కనకదుర్గమ్మ వెండి సింహాలను కరిగించేశారు

ABN , First Publish Date - 2021-01-24T05:57:00+05:30 IST

దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులను ఊరేగించే..

కనకదుర్గమ్మ వెండి సింహాలను కరిగించేశారు
వెండి సింహాలు కరిగించగా వచ్చిన ముద్దలను పరిశీలిస్తున్న పోలీసులు

దుర్గమ్మ రథంపై విగ్రహాల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు   

15.4 కిలోల వెండి దిమ్మలు స్వాధీనం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులను ఊరేగించే రథానికి ఉండే మూడు వెండి సింహాల ప్రతిమల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రతిమలు అపహరించిన నిందితుడితో పాటు వాటిని కొనుగోలు చేసి కరిగించేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఆలయాలపై దాడులు, చోరీల కేసులకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు బృందం, విజయవాడ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును ఛేదించారు. ఆ వివరాలను విజయవాడ పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్‌ జీవీజీ అశోక్‌కుమార్‌, డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌, పశ్చిమ మండలం ఏసీపీ డాక్టర్‌ కె.హనుమంతరావు శనివారం విలేకరులకు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన జక్కంపూడి(జక్కంశెట్టి) సాయిబాబా అలియాస్‌ సాయి పాత నేరస్థుడు. వ్యసనాలకు బానిసైన సాయి ఆలయాల్లో చోరీలు మొదలుపెట్టాడు. 


దర్శనానికి వచ్చి.. రథంపై కన్నేసి..

గతేడాది జూన్‌లో విజయవాడకు వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నాడు. మహామండపం నుంచి కిందికి వస్తుండగా పక్కనే ఉన్న ఉత్సవమూర్తుల రథాన్ని గమనించాడు. రథంపై కప్పి ఉన్న టార్పాలిన్‌ కొంత చిరిగిపోయి ఉండటం, అందులో నుంచి వెండి సింహాల ప్రతిమలు కనిపించడంతో వాటిపై కన్నేశాడు. తర్వాత గొల్లవానితిప్ప వెళ్లిపోయాడు. భీమవరంలో రెండు గట్టి ఇనుపరాడ్లు కొనుగోలు చేసి, గోనె సంచితో జూలై మొదటివారంలో విజయవాడకు చేరుకున్నాడు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు శివాలయం మెట్ల వైపు ఉన్న చిన్న ప్రహరీ దూకి రథం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఎలాంటి భద్రత లేకపోవడంతో రథంపై ఉన్న టార్పాలిన్‌లోకి దూరిపోయాడు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లతో సింహాల ప్రతిమలను కింది నుంచి పైకి బలంగా లేపడంతో మూడు ప్రతిమలు ఊడిపోయాయి. నాలుగో సింహం ప్రతిమ మాత్రం రాలేదు. మూడు ప్రతిమలను గోనె సంచిలో వేసుకుని ఆటోలో గుడివాడకు చేరుకొని, అర్ధరాత్రి 2.30 గంటలకు మరో ఆటోలో తణుకు శివారున ఉన్న కొడవెల్లి గ్రామం వరకు వెళ్లాడు. ఎవరికీ అనుమానం రాకుండా కాల్వగట్టుపై ఈ మూడు ప్రతిమలను ఆకారాలు లేకుండా చేయడానికి ఇనుప రాడ్‌తో కొట్టాడు.


తెల్లారిన తర్వాత తణుకులోని సురేంద్ర జువెలరీ యజమాని ముత్త కమలేశ్‌కు రూ.35వేలకు వాటిని విక్రయించాడు. వాటిని కమలేశ్‌ కరిగించేసి చిన్నచిన్న ఆరు దిమ్మలుగా తయారు చేశాడు. జూలై మొదటి వారంలో చోరీ జరిగితే సెప్టెంబరు 16వ తేదీన వెలుగులోకి వచ్చింది. దీనిపై వన్‌టౌన్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పాతనేరగాళ్ల జాబితాను వడపోస్తున్న సమయంలో సాయి పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించగా నేరం అంగీకరించాడు. సింహం ప్రతిమలకు సంబంధించిన తొమ్మిది కిలోల వెండి, ఇతర చోరీలకు సంబంధించి మరో 6.4 కిలోల వెండి, మొత్తం 15.4 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయిని విచారించాల్సి ఉందని కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. సాయిని శనివారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు.




Updated Date - 2021-01-24T05:57:00+05:30 IST