నేత్రపర్వంగా అప్పన్న చందనోత్సవం

ABN , First Publish Date - 2021-05-15T05:13:36+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం శుక్రవారం సంప్రదాయబద్ధంగా, ఏకాంతసేవగా జరిగింది.

నేత్రపర్వంగా అప్పన్న చందనోత్సవం
పట్టువస్త్రాలు తీసుకువచ్చిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు

కొవిడ్‌ నేపథ్యంలో వరుసగా రెండో ఏడాదీ ఏకాంతసేవగా నిర్వహణ 

భక్తులకు లభించని నిజరూప దర్శనం

తొలిదర్శనం చేసుకున్న పాలకమండలి చైర్‌పర్సన్‌ సంచయిత 

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ముత్తంశెట్టి 

పూసపాటి వంశీయులకు అందని ఆహ్వానం

అధికారుల తీరుపై విమర్శలు


సింహాచలం, మే 14: వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం శుక్రవారం సంప్రదాయబద్ధంగా, ఏకాంతసేవగా జరిగింది. ఏటా వైశాఖమాస శుక్లపక్ష తదియ రోజున మాత్రమే సింహాద్రినాథుడు నిజరూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తాడు. అయితే కొవిడ్‌ నిబంధనల కారణంగా ఈ ఏడాది కూడా భక్తులకు స్వామి దర్శన భాగ్యం లభించలేదు. గత ఏడాది మాదిరిగానే అప్పన్న చందనోత్సవం ఈ ఏడాది కూడా ఏకాంతసేవగా సాగింది. అధికారులు ప్రకటించిన విధంగా శుక్రవారం వేకువజామున రెండు గంటలకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. దేవాలయ స్థానాచార్యులు డా.టీపీ రాజగోపాల్‌ పర్యవేక్షణలో ఇన్‌చార్జి ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, పురోహితులు కరి సీతారామాచార్యులు సారథ్యంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనములు పూర్తిచేశారు. ఆస్థాన మండపంలో పండితులు వేద పఠనాలు, ఇతిహాస, పురాణ పారాయణలు చేస్తుండగా మంగళవాయిద్యాల నడుమ అర్చక స్వాములు నోటికి గుడ్డలు కట్టుకుని భక్తి ప్రపత్తులతో ఏడాది పొడవునా సింహగిరివాసుని మేనిపై వుండే చందనాన్ని వెండి బొరిగెలతో తొలగించారు. సుమారు గంటకుపైగా సాగిన ఈ కార్యక్రమం తరువాత అప్పన్నకు ప్రత్యేక అభిషేకాలు, విశేష ఆరాధనలు, నీరాజనాలు సమర్పించి, ముందుగా సిద్ధం చేసిన చందనపు ముద్దలను దైవం శిరస్సు, ఎదపైనా వుంచి చల్లబరిచారు. అనంతరం ఆలయ ఆచారం ప్రకారం దేవస్థానం పాలకమండలి చైర్‌పర్సన్‌ సంచయితకు తొలి దర్శనం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సతీమణి జ్ఞానేశ్వరి, కుమారుడితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించగా, ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి ఈవో ఎంవీ సూర్యకళ స్వామి దర్శనాన్ని కల్పించారు. కరోనాను పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన శక్తియుక్తులు ప్రసాదించాలని, రానున్న ఏడాదైనా భక్తులందరికీ నిజరూప దర్శనం లభించేలా చూడాలని సింహాద్రినాథుని కోరుకున్నట్టు ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. 


పూసపాటి వంశీయులకు అందని ఆహ్వానం

విస్మరించిన సింహాచలం అధికారులు 


వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి రూ.కోట్లు విలువచేసే ఆస్తులను ఇచ్చిన పూసపాటి వంశీయులను చందనోత్సవం రోజున సింహాచలం దేవస్థానం అధికారులు పూర్తిగా విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, దివంగత పూసపాటి ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతిరాజులకు చందనోత్సవ వేళ అప్పన్నస్వామి నిజరూప దర్శనానికి అధికారుల నుంచి ఆహ్వానం అందలేదని సమాచారం. గతంలో వివిధ హోదాల్లో దేవస్థానం అభివృద్ధికి కృషిచేసిన పీవీజీ రాజు తనయుల కుటుంబాలను ఆహ్వానించకపోవడం అమర్యాదకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చైర్‌పర్సన్‌ మారినంత మాత్రాన మర్యాదలు మంటగలిపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అశోక్‌గజపతిరాజుకు, ఆనందగజపతిరాజు కుటుంబ సభ్యులకు సింహాచల దేవస్థానం నుంచి విధిగా మర్యాదలు అందాల్సి ఉందని, దీనిని అధికారులు విస్మరించడం అత్యంత గర్హనీయమంటున్నారు. 



Updated Date - 2021-05-15T05:13:36+05:30 IST