పదకొండేళ్ల తర్వాత శింబు విజయహాసం

దాదాపు పదకొండేళ్ల తర్వాత హీరో సిలంబరసన్‌ అలియాస్‌ శింబు విజయాన్ని అందుకున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించి విడుదలైన ‘మానాడు’ చిత్రానికి మంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇది శింబుకు పెద్ద ఊరటనిచ్చే విషయం. ముఖ్యంగా 2010 సంవత్సరం తర్వాత ఆయన ఖాతాలో సరైన విజయం లేదనే చెప్పాలి. ఈ 11 యేళ్ళ కాలంలో వచ్చిన ‘వానమ్‌’, ‘ఒస్తి’, ‘పోడా పోడి’, ‘వాలు’, ‘ఇది నమ్మ ఆలు’, ‘అచ్చమ్‌ ఎన్బదు మడమైయడా’, ‘అన్బానవన్‌, అసరాదవన్‌ అడంగాదవన్‌’, ‘వందా రాజాదాన్‌ వరువేన్‌’, ‘ఈశ్వరన్‌’ వంటి మూవీలు విడుదలయ్యాయి. వీటిలో పలు చిత్రాలు ఫెయిల్‌ కాగా, కొన్ని చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. అయితే, 2018లో మణిరత్నం రూపొందించిన ‘చెక్క చ్చివంద వానమ్‌’లో శింబుతో పాటు విజయ్‌సేతుపతి, అరవింద్‌ స్వామి వంటివారు నటించారు.


ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ యేడాది సంక్రాంతికి ఎన్నో ఆశలతో రిలీజ్‌ చేసిన ‘ఈశ్వరన్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పూర్తిగా నిరాశపరిచింది. ఈ క్రమంలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా, మరో దర్శకహీరో ఎస్‌.జె.సూర్య నెగెటివ్‌ రోల్‌ లో తెరకెక్కించిన ‘మానాడు’ చిత్రం ఈ నెల 25వ తేదీన ఎన్నో అడ్డంకులను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.  అందుకే రాష్ట్రంలోనే కాకుండా, విదేశాల్లో సైతం ‘మానాడు’ను ప్రదర్శించే స్ర్కీన్‌ల సంఖ్యను కూడా క్రమంగా పెంచుతున్నారు. ఇదే సినిమాను తెలుగులో ‘ది లూప్’ గా విడుదల చేస్తున్నారు.

Advertisement