో గదుల మధ్య ఉండే తలుపులాంటిది అను వాదం. ఒక భాష నించి మరో భాషకి రచనలూ వాటిలోని భావ పరంపరా ప్రవహించాలంటే అనువాదం అత్యంత ఆవ శ్యకం. శరత్‌ అనువాద నవలలు చదివి ఆయన తెలుగు రచయితే అనుకునే పాఠకులు లెక్కకు మించి ఉన్నారు. ఇతర భాషల్లోని గొప్ప గొప్ప రచనలు మన భాషలోకి వచ్చి సాహితీ పిపాసుల దాహం తీర్చాయంటే, ఇతర భాషల్లోని సాహితీ పరిమళాలను మనకి పరిచయం చేశాయంటే శాంతసుందరి గారి లాంటి అనువాదకులు ఉండబట్టే. 


శాంతసుందరి నిజానికి వృక్షశాస్త్రం చదువుకోవాలనుకున్నారు. అందులో సీట్‌ రాలేదని 3 నెలలపాటు మనోవ్యధకి గురై చాలా బాధపడ్డాననీ, ‘అది కాకపొతే ఏదైనా పరవాలేదు’ అనే ఉద్దేశంతో కుటుంబరావు గారి సలహామీద హిందీ లిటరేచర్‌ తీసుకున్నాననీ ఆమె చెప్పారు. తర్వాత్తర్వాత అనువాదరంగంలో అభిరుచి పెరిగి, మంచి పేరు లభించడం తనకో పాఠాన్ని నేర్పిందనీ చెపుతూ, ఆ అనుభవం వల్లే ‘‘లేనిదాని కోసం బాధ పడేకన్నా, ఉన్నదాన్ని వీలైనంతగా ఉపయోగించుకోవా’’లనేది తన సిద్ధాంతం అయిందన్న ఆమె మాటలు వింటుంటే, ప్రతి సంఘటనకూ సానుకూలంగా స్పందించి, ప్రతి అనుభవం లోంచి ఒక పాఠాన్ని నేర్చుకుని, సంపూర్ణంగా వికసించిన ఒక వ్యక్తిత్వం మనకి కనిపిస్తుంది.


శాంత సుందరి గారు ఎపుడూ తనకు నచ్చని రచనలని అనువాదం చేయలేదు. ఆమెకి నచ్చాలంటే ఆ రచనలో ‘‘విషయం సార్వజనీనంగా ఉండాలి, శిల్పంలో కొత్తదనం ఉండాలి, ఆ రచన సమాజానికి ప్రయోజనం చేకూర్చేదై ఉండాలి’’. ఒక రచన ఆవిడ దృష్టిలో పడాలంటే ఆ రచనలో ఉండాల్సిన లక్షణా లివి. ఒక్కోసారి ఒక సంస్కృతిలో విశేషంగా ఉండే లక్షణాలని సంపాదకులు ఇష్టపడతారు కనుక, పై లక్షణాలతో సంబంధం లేకుండా అలాంటి రచనల్ని కూడా ఆమె అనువదించారు.


ఒకసారి రచన నచ్చి అనువాదానికి ఎన్నుకున్నారంటే వారి అనువాదం ప్రవాహంలా సాగిపోయేది. ఖచ్చితమైన పని వేళలు పాటిస్తూ రోజుకి తప్పనిసరిగా 4 నుంచి 5 గంటల పాటు అనువాద రచన సాగించేవారు. ఆదివారం మాత్రం కలానికి సెలవు. వచనమైతే నేరుగా ఫెయిర్‌ కాపీనే. చిత్తు ప్రతి ఉండేదికాదు. ఇంకా డెబ్భై అయిదో ఏట అడుగు పెట్ట కుండానే 75 పుస్తకాల అనువాదం పూర్తి చేశారంటే ఎంతటి నిబద్ధతతో ఆమె తన పని చేసుకుంటూ పోయేవారో ఊహించ వచ్చు. విడిగా కవితలూ కథల అనువాదం నిరంతరం సాగు తూనే ఉండేది. హిందీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లోని కవిత్వం, నవల, కథ, నాటకం, వ్యాసాలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మాత్రమే కాక తమిళం నుంచి కూడా కొన్ని అనువాదాలు చేశారు. ఆమె అనువాదాలు మొదలుపెట్టింది కథలు, నాటికల తోనే అయినా కవిత్వమంటే ఎక్కువ ఇష్టపడేవారు. ఆవిడ సాహితీ కృషిలో ఆంగ్లసాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివిన గణేశ్వర రావు గారి పాత్ర కూడా చెప్పుకో దగ్గది. తన అనువాదానికి రావుగారి సహకారం ప్రోత్సాహమే కాదు- ఆ పని తన పనే అన్నంతగా మమేకమై సాయం చేస్తారని శాంతగారు చెప్పేవారు.


భారతీయ సాహిత్యాన్ని విపరీతంగా ప్రభావితం చేసిన గొప్ప రచయి తల్లో ప్రేమ్‌ చంద్‌ ఒకరు. గొప్ప రచనలు చేసి, ఉన్నతమైన పాత్రలు సృష్టించిన వ్యక్తి, నిజజీవితంలో అంతటి ఉన్నతుడు కాకపోవచ్చు. తన రచనల్లో చూపించిన ఉదాత్త భావాలు అతని వ్యక్తిత్వంలో కన పడక పోవచ్చు. ప్రముఖవ్యక్తుల జీవితాల గురించి తెలుసు కోవాలని జనసామాన్యం కుతూహలం చూపించడం సహజం. అందుకే ప్రముఖుల జీవనచిత్రాలు కూడా ప్రముఖమౌతాయి. ప్రేమ్‌చంద్‌ రచనలెన్ని చదివినా తెలుగు పాఠకులకి ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకోగలిగే అవకాశం మాత్రం ‘ఇంట్లో ప్రేమ్‌ చంద్‌’ అనువాదం వల్లే కలిగింది. ఒక అనువాద గ్రంథా నికి పురస్కారం లభించాలంటే, అనువాద ప్రక్రియలో రచయిత కున్న ప్రతిభతో పాటు ఉన్నతమైన రచనని ఎన్నుకోవడంలో రచయితకున్న అభిరుచీ, మూల రచన గొప్పదనమూ కూడా ప్రాధాన్యత వహిస్తాయి. సాహిత్య అకాడెమీ పురస్కారం శాంత సుందరి గారికి లభించటంలో పైన చెప్పిన మూడు విషయాలూ ముఖ్య భూమిక వహించాయని చెప్పక తప్పదు.


ఏ అనువాదమైనా మనసుని హత్తుకోవాలంటే ఎంపిక ముఖ్యం. మంచి రచనని ఎన్నుకుని మూలభాషలోను, అనువాద భాష లోను మంచి ప్రవేశం ఉన్నవ్యక్తి అనువదిస్తే అది పాఠకులని ఆకట్టుకుంటుందనీ, అనువాదాలు ఎంత సరళంగా ఉంటే అంత బాగా చదువరులని ఆకర్షిస్తాయనీ శాంతగారు చెప్పేవారు. తెలుగు నించీ హిందీలోకి అనువదించడానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. వర్ధమానరచయితల రచనలని అనువ దించేవారు తక్కువనీ, మన రచయితలు సామాజిక సమస్య లకి స్పందించి రాస్తున్నంత విరివిగా హిందీ రచయితలు రాయడం లేదనీ చెపుతూ, ఇతివృత్తపు ఎన్నిక, రచనా విధానం, శైలి- అన్నింటిలోనూ మనమే హిందీవాళ్లకన్నా ముందున్నామని ఆమె అభిప్రాయపడ్డారు. 


తెలుగు రచయితల రచనలని వేరే భాషలవారికి పరిచ యం చేయడం చాలా అవసరమని ఆమె భావించేవారు. ‘‘నా మాతృభాష తెలుగు. నా వాళ్ళని ఇతరులకి పరిచయాలను కోవడం సహజమే కదా! హిందీ పుస్తకాలని ఇతర భాషలలోకి అనువదించడం సులువుగానే జరుగుతుంది. తెలుగు రచనలు ఇతర భాషలలోకి అంతగా వెళ్లడం లేదు. అందుకే ఆ ప్రయత్నానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రభుత్వమూ, స్వచ్ఛంద సంస్థలూ అనువాదాలని ప్రోత్సహిస్తే మన పుస్తకాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో హిందీలోకి, ఆంగ్లం లోకి వెళతాయి’’ అనే శాంత సుందరి హృదయమంతటా సాహిత్యమే. గణేశ్వరరావుగారిది కూడా అదే కోవ కావడంతో వారి సాహచర్యం వల్ల తెలుగు సాహితీ ప్రపంచం సుసంపన్నమైంది.

వారణాసి నాగలక్ష్మి

Updated Date - 2020-11-16T06:57:02+05:30 IST