సీమ కోల్పోయిన జలసాధకుడు

ABN , First Publish Date - 2021-05-04T09:27:01+05:30 IST

ఒపిడిఆర్‌ రాష్ట్ర కమిటీ నాయకులు, జలసాధన సమితి ప్రధానకార్యదర్శి ఎం.రామకృష్ణ (70) పది రోజులు కరోనా వైరస్‌తో పోరాడి మేడే రోజున...

సీమ కోల్పోయిన జలసాధకుడు

ఒపిడిఆర్‌ రాష్ట్ర కమిటీ నాయకులు, జలసాధన సమితి ప్రధానకార్యదర్శి ఎం.రామకృష్ణ (70) పది రోజులు కరోనా వైరస్‌తో పోరాడి మేడే రోజున సాయంత్రం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అంతిమశ్వాస విడిచారు. ఆయన మరణం హక్కుల ఉద్యమానికి, రాయలసీమ నీటి ఉద్యమాలకు, సమాజానికి తీరని లోటు. రామకృష్ణ విద్యార్థిదశ నుంచే ప్రగతిశీల భావాల పట్ల ఆకర్షితుడై తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితకాలమంతా పనిచేశారు. వ్యవసాయ అధికారిగా ఉద్యోగం చేస్తూనే జనసాహితి సంస్థలో పని చేస్తూ సమకాలీన అంశాల పట్ల ఎన్నో కవితలు వ్యాసాలు రాశారు. సాహిత్య సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థి, ఉద్యోగ, కార్మిక హక్కుల కోసం పని చేస్తూ వారికి అండగానిలిచారు. ఉద్యోగ విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా ఒపిడిఆర్‌ రాష్ట్ర కమిటీ సభ్యునిగా జిల్లా కార్యదర్శిగా ఉంటూ ప్రజల కోసం నింతరం పనిచేశారు. దళిత బహుజన ఉద్యమాల్లో క్రీయాశీలక పాత్ర పోషించారు.  రాయలసీమ లోని కరువుకు వ్యతిరేకంగా నీటి హక్కుల కోసం జలసాధన సమితిలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు నిఖర జలాల కోసం రైతాంగాన్ని కదిలించి ‘సీమసత్యాగ్రహం’ ఉద్యమాలు నిర్వహించటంలో ప్రధాన పాత్ర పోషించారు. ‘శ్రీభాగ్‌’ ఒప్పందాన్ని అమలు జరపాలని రాయలసీమ ప్రజాసంఘాలతో కలిసి 2018లో విజయవాడలో, 2019లో అనంతపురం పట్టణంలో నిర్వహించిన ఆందోళన, ఉద్యమకార్యక్రమాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. అనంతపురం జిల్లా ఎడారి కాకుండా కాపాడాలని, కరువుల నుంచి రక్షించాలని, పెన్నానదిని బతికించాలని, జిల్లాలోని అన్ని నదులకు, చెక్‌డ్యాంలు నిర్మించి హంద్రీనీవా నీటితో నింపి నదులకు జీవించే హక్కు కల్పించాలని, నదుల పునరుజ్జీనానికి శ్రీకారం చుట్టారు. రామకృష్ణ కృషితో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌ స్పందించి డ్వామా, ఇరిగేషన్‌ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి పెన్నానదిని బతికించటానికి తగిన ప్రణాళికలు రూపొందించారు. 


ఇంత కృషి సాగించిన రామకృష్ణ మరణం రాయలసీమ నీటి ఉద్యమాలకు, హక్కుల ఉద్యమానికి తీరని నష్టం. ఆయన మరణం పూడ్చలేనిది. హక్కుల ఉద్యమకార్యకర్తలు, రాయలసీమ నీటి హక్కుల కోసం పోరాడే సంఘాలు, ప్రజాతంత్ర శక్తులు రామకృష్ణ ఆశయ సాధన కోసం కృషి చేయటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి.

ఎం.శ్రీనివాసులు

ఒ.పి.డి.ఆర్‌ రాష్ట్ర అధ్యక్షులు

ఆర్‌.రాంకుమార్‌

జలసాధన సమితి అధ్యక్షులు

Updated Date - 2021-05-04T09:27:01+05:30 IST