సింహపురిలో మహాత్ముడు

ABN , First Publish Date - 2022-08-12T06:32:33+05:30 IST

జాతిపిత, మహాత్మా గాంధీజీ సింహపురిలో ఐదుసార్లు పర్యటించారు. దేశ స్వాతంత్య్రం కోసం, విరాళాల నిధి కోసం ఆయన 1915 నుంచి 1946వ సంవత్సరం మధ్య జిల్లాలో పర్యటించారు.

సింహపురిలో మహాత్ముడు
1915లో నెల్లూరుకు వచ్చిన మహాత్మాగాంధీతో వీఎస్‌ శ్రీనివాస శాస్త్రి, రేబాల లక్ష్మీనరసారెడ్డి, వీరరాఘవాచారి, బెజవాడ పట్టాభిరామిరెడ్డి, నటేషన్‌, శ్రీనివాసాచారి

జిల్లాలో  ఐదుసార్లు పర్యటన

సభలు, సమావేశాల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించి

మహాత్ముడి పిలుపుతో పులకించిన జనం


నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) ఆగస్టు 11 : జాతిపిత, మహాత్మా గాంధీజీ సింహపురిలో ఐదుసార్లు పర్యటించారు. దేశ స్వాతంత్య్రం కోసం, విరాళాల నిధి కోసం ఆయన 1915 నుంచి 1946వ సంవత్సరం మధ్య జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలు, సమావేశాల్లో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని జిల్లావాసుల్లో రగిలించారు.ఆ మహాత్ముడి పిలుపుతో సింహపురి పులకించి, ఉద్యమాలతో పరవశించింది. 

1915లో తొలిసారి జిల్లా పర్యటనకు గాంధీజీ శ్రీకారం చుట్టారు. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చి తొలిసారి ఆంధ్రలో పర్యటించారు. మే నెల 4, 5, 6 తేదీలలో నెల్లూరులో జరిగిన 21వ రాష్ట్రీయ మహాసభలో ఆయన పాల్గొన్నారు. 241 మంది సభ్యులు పాల్గొన్న ఈ సభలో  సన్మాన పత్రం చదువుతుంటే గాంధీజీ మీరు చదవడం కాలయాపన మాకిస్తే మేమే చదువుకుంటామని చమత్కరించారు. మీ ప్రశంసలకు నేను కస్తూరిబాలు కొద్దిపాటి అర్హులమైనా ఆ ఖ్యాతి కీర్తిశేషులు గోఖలేకు చెందాలన్నారు. సెలవు రోజుల్లో విద్యార్థులు గ్రామసేవ చేయాలని పిలుపునిచ్చారు.

1921 ఏప్రిల్‌ 7వతేదీ పల్లెపాడు పినాకినీ ఆశ్రమాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించారు. పెన్నానది ఒడ్డున ఇసుక రహదారిలో నడచి రావడం, తొలిసారిగా హరిజనులకు పల్లెపాడు గ్రామ ప్రవేశం కల్పించారు. అలాగే నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌస్‌పేట తిలక్‌ విద్యాలయాన్ని గాంధీజీ ప్రారంభించారు. నగరంలో ఎర్రటి టాపు లేని జీపులో తిరుగుతూ స్వరాజ్యనిధి గాంధీజీ విరాళాలు సేకరించారు.

1929, మే నెలలో మూడోసారి మహాత్ముడు ఖద్దరు విరాళాల కోసం జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనలో గ్రామాల్లో పర్యటిస్తూ పల్లెపాడు ఆశ్రమంలో ఒకరాత్రి బస చేశారు. మైపాడు, బుచ్చిరెడ్డిపాళెం, విడవలూరు తదితర గ్రామాల్లో పర్యటిస్తూ ఖద్దరు వాడకం, మద్యపాన బహిష్కరణ, స్త్రీజనోద్ధరణలపై గ్రామాల్లో ఉపన్యసిస్తూ అవగాహన కలిగించారు. 

1933లో నాల్గవసారి హరిజన నిధి కోసం జాతిపిత జిల్లాలో పర్యటించారు. స్వాతంత్య్ర ఉద్యమంపై ప్రజలకు తమ కర్తవ్యాలను బోధించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోనే ఎక్కువ విరాళాలు గాంధీకి అందాయి. నూనూగు మీసాలతో పదమూడున్నర ఏళ్లలో బెజవాడ గోపాల్‌రెడ్డి ఉద్యమంలో పాల్గొనడం, అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తదితర వర్గాలకు చెందిన వారు ఉద్యమంలో పాల్గొన్నారు. 

1946లో ఐదోసారి రైలులో మద్రాసు వెళుతూ నెల్లూరు కొండాయపాలెం వద్ద దిగారు. పొనకా కనకమ్మ గాంధీ మహాత్ముడిని సన్మానించారు.  


నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 15న స్వాతంత్య్ర వేడుకలు

నెల్లూరు (సాంస్కృతికం) ఆగస్టు 11 : భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 15వ తేదీన జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలో జరుగుతాయని కలెక్టర్‌  చక్రధర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబటి రాంబాబు పతాక ఆవిష్కరణ చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 9.50 గంటలకు శకటాల ప్రదర్శన, 10.10కి విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, 11గంటలకు ప్రశంసాపత్రాల ప్రదానం, లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ, జాతీయ గీతాలాపన వంటి కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-12T06:32:33+05:30 IST